Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


    విదర్భ రాజునకు సంతానము లేకుండెను. అతడు అగస్త్యుని ఆశ్రయించినాడు. అగస్త్యుని ప్రభావమున అతనికి ఒక కూతురు కలిగినది. ఆమె పేరు లోపాముద్ర. ఆమె యవ్వనవతి అయినది. ఆమె అందమయినది.
    అగస్త్యుడు విదర్భ రాజు వద్దకు వెళ్లినాడు. లోపాముద్రను తనకిచ్చి వివాహము చేయమన్నాడు. అడవులలో ఉండి కాయగసరులు తినువానికి తన కూతురును కట్టబెట్టుటకు రాజు మనసు అంగీకరించలేదు. ఇవ్వననిన అగస్త్యుడు శపించునేమో అని భయపడినాడు. రాజు రాణి ఇందును గురించి ఆలోచించుచు దుఃఖించినారు.
    లోపాముద్ర తల్లిదండ్రుల బాధ గ్రహించినది. "తల్లిదండ్రులారా! మీరు విచారింపవలదు. అగస్త్యుని వివాహమాడుటకు నేను అంగీకరించుచున్నాను. నన్ను ఆ మహర్షికి ఇచ్చి పెండ్లి చేయుడు సందేహము వలదు" అన్నది.
    లోపాముద్ర మాటలకు రాజు, రాణి సంతసించినారు. అగస్త్యునకు లోపాముద్రను ఇచ్చినారు. విధి పూర్వకముగా వివాహము చేసినారు.
    అగస్త్యుడు లోపాముద్రను పరిగ్రహించినాడు. ఆమెకు రాజ లాంఛనములు తొలగించినాడు. కృష్ణాజినములు ధరింప చేసినాడు. ఆమెను తీసుకొని గంగా ద్వారమునకు వెళ్లినాడు. తపస్సు చేయసాగినాడు.
    ఒకనాడు అగస్త్యుడు లోపాముద్రను తదేకముగా చూచినాడు. ఆమెలోని సొగసులు అతనిని కవ్వించినవి. అతడు మన్మధ వికారము గలవాడయి లోపాముద్రను సమీపించినాడు. ఆమె గ్రహించినది, సిగ్గుతో తలవంచుకున్నది. కాలి బొటనవ్రేలితో నేలపై వలయాలు తీర్చినది. "ప్రాణనాధా! సంతానము కొఱకు భార్యాభర్తలు రమించుట లోక ప్రసిద్ధము మీరు గంధపుష్ప వస్త్రభూషణములు ధరించి, నాకు భూషణాలంకారములు కల్పించి ఋతుకాలమున నాతో రమించి పుత్ర సంతానము కలిగించవలెనని నా కోరిక. నాకోరికను మీరు మన్నించవలెను" అని తల ఎత్తి భర్తను చూచినది. తలవంచుకున్నది.
    అగస్త్యుడు లోపాముద్రను చూచినాడు. ఆమె మాటలు విన్నాడు అతడు చలించలేదు. లోపా! నాకు తపోధనము ఉన్నది. మరొక ధనములేదు. ధనము కొఱకు తపస్సును వ్యయపరచలేను. అయినను నీ కోరిక తీర్తును. ధనము ఆర్జించి తెత్తును" అని అగస్త్యుడు బయలుదేరినాడు.
    అగస్త్యుడు శ్రుతపర్వుని వద్దకు వెళ్లినాడు. "రాజా! నేను ధనాపేక్షతో నీవద్దకు వచ్చినాను. నీవు పోషించు జనులకు విఘ్నము కాకుండునట్లు మిగుల ధనము ఉన్నచో నాకు ఇమ్ము" అని అడిగినాడు. అందుకు శ్రుతపర్వుడు "మహాత్మా! నాకు ఆదాయ వ్యయములు సమానముగా ఉన్నవి. వ్యయమునకు మించిన ధనము నావద్దలేదు" అన్నాడు.
    అంతట అగస్త్య శ్రుతపర్వులు కలిసి బృహదశ్వుని వద్దకు వెళ్లినారు. అగస్త్యుడు "రాజా! నేను ధనాపేక్షతో నీవద్దకు వచ్చినాను. నీవు పోషించు జనులకు విఘ్నము కాకుండునట్లు మిగుల ధనము ఉన్నచో నాకు ఇమ్ము అని అడిగినాడు. అందుకు బృహదశ్వుడు "మహాత్మా! నాకు ఆదాయ వ్యయములు సమానముగా ఉన్నవి. వ్యయమునకు మించిన ధనము నా వద్ద లేదు" అన్నాడు.
    అంతట అగస్త్య, శ్రుతపర్వ, బృహదశ్వులు ప్రాదశ్వుని దగ్గరికి వెళ్లినారు. ప్రాదశ్వుని వద్ద కూడ ఆదాయ వ్యయములకు మించిన ధనము లేదని తెలిసినది. "మహాత్మా! రమణీమతీ పట్టణమున వాతాపి, ఇల్వలుడు అను రాక్షసులున్నారు. వారు అన్నదమ్ములు. వారిలో ఇల్వలుడు పెద్దవాడు. అతనివద్ద అధిక ధనమున్నది. లోకమందలి రాజులందరికంటే ఇల్వలుడే అధిక ధనవంతుడు. అతడు మనకు ధనము ఇచ్చుటకు సమర్థుడు" అని ప్రాదశ్వుడు విన్నవించినాడు.
    రాజర్షులు ముగ్గురును, అగస్త్యుడును ఇల్వలుని వద్దకు బయలుదేరినారు. ముగ్గురు రాజులు ముందుగానే ఇల్వలుని కథ అగస్త్యునికి చెప్పినారు:-
    ఇల్వలుడు, వాతాపి మాయావులు. వారు బ్రాహ్మణులను భోజనమునకు పిలుతురు. అంతట వాతాపి మేక రూపము ధరించును. ఇల్వలుడు వానిని వధించును,వధించి బ్రాహ్మణునకు వడ్డించును. బ్రాహ్మణుడు భుజించిన తరువాత ఇల్వలుడు వాతాపిని రమ్మని పిలుచును. వాతాపి అతిథి కడుపు చీల్చుకొని బయటకి వచ్చును. అతిథి చచ్చును. ఈవిధమయిన మాయోపాయములచే వారు అనేకమంది బాపలను హతమార్చినారు. అగస్త్యుడును, రాజర్షులును ఇల్వలుని వద్దకు వెళ్లినారు. ఇల్వలుడు వారిని చూచినాడు. వారిని శాస్త్ర విధిని సత్కరించినాడు. ఎప్పటివలెనే వాతాపిని మేకను చేసి, వధించి, వండి పెట్టినాడు. అగస్త్యుడు గ్రహించినాడు. అయినను మాంస సహితమయిన అన్నమును భుజించినాడు. బయటకు వచ్చినాడు. కడుపు నిమురుకొని బ్రేవ్ అని త్రేన్చినాడు. ఎప్పటి వలెనే ఇల్వలుడు వాతాపిని పిల్చినాడు. ఇంకెక్కడి వాతాపి! అగస్త్యుని ఉదరమున జీర్ణమయినాడు. ఇల్వలుని పన్నాగము నాటితో భగ్నమయినది.
    ఇల్వలుడు తన పరితాపమును అగస్త్యునకు తెలియకుండునట్లు అగస్త్యునకు సాగిలి మ్రొక్కినాడు. వారి రాకకు కారణమేమని అడిగినాడు.
    "ఇల్వలా!" అగస్త్యుడు సహితము ఎఱుక కానివ్వకుండ చెప్పినాడు. "నేను ఈ ముగ్గురు రాజర్షులతో నీ వద్దకు వచ్చినాను. నీవు ధనవంతుడవని విని వచ్చినాను. నీవద్ద ధనము మూల్గుచున్నదని విని వచ్చినాను.నీవద్దకు ధనాపేక్షతో వచ్చినాను".
    "మహాత్మా!" ఇల్వలుని గర్వము అణగి, సవినయముగా అన్నాడు. "మీకు కావలసినంత ధనము ఇచ్చెదను ఎంత కావలెనో చెప్పుడు".
    "ఇల్వలా!" అగస్త్యుడు ఆదేశించినాడు. "ఈ ముగ్గురు రాజులకు ఒక్కొక్కరికి పదివేల గోవులను, పదివేల వరహాలను ఇమ్ము. నాకు ఇరువదివేల వరహాలను ఒక బంగారు రథమును ఇమ్ము".
    ఇల్వలుడు ఆ ప్రకారమే గోవులను, వరహాలను, రథమును ఇచ్చినాడు. వారు బంగారు రథమును ఎక్కి అగస్త్యుని ఆశ్రమమునకు చేరినారు. రాజులు ధనము తీసుకొని తమ రాజ్యములకు వెళ్లినారు. లోపాముద్ర సమస్త భూషణములు ధరించినది. అగస్త్యుడును అలంకరించుకున్నాడు. లోపాముద్రను అడిగినాడు:- లోపాముద్రా! నీకు వేయిమంది పుత్రులు కావలెనా? వేయిమందితో సమానుడగు ఒక్క పుత్రుడు కావలెనా? నీకు కావలసినంత మంది పుత్రులను కలిగింతును".
    "ప్రాణనాథా! గుణహీనులయిన వేయిమంది పుత్రులుండి ప్రయోజనమేమి? గుణవంతుడయిన ఒక పుత్రుని ప్రసాదించుము" అని ప్రార్థించినది.
    అగస్త్యుడు ఆమె ప్రార్థన మన్నించి, ఆమెకు గర్భాదానము చేసినాడు.తదుపరి తపస్సునకుగాను తపోవనమునకు వెళ్లినాడు.
    లోపాముద్ర ఏడేండ్లు గర్భము ధరించి ప్రసవించినది. ఆమెకు దృశ్యుడను పుత్రుడు కలిగినాడు. అతడు వేదములను రహస్యముగా జపించుచు, సూర్య సమాన తేజస్కుడయి వర్ధిల్లినాడు. అతనికి "తేజస్వి" అను పుత్రుడు కలిగినాడు. అతడు సమిధలను ఎక్కువగా మోసినాడు. అందువలన అతనికి "ఇధ్వవాహుడు" అని పేరు వచ్చినది.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More