Home » Dr C ANANDA RAMAM » Aparajitha
13
యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. మాధవికి ఎవరి గురించీ ఆలోచించాలని లేదు. యంత్రంలా కాలేజీకి వెళుతుంది. తింటుంది. తిరుగుతుంది. రాధ విషయం కూడా పట్టించుకోవలనిలేదు. ఇలాగే రెండు నెలలు దొర్లి పోయాయి. ఆరోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి మాధవికి ఉత్తరం వచ్చినదని చెప్పింది పరమేశ్వరి. రేడియో మీద పెట్టివున్న కవరు తీసిచూస్తే రాధ పేరు మీద వున్న కవరు ఒకటీ, తన పేరు మీదవున్న కవరు ఒకటీ కనిపించాయి, మాధవికి ఒక క్షణం రెండు కవర్లు మీద వున్న దస్తూరిని మార్చి మార్చి చూసింది. అది మధు దస్తూరి అని ఆమెకు తెలుసు. మాధవి మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. చదవకుండానే చింపి అవతల పారేయాలని పించింది. తన పేరుమీద వున్న కవరుతీసుకోని గదిలోకి వెళ్ళింది. విరక్తిగా వున్న మనస్సును సమాధాన పర్చుకుంటూ కవరు చింపింది. ఉత్తరం కింద సంతకం చూస్తూ వో క్షణం వుండిపోయింది. ఉత్తరం చదవకుండానే మడతపెట్టి చింప బోయింది. అంతలోనే ఎవరో చెయ్యి పట్టుకొని ఆపినట్టు చింపకుండా ఆగిపోయింది. మడత విప్పి అయిష్టంగానే చదవసాగింది.
మాధవీ!
అప్పు తీర్చేశావు. బరువు దించేసి నట్లు హాయిగా వున్నాననుకొంటాను. అప్పు తీర్చి నాకు అవసరానికి, మంచి సమయానికి డబ్బు అందించావు. కృతజ్ఞతలు నిన్ను రుణ విముక్తను చేసి, తన దానిగా, చేసుకోగల్గిన మీ బావ, ధన్యుడు, మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు.
నువ్వొచ్చి వెళ్ళావని తెలియగానే నిన్ను కలుసుకోవాలని ఆరాటపడిన మనస్సును అదుపులో పెట్టుకోవటానికి ఎంత అవస్థ పడ్డావో నీకురాయటం అనవసరం. నావివాహం చెయ్యాలని మా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న విషయం నీకు తెలుసు. రేపే ముహూర్తాలు పెట్టుకోటానికి వస్తు
న్నాను. రాత్రంతా ఆలోచించాను. ఎందుకో నన్ను చూసి నాకె నవ్వొచ్చింది. అసహ్యం వేసింది. అందుకే ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎక్కడకు వెళతావో, ఏం చేస్తావో నాకే తెలియదు. నాకు నువ్వు ఇవ్వాల్సింది మూడు వేల రెండు వందలు మాత్రమే. నాలుగు వేలు ఇచ్చి వెళ్ళావు. నీ ఎనిమిది వందలూ తిప్పి పంపిస్తున్నాను.
ఎక్కడవున్నా, ఎలావున్నా, ఎల్లప్పుడూ నీ సుఖాన్నే కోరే.....
మధు,
ఉత్తరం చదివి ముగించిన మాధవి మనస్సులో దుఃఖం, కోపం నేను ముందంటే నేను ముందని పోటీపడ్డాయి. ఉత్తరాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అశాంతిగా గదిలో అటూ ఇటూ తిరిగింది.
రాధకు ఏం రాసివుంటాడు. ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడి ప్రపంచానికి దూరంగా పారిపోయిన పిరికిపంద! మాధవి ఆలోచనా రహితంగానే రాధ గదివైపు నడిచింది. వోర వాకిలిగా వేసివున్న తలుపుల్ని తోచుకొని లోపలకు వచ్చింది. రాధ మంచంపట్టె మీద కూర్చొని వుంది. చేతిలో ఉత్తరం వుంది. రాధ చదవటం లేదు. ఏమీ చెయ్యటం లేదు. ఏడవటం లేదు. బాధపడటం కూడా లేదు. నిర్జీవ ప్రతిమలా, రాగ ద్వేషాలకు అతీతమైనచూపులు, మాధవికి రాధ రూపం భయాన్నే కల్గించింది. దగ్గరకు చేరింది. రాధ తలను తనగుండెలకు ఆనించుకొని, మృదువుగా నిమరసాగింది. రాధ మవునంగా వుండిపోయింది.
'రాధా! మనిద్దరం మోసపోయాం చెల్లీ!' అంది మాధవి రుద్ధ కంఠంతో.
రాధ పెదవుల మీద విరిగిన పాలలాంటి వో చిరునవ్వు కదిలింది.
'అలా నవ్వకు రాధా! మాట్లాడు. నాకేదో భయంగా వుంది.' మాధవి కంఠం వణికింది. దుఃఖం, భయం రెండూ ఖంగ్ మన్నాయి ఆమె కంఠంలో.
రాధ తలఎత్తి మాధవి ముఖంలోకి చూసింది.
'ఎందుకక్కా అంత భయం?' అంది నిర్లిప్తంగా.
అక్కా!
రాధ ఎంతకాలం అయింది తనను అలా పిలిచి? తనను చూస్తేనే ద్వేషంతో, బుసలు కొట్టే రాధేనా ఇంత ఆర్ద్రంగా పిలిచింది? రాధకు ఏదో చాలా లోతైన గాయమే తగిలి వుంటుంది. మధు ఉత్తరమే ఆమెకు అంత బాధను కల్గించి వుంటుంది. మాధవి తన బాధను పూర్తిగా మర్చిపోయింది. రాధ చేతిలోని ఉత్తరం కోసం చెయ్యి చాచింది. వెంటనే రాధ ఉత్తరం కోపం తను చెయ్యి చాచటం అంత మంచిది కాదేమోనని తోచి, చెయ్యి వెనక్కు తీసుకుంది.
'తీసుకో! చదువు!' అంటూ రాధ ఉత్తరాన్ని మాధవికి అందించింది.
మాధవి ఆత్రంగా ఉత్తరం చదవసాగింది.
"డియర్ నా రాధా!"
తన రాధ! పచ్చిమోసం! మాధవి ఉత్తరం ముందుకు చదవలేకపోయింది. తనను 'కేవలం 'మాధవీ' అని మాత్రమే సంబోధించాడు. రాధ తనకంటే ఎక్కువయిందా? మాధవి మనస్సును అదుపులో పెట్టుకుంటూ ఉత్తరం పైకి దృష్టిని సారించింది.
"నీకు ఈ ఉత్తరం అందే సమయానికీ నీనుంచి.....కాదు' ఈ ప్రాంతంనుంచే చాలా దూరంలో ఉంటాను. ఆనాడు.....అదే పోయిన ఆదివారం నిన్ను ఇంటిదాకా పంపించి గదికి వచ్చేప్పటికి, మా నాన్న ఇచ్చిన టెలిగ్రాం వచ్చివుంది. కారణం రాయలేదు. నన్ను వెంటనే ఇంటికి బయలుదేరి రమ్మని వుంది తీరా ఇంటికి వెళ్ళాక తెలిసిన విషయం నా వివాహం నిశ్చయించబడింది. ముహూర్తాలు పెట్టుకోవటానికి పెళ్ళివారు వస్తున్నారు.......అని. అమ్మకూ, నాన్నకూ ఎంత చెప్పినా అర్ధంకాదని నాకు తెలుసు. ఆ రాత్రంతా ఆలోచించాను. నేను కావాలనుకున్న వ్యక్తి నాకు దూరం అయిందనే బాధలో పిచ్చి వాడ్నే అయిపోయిన నన్ను నీవు మళ్ళీ మనిషిని చేశావు. గుండె లోతుల్లోని గాయాన్ని, నీ స్నేహబిందువులను చిలకరించి ఉపశమింప జేశావు. నన్ను మళ్ళీ మనిషిని చెయ్యటానికి నీవు చాలా పెద్ద త్యాగమే చేశావు. నీ సర్వస్వాన్నీ ప్రతిఫలం ఆశించకుండానే సమర్పించుకున్నావ్. ఎందుకు రాధా! ఈ అల్పుడి కోసం అంత విలువైన వస్తువును ఫణంగా పెట్టావు? కేవలం నేను బాధపడటం నువ్వు చూడలేకనేగదూ? నేను ఏమై పోతానో అనే భయంతోనే కదూ? ప్రేమకు అర్ధం ఇప్పుడే తెలిసింది రాధా! నేను నీకు అర్హుణ్ణి కాను. ఆ అర్హత సంపాదించుకోవటానికీ, నీ అంత ఎత్తు పెరగటానికీ ప్రయత్నిస్తాను. నా మనస్సులో సంఘర్షణకు నామరూపాలు లేకుండా చెయ్యడానికే వెళ్ళిపోతున్నాను.
ఏనాటికైనా నేను తిరిగి రావటం అంటూ సంభవిస్తే......అది నన్ను కావాలనుకొనే ఆ ఒక్క వ్యక్తికోసమే.....అది నీ కోసమే......కేవలం నీకోసమే రాధా! నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఎదురు చూడమని కోరేంతటి స్వార్ధపరుణ్ణి కాను రాధా. అయినా నేను ఈ జీవితాన్ని చాలించకముందు ఒక్కసారి నీ ముందు మోకరించి నీ క్షమాభిక్షను అర్దిస్తాను.
నీ
మధు."
మాధవి రాధ ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది. రాధ నిర్లిప్తంగా వుంది. ఎలాంటి భావోద్వేగాలూ ఆమె ముఖంలో కన్పించలేదు.
"నీచుడు నిన్ను కూడా మోసం చేశాడు" కచ్చగా అంది మాధవి.
"మధును నిందించకు. అతను నన్ను మోసం చెయ్యలేదు. నన్నేకాదు ఎవర్నీ మోసం చెయ్యలేదంటాను" అన్నది రాధ.
మాధవి రాధను చిత్రంగా చూస్తూ వుండిపోయింది. రాధ ఒక్కొక్క మాటనే నిదానంగా పలుకుతూ అంది.
"ఒకోసారి మగవాడు పసివానిలా అయిపోతాడు. అప్పుడు అతన్ని స్త్రీ తన చల్లని హస్తంతో నిమిరి వోదార్చకపోతే ఏమయి పోతాడో చెప్పలేం. నీకు దూరం అయిన మధు పూర్తిగా పిచ్చివాడే అయినాడు. పసివాడిలా బావురుమని ఏడ్చేవాడు. మధును లాలించి, మురిపించి, మరపించి మళ్ళీ మనిషిని చేశాను."
మాధవి తెల్లపోయి చూస్తూ వుంది. రాధే మళ్ళీ చెప్పుకుపోసాగింది.
"నా మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తున్నాయిగదూ? మధును నేను ప్రేమించాను. మధు బాధ పడడం చూడలేక పోయాను. వో క్షణమైనా అతన్ని బాధ నుంచి మరిపించటంలోనే నా ప్రేమకు అర్ధం ఉందనిపించింది."
"ఎంత త్యాగం చేశావు రాధా? కాని?" ఏమనాలో తోచని మాధవి ముందుకు మాట్లాడలేకపోయింది.
"హు త్యాగం! నేను దీన్ని త్యాగం అనుకోవటంలేదు. తను ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకోవడంలొ స్వార్ధం వుంది. నా మాటలు నీకు అర్ధం కావటం లేదు కదూ?"
"అవును రాధా! నువ్వేదో కధలోని పాత్రలా మాట్లాడుతున్నావు" అంది మాధవి. మాధవి మాటలకు జవాబుగా రాధ బోలుగా నవ్వింది.
"చెల్లీ! నిజంగా నువ్వు చాలా ఎదిగావు! నువ్వు రచయిత్రివనిపించావు. పరిస్థితులను ఎదుర్కొనే సాహసం నీలా నాకు లేదు" అంటూ మాధవి రాధ రెండుచేతులూ పట్టుకొంది. రాధ మాధవి ముఖంలోకి చూసింది. మాధవి చెంపలు కన్నీటితో తడిచివున్నాయి.
"ఛ! ఏడుస్తున్నావా? ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం!' అంది రాధ.
మాధవి మౌనంగా కళ్ళు తుడుచుకుంది. "నువ్వు మధును ప్రేమిస్తున్నట్లు నాకు తెలియదమ్మా!" అంది రుద్ధకంఠంతో మాధవి.
"నీకేకాదు మధుకి కూడా తెలియదు. మీ ఇద్దరూ నన్ను చిన్నపిల్లలా చూసే వారు. అందుకే నాకు కోపంగా ఉండేది. నాలో రేగుతున్న అలజడినీ, అశాంతినీ మర్చిపోవటానికే సినిమాలకూ, వాటికీ తిరిగే దాన్ని. కాని నేను ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. నేనంటే ప్రేమ వలకబోస్తూ, కామానికీ, ప్రేమకూ భేదం తెలియని ప్రబుద్దుల్ని నా చుట్టూ తిప్పుకొని ఏడిపించేదాన్ని. నువ్వు నన్ను మందలించటాన్ని నేను సహించలేక పోయేదాన్ని. మగవాళ్ళతో స్వతంత్రంగా ఉన్నంత మాత్రం చేత ఆడపిల్లలు చెడిపోయారనుకొనేవాళ్ళను చూస్తే నాకు అసహ్యం. అందుకే నిన్ను అసహ్యించుకొనేదాన్ని." రాధ ఆపైన మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుండి పోయింది.



