Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
22. ఇది ప్రథమ సోమరసము జలమును కదలించునది జలమున కలియునది ఇంద్రునకు అర్పించ బడుచున్నది.
నూట పదవ సూక్తము
ఋషి - త్యరుణత్ర, సదస్యు రాజద్వులు ఇద్దరు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - అనుష్టుప్ - బృహతి - జగతి.
1. సోమమా! అన లాభము కొరకు యుద్ధమునకు వెళ్లుము నీవు సహనశీలుడవు శత్రువు మీదికి పొమ్ము. నీవు మా ఋణపరిహారకుడవు. శత్రువును వధించుటకు తరలుము.
2. సోమమా ! నీవు అభిషుతడవు మహా మానవ సామ్రాజ్యమున నిన్ను మేము స్తుతింతుము. నీవు నీ రాజ్యమున రక్షించుకొనవలసి ఉన్నది శత్రువు లక్ష్యముగా సాగుము.
3. సోమమా! జలములనిచ్చు అంతరిక్షమందలి దివ్య బలములతో సూర్యుని సృష్టించినావు. నీవు స్తోతలకు పశుదాతవు. నీ వద్ద నానా విధ జ్ఞానములు ఉన్నవి. నీవు వేగవంతుడవు.
4. అమర సోమమా! నీవు సత్య, కళ్యాణమయ జలములున్న అంతరిక్షమున మానవుల దర్శనమునకు గాను. సూర్యుని సృష్టించినావు. పూజ్యుడవగు నీవు శత్రువు లక్ష్యముగా సాగిపోవుదువు.
5. ఒకడు త్రాగునీటి కొరకు తటాకము నిర్మించును. మరొకడు దోసిలిలో నీరు నింపును. అట్లే నీవు అన్నము కలిగించుటకుగాను పవిత్రమును చీల్చి సాగుదువు.
6. దివ్యుడు అందరిని ప్రోత్సహించు సూర్యుడు ఇంకను చీకట్లను తొలగించనేలలేదు. అప్పుడే ద్రష్టలు దివ్యలోకమున పుట్టిన 'వసురూచి' నామక జనులు తమ బంధువగు సోమమును స్తుతించినాడు.
7. సోమమా! ముఖ్యులు, దర్భలువిరుచు యజమానులు అన్నము, బలమునకుగాను మనసులందు నిన్ను ప్రతిష్ఠించినారు. వీర్య ప్రాప్తికి మమ్ము కూడ యుద్ధమునకు పంపుము.
8. ద్యులోకమునందలి దేవతల పానయోగ్యము. ప్రాచీనము, ప్రశస్తము మహాద్యులోనమందలి సోమమును జనులు తమ ముందుకు రప్పింతురు. ఇంద్రుని కొరకని పుట్టిన సోమమును స్తోతలు స్తుతింతురు.
9. వృషభము గోసమూహముల పెత్తనము చేయును. సోమమా! అట్లేనీవు ద్యులోక,
భూలోకమునందలి సకల ప్రాణి జాలమును పరిపాలింతువు.
10. సోమము బహు ధారావంతుడు అపార సమర్థుడుమ్ దీప్తుడు ద్రవణశీలుడు అతడు పవిత్రమున పసిబిడ్డవలె - ఆటలాడుచు క్షరించును.
11. శోధితము. మాధుర్యయుక్తము, క్షరణ శీలము, రుచికరము, రసవంతము, అన్నదాత, ధనపాపక, ఆయుప్రదాత సోమము ప్రవహించు చున్నది.
12. సోమమా ! ప్రవహింపుము. యుద్ధకామి శత్రువులను ఓడించుచు ప్రవహించుము. దుర్గమ రాక్షసులను హతమార్చుచు ప్రవహింపుము. శోభన ఆయుధవంతుడవై ప్రవహింపుము. శత్రువినాశకుడవై ప్రవహింపుము.
నూట పదకొండవ సూక్తము
ఋషి - పురుచ్చేపపుత్ర అనానతుడు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - అత్యష్టి
1. సూర్యుడు తనకిరణ పుంజమున చీకట్లను పారద్రోలును. శోధిత, హరితవర్ణ, శుభధారల సోమము రాక్షసులను పారద్రోలును. అభిషుత సోమధార దీప్తవంతమగును. శుద్ధిచేసిన ఆకు పచ్చని సోమము రుచికరమగును. సప్తతేజోవంతము, రసహరణము, స్తుతివంతము, తేజోయుక్త సోమము సమస్త నక్షత్రములను వెలిగించును.
2. సోమమా! నీవు పణులు అపహరించిణ గోధనమును సాధించినావు. యజ్ఞగృహమందు యజ్ఞధారకు జలమున శుద్ధుడవగుదువు. దూరమునుంచి సామస్వరము వలె నీధ్వని వినిపించును. సోమపు శబ్ధమందు కర్మనిష్ఠ యజమానులు ఆనందితురు. సోమము ముల్లోకములను బ్రతికించుజలమును, రోచక దీప్తిని ధరించును. స్తోతలకు అన్నప్రదానము చేయును.
3. జ్ఞానియగు సోమము పూర్వదిశకు సాగును. సోమపు రథము దివ్యము. సర్వదర్శనీయము. ఆరథము సూర్యకిరణములతో కలసి సాగును. జనులు ఉచ్చరించిన స్తోత్రములు ఇంద్రుని చేరును. అవి ఇంద్రుని ప్రసన్నుని చేసి విజయ కారకములు అగును వజ్రము సహితము ఇంద్రుని చేరును. యుద్ధక్షేత్రమున ఇంద్రుడు, సోమము శత్రువులకు అజేయులైనపుడు వారిని స్తుతింతురు.
నూట పన్నెండవ సూక్తము
ఋషి - అంగిరస శిశివు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - పంచపాద పంక్తి
1. మా కార్యములు అనేక ప్రకారములు. ఇతరులు కార్యములు కూడ అనేక ప్రకారములు, వడ్రంగి కర్రపనిని, వైద్యులు రోగమును, బ్రహ్మణుడు సోమాభిషవ కర్త యజమానిని కోరుదురు. నేను సోమప్రవాహము కోరుదును. "ఇంద్రాయోన్దో పరిస్రవ" సోమమా ఇంద్రుని కొరకు ప్రవహింపుము.
2. పాతకర్ర, పక్షులు ఈకలు, పదునుపెట్టు రాతితో బాణములు చేయబడును. వడ్రంగి బాణము కొనువారిని, బంగారుమున్న వాడు ధనికుని వెదకును. నేను సోమప్రవాహమును వెదకుదును, "ఇంద్రాయేందో పరిస్రవ"
3. నేనుస్తోతను. నా పుత్రుడు యజ్ఞబ్రహ్మ. కూతురు యవలు దంచును. మేము వేరు వేరు పనులు చేయువారలము గోవులు గోష్ఠమున తిరుగును. మేము ధనము కోరుచు సోమము కొరకు తిరుగుదుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
4. గుఱ్ఱము మంచిరథమును, మంచి సారథిని కోరును. విదూషకుడు హాస్యము కోరును. పురుషేంద్రియము రోమవంతమగ రెండు భేదములు కోరును - రో మణ్వంతౌ భేదా. నేను సోమపు ప్రవాహము కోరుదును. "ఇంద్రాయేందో పరిస్రవ"
నూట పదమూడవ సూక్తము
ఋషి - మారీచ కాశ్యపుడు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - పంచపాద పంక్తి
1. కురుక్షేత్రము దగ్గరి శర్యణావత సరస్సున సోమము ఉన్నది. దానిని ఇంద్రుడు సేవించవలెను. అందువలన ఇంద్రుడు ఆత్మబలవంతుడు శౌర్యవంతుడు కావలెను. "ఇంద్రాయేందో పరిస్రవ"
2.సోమము కోరకలు తీర్చువాడు దిశలకు స్వామి. సోమము ఆర్జీక దేశమునుండి రావలెను. ప్రసవించవలెను. పవిత్రము, సత్యస్తుతివాక్యము, శుద్ధ, పుణ్య కార్యములచే సోమమును అభిషవించ బడును."ఇంద్రాయేందో పరిస్రవ"
3. సూర్యపుత్రి. మేఘజలమున పెరిగిన - మహాసోమమును స్వర్గమునుండి తెచ్చినది. గంధర్వులు సోమమును అందుకున్నారు. సోమము రసమును అందించినది. "ఇంద్రాయేందో పరిస్రవ"
4. సత్య కర్మ, అభిషవించ బడిన మహారాజు, యజ్ఞస్వామి, సోమము ఇందు, యజ్ఞ, సత్య, శ్రద్ధలను ఉచ్చరించును, కర్మ ధారక యజమానిచే అలంకృతమై. "ఇంద్రాయేందో పరిస్రవ"
5. యదార్ధ బలశాలి మహాసోమపు ద్రవధార ప్రవహించు చున్నది. రసవంత సోమపు రసము ప్రవహించుచున్నది. హరిత వర్ణ సోమమా! బ్రాహ్మణులచే పరిశుద్ధమవై "ఇంద్రాయేందో పరిస్రవ"
6. శోధ్యనమాన సోమమా! నీ కొరకు సప్త ఛందస్సులు రచించిన స్తుతులను ఉచ్చరించుచు, శిలలచే అభిషవించుచు, దానిచే దేవతలకు ఆనందము కలిగించుచు బ్రాహ్మణులు పూజించుచోట "ఇంద్రాయేందో పరిస్రవ"
7. సోమమా !ఎచట అఖండ తేజమున్నదో, ఎచట స్వర్గమున్నదో, అట్టి అమర, అక్షయలోకములకు నన్ను చేర్చుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
8. ఎచట నైవస్వతరాజున్నాడో, ఎచట స్వర్గ ద్వారమున్నదో, ఎచట మందాకిని మున్నగు నదులు ప్రవహించునో అచట నన్ను అమరుడను చేయుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
9. ఏ ఉత్తమలోకమున సూర్యుని కోరిక ననుసరించి కిరణములు కదలునో, ఎచట జ్యోతిర్మంతులగు మనుష్యులు వసింతురో ఆలోకమున నన్ను అమరుడను చేయుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
10. ఏలోకమున కామ్యమాన దేవతలు - అవశ్యప్రార్థనీయ ఇంద్రాది దేవతలు ఉందురో ఏది కర్మసాక్షియైన సూర్యుని స్థానమో - ఎచట స్వధసహితముగా ఇవ్వబడిన అన్నము, తృప్తి ఉండునో అచట నన్ను అమరుడను చేయుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
11. ఏలోకమున ఆనందము, మోదము ప్రమోదము మున్నగునవి ఉన్నవో - ఎచట సమస్త కోరికలు తీరునో అచట నన్ను అమరుని చేయుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
నూట పదనాలుగవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. శోధ్యమాన తేజమును అనుసరించిన బ్రాహ్మణుని అమరుడనియు, కళ్యాణకర పుత్రాది యుక్తుడనియు అందురు సోమపు మనసును అనుసరించి సేవించువాడు సహితము అంతటి సౌభాగ్యము అనిపించు కొనును. "ఇంద్రాయేందో పరిస్రవ"
2. కశ్యప ఋషీ ! మంత్ర రచయతలు రచించిన స్తుతి వచనములను ఆశ్రయింపుము. నీ వచనములను వృద్ధి చేసి కొనుము, సోమ సామ్రాట్టుకు ప్రణమిల్లుము. సోమము వనస్పతుల పరిరక్షకుడు. "ఇంద్రాయేందో పరిస్రవ"
3. సూర్యుని ఆశ్రయించిన ఏడు దిక్కులును, హోమ కర్తయొక్క ఏడుగురు పురోహితులును, ఏడుగురు సూర్యులను కూడి రక్షింపుము. "ఇంద్రాయేందో పరిస్రవ"
4. సోమ మహారాజా! నీ కొరకు హవనీయ ద్రవ్యము పాకము చేయబడినది. దానితో మమ్ము రక్షింపుము. శత్రువులు మమ్ము కొట్టరాదు మా వస్త్రములు అపహరించరాదు. "ఇంద్రాయేందో పరిస్రవ"
విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, ననలాకారుడు, నాటకకర్త, ఆకాశవాణి, ధూరదర్శన, చలనచిత్ర రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ బహుమాన గ్రహీత, వక్త, స్వాతంత్ర్యసమరయోధుడు, కార్మికోద్యమ కార్యకర్త, వినయవంతుడు, ప్రసన్నుడు దాశరథి రంగాచార్య రచించిన శ్రీ మదాంధ్ర వచన ఋగ్వేద సంహితమున తొమ్మిదవ మండలము సమాప్తము.
యత్రానన్దాశ్చ మోదాశ్చ ముదః ప్రముద ఆసతే|
కామస్తస్య యత్రాప్తాః కామాస్తత్ర మామృత కృధీన్ద్రా మేందో పరిస్రవ ||
జ్ఞానానందమయందేవం నిర్మలస్ఫటికా కృతిం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
పదవ మండలము
అయిదవ అధ్యాయము మొదటి సూక్తము
ఋషి - ఆప్త్య త్రితుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.
అగ్నేబృహన్నుహసామూర్ధ్వో అస్థాన్ని ర్జగన్వాన్తమసో జ్యోతిషాగాత్ |
అగ్నిర్భాను నారుశతా స్వంశ ఆజాతో విశ్వాసద్మాన్యాప్రాః ||
1. మహాగ్ని ఉషః కాలమున ప్రజ్వలితుడగును. జ్వాలా రూపియై ఉండును. అగ్ని అంధకారమునుండి. బయల్వెడలును. స్వతేజమున ఆనందరూపమున విచ్చేయును. అగ్ని శోభన జ్వాలావంతుడు. కర్మకొరకు ఉత్పన్నుడు. తన హింసక తేజమున సకల యజ్ఞగృహములను పూరించును.
2. అగ్నీ! నీవు ప్రాదుర్భూతుడవు కళ్యాణరూపుడవు. అరణులందు మథించబడినవాడవు ఓషధులందు ఉన్నవాడవు ద్యావాపృథ్వులకు గర్భమవు. చిత్ర వర్ణుడవు ఓషధుల శిశువవు. నీ తేజమున నలుపు శత్రువులను పరాజితులను చేయుదువు. వనస్పతులు నీకు మాతృరూపములు. వాణి కొరకని ధ్వనించుచు ఉత్పనమగుదువు.
3. అగ్ని ఉత్కృష్టుడు విద్వాంసుడు ప్రాదుర్భూతుడు మహానుడు. వ్యాపకుడు అట్టి అగ్ని త్రితుడనగు నన్ను రక్షించవలెను. యజ్ఞకర్తలు అగ్నిని జలము యాచింతురు సుమనస్కులై అగ్నిని పూజింతురు.



