Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
15. సోమమా! నీవు దీప్తివంతుడవు. నిన్ను యజమానులు తెచ్చినారు. యజ్ఞము కొరకు సంశోధితుడవైనావు. ఇంద్రుని వద్దకు చేరుము.
16. సోమము వేగశాలి. అంతరిక్షమునకు ప్రేరితుడగును. వ్రేళ్లచే మధించబడి ఉత్పన్నుడగును.
17. శోధిత, గతిపరాయణ సోమము సులభముగా ఆకసము వైపు సాగును. ఉడకస్థానమునకు చేరును.
18. సోమమా! నీవు మమ్ము అభిలషింతువు. నీ బలమున మా ధనమును రక్షింపుము. "పాహినః శర్మం వీరవత్ పుత్రుని వలె మా ఇంటిని కాపాడుము."
19. వహనశీల అశ్వము ధ్వని చేయునపుడు స్తోతలు దానిని యజ్ఞస్థలమునకు చేర్చినపుడు అశ్వరూప సోమము జలమున నిలుచును.
20. వేగవంత సోమము హిరణ్మయమగు యజ్ఞస్థానము ఆసీనుడైనపుడు స్తోత్రశూన్యుల యజ్ఞముల జాడకానడు.
21. మంచి స్తోతలు సోమమును స్తుతింతురు. బుద్ధిమంతులు సోమమును యజింతురు. దుర్బుద్ధులు నరకమున పడుదురు.
22. సోమమా! నీవు అత్యంత మధురమవు. యజ్ఞస్థానము పొందుటకు ఇంద్రుడు, మరుత్తుల కొరకు క్షరితమగుము.
23. క్షరణశీల సోమమా! నిన్ను ప్రాజ్ఞులు, కర్తలగు స్తోతలు అలంకరింతురు. మానవులు చక్కగా శోధింతురు.
24. పవమాన సోమమా! క్షరణశీలమగు నీ యొక్క రసమును మిత్ర, ఆర్యమ, వరుణులందరు సేవింతురు.
25. ప్రదీప్త, క్షరణశీల సోమమా! జ్ఞానపూతము. సహస్రభరం వాక్యమునకు ప్రేరణ కలిగింతువు.
26. ప్రదీప్త, క్షరణశీల సోమమా! యజ్ఞాభిలాషి, సహస్రభరణ వాక్యము మా చెంతకంపుము.
27. సోమమా! నీవు పురుహూతుడవు - అనేకమందిచే ఆహ్వానించబడువాడవు. క్షరణశీలుడవు. ఈ యజ్ఞమున స్తోతలకు ఇష్టుడవగుము. ద్రోణకలశమున ప్రవేశింపుము.
28. ఉజ్వలము, ప్రకాశమానము, దీప్తము, నలుదిశల ధ్వనించు ధారాయుక్త సోమమందు పాలు చేర్చబడును.
29. యోద్ధలు యుద్ధభూమిలో ప్రవేశించగనే ఆక్రమింతురు. అట్లే బలి, స్తోతలు ప్రేరేపించిన సోమము యజ్ఞరూప యుద్ధమును ఆక్రమించును.
30. సోమమా! జ్ఞానము, బలము కలగలసిన నీవు దర్శనమిచ్చుటకు ద్యులోకమునుండి దిగిరమ్ము.
(శ్రీమదాంధ్రవచన ఋగ్వేదసంహిత తొమ్మిదవ మండలము ఏడవ అష్టకమున మొదటి అధ్యాయము సమాప్తము)
ఓం నతామనన్తి మాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమే స్థివాంసః
రెండవ అధ్యాయము అరువది అయిదవ సూక్తము
ఋషి - వరుణపుత్ర భృగువు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి
ఓం హిన్వన్తిసూరముస్రయః స్వసారోజామాయస్పతిమ్ః
మహామిన్దు మహేయువః
1. అంగుళులు పరస్పర బంధు భూతములు. అవి కార్యకుశలలగు స్త్రీలవంటివి. అవి నిన్ను అభిషవించ కోరుచున్నవి. చక్కని బలము కలిగి, సకలలోకములకు ప్రభువై, మహామహుడగు తమ పతి సోమము క్షరణశీలము కావలెననుకొనుచున్నవి - అంగుళులు.
2. దశాపవిత్రమున శుద్ధమై, తేజస్సు ద్వారా దీప్తమైన సోమమా! దేవతల వద్దగల నిఖిలధనమును మా కిమ్ము.
3. పవమాన సోమమా! దేవతలను సేవించవలసి ఉన్నది. శోభన స్తుతివంతమగు వర్షము కల్గించుము. మా అన్నము కొరకు వర్షించుము.
4. సోమమా! నీవు అభీష్ట ఫలప్రదుడవు. తేజోవంతములగు కిరణములవాడవు. మేము శుభకర్ములము. నిన్ను యజ్ఞమునకు హవామహే, ఆహ్వానించుచున్నాము.
5. నీ యొక్క ధనురాద్యాయుధములు శోభనములు. దేవతలను ఉన్మత్తులను చేయుము. మాకు వీరుడగు పుత్రుని ప్రసాదించుము. చమసములందున్న సోమమా! మా యజ్ఞమునకు "ఆగాహి" విచ్చేయుము.
6. సోమమా! నీవు బహువులచే సంశోదితుడవగుదువు. వసతీవరీ జలముతో సించితుడవగుదువు. అప్పుడు నీవు కర్రగిన్నెలో నిలిచి స్వస్థానము స్వీకరింతువు.
7. సోమము వ్యశ్వఋషివంటి దశాపవిత్రమున సంస్కరించబడినది. మహిమాన్వితము. అనేక స్తోత్రయుక్తము. స్తోతలారా! సోమమును గూర్చి "గాయత, పాడండి."
8. సోమము శత్రునివారకము. మధుర రసదాయి. హరితవర్ణ. దీప్తమంతుము. అధ్వర్యులారా! "ఇంద్రాయ పేతాయే - ఇంద్రుని పానము కొరకు - సోమమును అభిషవించండి."
9. సోమమా! నీవు బలశాలివి. సకల శత్రుధనములకు నేతవు. నీ సంఖ్యతను "వృణీమహె" - భజింతము.
10. అభీష్టఫల ప్రదాత సోమమా! ధారారూపమున ద్రోణపాతుకు విచ్చేయుము. ఇంద్రమరుత్తులకు మదకరుడవగుము.
11. పవమాన సోమమా! నీవు ద్యావా పృధ్వులు భరించువాడవు. స్వర్గద్రష్టవు. దేవతలకు దర్శనీయుడవు. బలశాలివి. నేను నిన్ను యుద్ధభూమి కంపుచున్నాను.
12. సోమమా! నీవు అంగుళులచే పుట్టినవాడవు. అభిషుతుడవు. హరితవర్ణుడవు. ద్రోణ కలశముకు విచ్చేయుము. ఇంద్రుడు నీకు మిత్రుడు. అతనిని యుద్ధమున కంపుము.
13. సోమమా! నీవు దీపకుడవు. విశ్వప్రకాశకుడవు. మాకు విశేష అన్నమును అందింపుము "అస్మాభ్యం సోమగాతు విత్" మాకు స్వర్గమార్గము చూపుము.
14. క్షరణశీల సోమమా! అభిషవ కాలమున బలయుతుడవగుము. ధారల ద్రోణ కలశమున ప్రవేశింపుము. స్తోతలచే స్తుతించబడుము. ఇంద్రుని పానము కొరకు చషకమున చేరుము.
15. సోమమా! ణీ యొక్క రసము మాదకము. వెంటనే మత్తు కలిగించునది. అధ్వర్యాదులు రాళ్లతో రసమును తీయుదురు. పాపులపాలిటి ఘాతుకుడవై క్షరితుడవగుము.
16. మానవులు యజ్ఞము చేయుచున్నారు. సోమసామ్రాట్టును ఆకాశమార్గమున ద్రోణకలశముకు విచ్చేయుమని స్తుతించుచున్నారు.
17. క్షరణ శీల సోమమా! మమ్ము రక్షింపుము. మాకు వందల, వేల గోవులనిమ్ము. పుష్టిగల అశ్వములనిమ్ము. స్తుతించదగు ధనమునిమ్ము.
18. సోమమా! దేవతల పానము కొరకు అభిషుతడవగుము. శత్రువును కూల్చదగిన బలమును, సర్వత్ర ప్రకాశించుటకు రూపమును ప్రసాదించుము.
19. శ్యేనపక్షి శబ్దము చేయుచు గూటికి చేరును. క్షరణశీల, దీప్తమంత సోమము శబ్ధము చేయుచు దశాపవిత్రము నుండి ద్రోణకలశమునకు చేరును.
20. వసతీవరీ నామక జలమున పుట్టిన సోమము ఇంద్ర, వాయు, విష్ణు, అన్యదేవతల కొరకు ప్రవహించును.
21. సోమమా! మా పుత్రునకు అన్నము ఇమ్ము. మాకు వేనకు వేలధనము నిమ్ము.
22. దూరమందుగాని దగ్గరలోగాని ఇంద్రుని కొరకు అభిషుతమైన సోమము కురుక్షేత్రమునందలి శర్యణావతమున అభిషుత సోమము మాకు కోరిన ఫలము ప్రసాదించవలెను.
23. ఆర్జికమున, కృత్వదేశమున, సరస్వతినదీ తీరమున, పంచజనమున ప్రతిష్ఠిత సోమము మాకు కోరిన వరములు ప్రసాదించవలెను.
(ఆర్జిక, కృత్వ దేశములు. పంచజనులు నిషాదసహితముగా నాలుగు వర్ణములు. అయిదు వర్ణముల వారును సోమాషవమునకు అర్హులు)
24. ఆవిధముగా సకల జనులచే అభిషుతము. దీప్త చమసమునందలి క్షరణశీల సోమము ఆకసమునుండి వాన కురిపించవలెను. మాకు శోభన వీర్యవంతులగు పుత్రులను ధానాదులను ఇవ్వవలెను.
25. సోమము దేవాభిలాషి హరితవర్ణ. గోచర్మము పై ఉంచబడినది. జమదగ్ని స్తుతించినది. అట్టిసోమము పాత్రలో ప్రవేశించు చున్నది.
26. నీటిలోనికి తీసికొనిపోయి అశ్వములను రుద్దినట్లు - దీప్త, అన్నప్రేరక, క్షీరదియుక్త సోమమును వసతీవరిలో పురోహితులు మర్జింతురు.
27. సోమమా! అభివమైనంత ఋత్విక్కులు ఇంద్రాది దేవతల కొరకు నిన్ను రాతితో ప్రేరణ కలిగింతురు. నీవు అభిషుతమై దీప్త ధారతో ద్రోణకలశమున పడుము.
28. సోమమా! ణీ బలము సుఖావహము. అరణ్యాదులు అందు కొనునది. శత్రువులనుండి రక్షించునది అనేకమంది అభిలషించునది. యాజ్ఞికులమగు మేము నేటి యజ్ఞమున ణీ బలమును భజింతుము.
29. సోమమా! నీవు మదకరుడవు. సేవ్యుడవు. విప్రుడవు. స్తుతియుకుడవు. సర్వరక్షకుడవు. అనేకులచే తలచుకొనువాడవు. నిన్నుమేము కీర్తింతుము.
30. శోభన యజ్ఞసోమమా! మేము ణీ ధనమును ఆశ్రయింతుము. నీవు సర్వరక్షకుడవు. ఎంతో మంది అభిలషించువాడవు. నిన్ను ఆశ్రయింతుము. మా పుత్రులకు మంచి ధనమును, చక్కని జ్ఞానమును ప్రసాదించుము.
అరువది ఆరవ సూక్తము
ఋషి - శతవైభావసులు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - 18
అనుష్టుప్ - మిగిలినవి గాయత్రి
1. సోమమా! నీవు సూక్ష్మదర్శకుడవు. సఖుడవు. స్తోతవ్యుడవు. మేము నీకు మిత్రులము. మా కొరకు - సకల కర్మ స్తోత్ర లక్ష్యముగా క్షరితుడవగుము.
2. పవమాన సోమమా! నీకు గల రెండు వంకర కిరణములతో నీవు సకల లోకములకు స్వామివి అయినావు -తాభ్యాం విశ్వస్య రాజసి.
3. శోధిత, క్రాంతకర్మ సోమమా! నీ కిరణములు నలువైపుల వ్యాపించి ఉన్నవి. దానితో వసంతాది రుతువులందు నీవు సర్వత్ర శోభిల్లుదువు.
4. సోమమా! నీవు మా మిత్రుడవు. మా సకల స్తోత్రములను ధ్యానముగ వినుము. మిత్రులమగు మమ్ము రక్షించుటకును, మాకు అన్నము కలిగించుటకును విచ్చేయుము.
5. నీ కిరణములు తేజోవంతములు. సర్వత్ర జ్వలన శీలములు. పూజనీయములు. అవి భూమి మీద జలములను విస్తరింప చేయును.
6. సోమమా ! సప్తసింధువులు నీ ఆజ్ఞనే అనుసరించును. నీ కొరకే గోవులు పరుగులిడును. "తుభ్యంధావన్తి ధేనవః"
7. సోమమా! నీవు ఇంద్రునకు మదకరుడవు. మాచే అభిషుతుడవు. దశాపవిత్రము నుండి వెడలుము. ద్రోణ కలశమున ప్రవేశింపుము. "దధానో అక్షితిశ్రవః" మాకు అక్షయ ధనము అందించుము.
8. సోమమా! సప్తహోతలు స్తుతించుచు, దేవతల సేవకుడగు యజమాని యజ్ఞమున విప్రుడవు, క్షరణ శీలుడవగు నిన్ను - కీర్తించినారు.
9. సోమమా! అంగుళులు త్వరపడును. త్వరపడును. శబ్దించును. మేషలోమముతో చేసిన దశాపవిత్రమున నిన్ను పడవేయును. అప్పుడు నీవు ధ్వని చేయుచు వసతీవరీ జలములందు సించిత మగుదువు.
10. క్రాంతప్రజ్ఞ, అన్నవంతసోమమా! అన్నము తెచ్చుటకు అశ్వములు ఉరుకునట్లు యజమానులకు అన్నము కోరునట్టి నీ ధారలు ఉరుకును.
11. ద్రోణకలశము మధురరసము కురిపించునది. దానిని లక్ష్యముగా చేసి మేషలోమమయ దశాపవిత్రమున పురోహితులు సోమమును చేయుదురు. మా అంగుళులు సోమమును శుద్ధిచేయ కోరుచున్నవి.
12. పాలిచ్చి మానవులను ఆనందపరచు ఆవులు కొట్టమునకు పోయినట్లు క్షరణశీలసోమము సంగమ స్థానమగు ద్రోణకలశమువైపు పోవును. "అగ్మన్నృతస్యయోనిమా" సోమము యజ్ఞస్థానమునకు పోవును.
13. సోమమా! నిన్ను దుగ్ధాదులందు కలుపునపుడు - మా యజ్ఞమునకుగాను క్షరణశీల జలము వైపు సాగుదువు.
14. మేము నీ పూజాభిలాషులము. నీ బంధుత్వమున, నీ రక్షణలందున్న వారలము. నీ బంధుత్వమును ఆకాంక్షించుచున్నాను.



