Home » D Kameshwari » Sikshaw
రెండు మూడుసార్లు చూశాను, ఇందాకటి నుంచి ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. నీ పేరు శ్యామల, ఆ రోజు నీవు స్వయంగా నా ఎదుటికి వచ్చి ధైర్యంగా శరణాలయంలో జరిగే దురాగతాలన్నీ చెప్పావుగదూ.... ఆ....నాకు బాగా గుర్తువచ్చింది. నీ విక్కడ ఎందుకున్నావు? ఇప్పుడు ఆశ్రమంలో వుండటంలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు. ఆశ్రమం వదిలి ఏన్నర్ధం అయింది నా చదువు పూర్తి అయి ఈ వూర్లోనే ఓ ఆఫీసులో చిన్న ఉద్యోగం దొరకగానే వచ్చేశాను. రంగారావు "నీకేం ఫరవాలేదు నీకు పూర్తిగా నయమయే వరకు ఇక్కడే ఉందువుగాని, నేను డాక్టరుతో చెప్తాను.... మీ ఆఫీసువాళ్ళకి కూడా చెప్తాను కొన్నాళ్ళు శలవు కావాలని. నేను తర్వాత మరోసారి వస్తాను. నీకేం ఇబ్బంది ఉండదు. అంతా నేను చూస్తాను." అని అన్నాడు. రంగారావు డాక్టరుతో అన్నీ మాట్లాడి ట్రీట్ మెంట్ అదీ సరిగా చూడమని చెప్పి ఖర్చు అంతా తను పెట్టుకుంటానని అన్నీ మాట్లాడి వెళ్ళారు. ఆ రాత్రి రంగారావుకి చాలాసేపు నిద్రపట్టలేదు. ఆ ఏక్సిడెంటులో ఆయనకి పాత గాయం కెలికినట్లు యేదో అలజడి గుండెదడ కలిగి విశ్రాంతిగా పడుకోలేక పోయారు. అంతే కాదు పదే పదే శ్యామల మొహం గుర్తురాసాగింది. ఆయనకి మొదటిసారి శరణాలయంలో శ్యామలని చూసిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. యధాప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం చూడటానికి రాణితో సహా వెళ్ళారు రంగారావు గారు. ఆ రోజు అలవాటుగా శరణాలయం తిరిగి చూసి పిల్లలకి మిఠాయిలు, బట్టలు పంచి పెట్టక రంగారావు పిల్లలని ఉద్దేశించి మీటింగులో మాట్లాడుతున్నారు. శరణాలయం తీర్చి దిద్దడానికి అనాధ బిడ్డలకి ఆశ్రయం యివ్వడానికి తమ చేతనయినంతగా కృషి చేస్తామని, పిల్లలందరూ బుద్ధిగా చదువుకుని ప్రయోజకులు కావాలని కాంక్షిస్తున్నామని ఉపన్యాస ధోరణిలో చెపుతున్నారు. అంతలో పిల్లల మధ్యనించి ఒక అమ్మాయి లేచి నుంచుంది. వినయంగా నమస్కరించి తమతో రెండు మూడు మాటలు మాట్లాడటానికి అనుమతిస్తారా?" అంది ధైర్యంగా. రంగారావు ఆశ్చర్యంగా చూశారు. అక్కడున్న వాళ్ళకి పెద్ద పిల్లగా వుంది కట్టుకున్న చీర పాతపడినా శుభ్రంగా, పొందికగా కట్టుకుంది. మొహంలో తెలివి తేటలు కనిపించాయి అంటే రంగు లేకపోయినా ముఖం తీరుగా వుంది. ముఖ్యంగా కళ్ళు మెరుస్తున్నాయి చాలా పేదగా, నిరాడంబరంగా ఉన్నా ఆమె మొహంలో, మాటలో ఆత్మ విశ్వాసం, సంస్కారం కనిపించాయి, రంగారావు ఆమెని ఆశ్చర్యంగా పలికింది.
"చెప్పమ్మా....." అన్నారు. మేనేజరు, గుమాస్తా కలవరపడ్తూ మొహాలు చూసుకుని "ఏయ్.....శ్యామలా కూర్చో కూర్చో......జమీందారుగారు మాట్లాడతూంటే మధ్యలో గొడవచేస్తావా...ఊ కూర్చో" అంటూ ఉరిమిచూశారు. రంగారావు వారిని వారిస్తూ, "ఫరవాలేదు, ఇలా వచ్చి చెప్పమ్మా' అన్నాడు అనునయంగా.
శ్యామల ధైర్యంగా వేదిజ దగ్గరకి వచ్చి భక్తిగా జమీందారు దంపతులకి నమస్కరించింది. తమరు ధర్మప్రభువులు మాలాంటి అనాధలు రోడ్డుమీదపడి అడుక్కుతినే గతి పట్టకుండా మీ దయవల్ల నిలవనీడ, తినడానికి యింత తిండి చూపించారు. కాని మీరు పెడుతున్న ఆ తిండి మేము తినగలుగుతున్నామో లేదో, ఆ తిండి మా నిర్భాగ్యుల నోటిదాక రాకముందే మధ్యలోనే గద్దలు తన్నుకు పోతున్నాయన్న సంగతి మీ కేమయినా తెలుసా, తెలియదు అంతా మీ లాంటి ధర్మాత్ములు దయగలవారే ఉండరన్న నిజం మీకు తెలియదు......దేముడు వరములు యిచ్చినా పూజారి వరము యివ్వనట్లు, గవర్నమెంటు- మీలాంటి ధర్మాత్ములు యిస్తున్న డబ్బులో మా కొరకు ఎంత వినియోగింప బడుచున్నది మీకు తెలియదు." శ్యామల చాలా స్థిరంగా, శాంతంగా చెప్పుతుంది.
రంగారావు తెల్లబోయారు, మేనేజరు, గుమాస్తా బిత్తరపోయారు, చెమటలు పట్టడం ఆరంభించాయి. శ్యామల అంత ధైర్యంగా మాట్లాడుతుంటే పిల్లలంతా బెరుకుగా చూశారు. రంగారావు ఆశ్చర్యంగా...... "అంటే- నీ ఉద్దేశం ఏమిటీ సరిగా చెప్పు మీకిక్కడ సదుపాయం సరిగా లేదా?......"
"హు - సదుపాయాలు, భోగాలు ఇవి మాలాంటి అనాధల కెక్కడనించి వస్తాయి. కావాలని ఎలా కోరుకుంటాం బాబుగారూ మాకు కావల్సింది. ఈ కడుపు నింపుకోవడానికి రెండు పూటలా ఇంత తిండి. ఈ వళ్ళు దాచుకోవడానికి ఇంత బట్ట అదే కరువయింది. ఇచ్చిన వాళ్లిస్తున్నా మధ్యవాళ్ళు అవి మాదాకా రానీయడం లేదని మనవి చేస్తున్నాను. మేనేజరు కంగారుగా లేచిపోయాడు. గబగబ వేదిక దగ్గరకొచ్చి ఉగ్రుడయి ఏదొకటి చెప్పబోయాడు. జమీందారు అతన్ని చేత్తో వారించి "యింక వివరంగా చెప్పమ్మా మాకర్ధం కాలేదు." శ్యామల, మేనేజరు వంక ఒకసారి తిరస్కరంగా చూసి వేదిక దిగి చరచర లోపలికి వెళ్ళింది అంతా తెల్లబోయి చూస్తుండగానే రెండు చేతుల్లో యిద్దరు చంటి పిల్లలని ఎత్తుకొని మరో యిద్దరు, నాలుగైదు సంవత్సరాల, పసివాళ్ళని తీసుకొచ్చి "బాబూ....... ఈ బిడ్డల్ని మీరే చూడండి? ఈ నోరెరుగని పసివాళ్ళని చూస్తే మీకు నేనేం చెప్పనక్కర లేకుండానే అర్ధం అవుతుంది. ఇంత పసిపిల్లలు కూడా ఆకలి వేస్తే ఏడవడానికి భయపడతారు. ఎందుకో తెలుసా. దొరికేది పాలుగాదు దెబ్బలు శరణాలయానికి వచ్చే పాలడబ్బాలు తాగుతున్నది ఈ పసివాళ్ళు గాదు. అదిగో ఆ పెద్దలు, అంతా లాలూచీ అయి శరణాలయానికి వచ్చే పాలడబ్బాలేమిటి, డబ్బేమిటి, దినుసులేమిటి, అన్నీ వాళ్ళ పొట్టలలోకి వెళతాయి. యింక మా పొట్టలకి మిగిలేదేమిటి? ఇదిగో ఈ ఏడాది నిండని పనివాళ్ళకి పాలుగాదు గంజి పడ్తారు. మేం అందరం చస్తే వాళ్ళకి తిండి దొరకదు గనుక మా కందరికీ చావకుండా బతికేపాటి తిండి పడేస్తారు. ఆ తిండి మనుషులు తినేది కాదు. ఆ బియ్యం గొడ్లు కూడా తినవు. పోనీ అదీ కడుపునిండా పెట్టరు. కూర అని పేరు దాన్లో వుండేవి రెండు కూరముక్కలు, మజ్జిగ అన్నది పేరుకే. రాత్రి యిచ్చేవి రెండు రొట్టెలు. ఆ రెండు గొంతు దింపుకోడానికి రెండు గ్లాసుల నీళ్ళు తాగాలి రోజంతా స్కూలులో ఆకలి కడుపుతో మాడివస్తే దొరికేది కప్పు టీ నీళ్ళు బాబుగారూ మేం పెద్దపిల్లలం యేదో యిన్ని నీళ్ళు తాగి పొట్టనింపుకుంటాం అసలు యిక్కడ యిక్కడ బతికి బతికి మా పొట్టలో ప్రేగులు ఎండిపోయి ఆకలి అన్నది ఏనాడో చచ్చిపోయింది మాలో కాకపోతే యింకా ఎన్నాళ్ళు ఎలా బతుకుతాం.
పోనీ మాట వదిలేయండి.
అదిగో ఆ పసివాళ్ళని చూడండి. ఆకలి వేస్తే ఏడవటానికి కూడా శక్తి లేదు వాళ్ళకి. కడుపు ఎండిపోయి కాళ్ళు చేతులు పుల్లల్లా అయి ఆ శరీరంలో గుప్పెడు మాంసం అయినా వుందేమో మీరే చూడండి అంతా పసివాళ్ళ ఆకలి వేసినా ఏడవరు బిక్కుబిక్కుమని భోజనం గంట ఎప్పుడు వినిపిస్తుందా అని చూస్తారు. ఆ పసివాళ్ళు ఆయాల చేతుల్లో ఎలాంటి హింస అనుభవిస్తారో మీరూహించలేరు. వారి నిద్రకు భంగమైందో ఆ రోజు ఆ పాపచావు మూడిందే, వాళ్ళ కబుర్లకి అంతరాయం కలిగించారో చావు దెబ్బలు తిన్నారే ఆకలి అన్నారో చచ్చే దెబ్బలు దొరుకుతాయి. గట్టిగా ఏడవడానికి కాదు. గట్టిగా మాట్లాడడానికీ బెదురే వాళ్ళకి అసలు ఏడిచే, మాట్లాడే ఓపిక ఏది వాళ్ళకి బాబుగారూ. ఆ పిల్లలు రేపు పెరిగి పెద్దవారయితే మీరు చెప్పినట్టు ప్రయోజకులవుతారా. ఈ ఆకలి వాళ్ళని ఎంతలా లొంగదీసుకుంటుందో మీకు తెలియదు. ఈ పొట్ట నింపుకోడం కోసం వాళ్ళు దొంగలే అవుతారో, దోపిడీ దారులే అవుతారో, లంచగొండులవుతరో మీరూహించగలరా? అనాధలని ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి యెంత ఆశ్రయం దొరుకుతుందో మీకు తెలియదు. ఏ చెట్టు నీడనో ముష్టి ఎత్తుకు బతకవలసిన బతుకు కంటే యేదో నీడదొరికిందనే మేం సంతోషించడం మినహా ఏం చేయలేని అశక్తులం. కాని మీదానం! మీ ధర్మం అంతా మట్టికొట్టుకు పోతూందని- అపాత్రదానం అయిపోతూందన్నది పెద్దలు మీరు గ్రహించాలి పిల్లల పొట్టకొట్టి తమ పొట్టపోసుకునే పెద్దల ఆగడం మీరు తెలుసుకోమని నా కోరిక. ఇంతకంటే ఏం చెప్పలేను, ఇది నా ఒక్కదానిమాటగాదు. మా పిల్లలందరి ఆవేదన, అందరి గొంతులోంచి వచ్చిన ఆక్రందన! బాబుగారూ! ఈరోజు 'పెద్దక్క' గా పిల్లలందరి తరపున యాజమాన్యం గురించి నేను యీ విషయాలు చెప్పాక రేపటినుంచి యిక్కడ నా బతుకు మరింత నికృష్టంగా తయారవుతుందన్న సంగతి నాకు తెలుసు. ఫరవాలేదు. తక్కినవాళ్ళ సంతోషం కోసం నేను అవమానం సహించగలను. నేను బాధపడినా తక్కిన పిల్లల బాధ పోగొట్టగలిగితే అంతకు మించిన ఆనందం వుండదు ......" శ్యామల చాలా ఉద్రేకంగా ఉద్వేగంగా చెప్పి జమీందారుగారికి నమస్కారం చేసింది. అంత ఒక్కక్షణం నిశ్శబ్దం శరణాలయం సిబ్బంది అంతా ప్రాణాలుగ్గబెట్టుకొని చూస్తున్నారు. పిల్లల మొహాలు విప్పారాయి. తమకు న్యాయం జరుగాదా అన్న ఆశ, ఆరాటం కన్పించింది వాళ్ళ మొహాలలో.



