Home » Dr Jandhyala Papayya Sastry » Karunashri Sahithyam - 3



                                   కరుణశ్రీ సాహిత్యం - 3

                                              బాలసాహితి - 1

                                                                     డా|| జంధ్యాల పాపయ్య శాస్త్రి

                                           

                                          1. తెలుగు బాల

    తెనుగుదనమువంటి తీయందనము లేదు;
    తెనుగు కవులవంటి ఘనులు లేరు;
    తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                1

    కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు;
    నష్టపెట్టబోకు నాన్నపనులు;
    తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                2

    దేశసేవకంటె దేవతార్చన లేదు;
    స్వార్థపరతకంటె చావు లేదు;
    సానుభూతికంటె స్వర్గంబు లేదురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                3

    అందమైన సూక్తి అరుణోదయంబట్లు
    బాల మానసముల మేలుకొల్పు;
    సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                4

    రక్తిలేని యాట రాత్రి నిద్దురచేటు
    భక్తిలేని పూజ పత్రిచేటు;
    నీతిలేని చదువు జీతాలచేటురా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                5

    వినయ, మార్జవంబు, వీరత్వ, మనుకంప,
    దీక్ష, సత్యసూక్తి, దేశభక్తి;
    మండనమ్ము లివ్వి మంచి విద్యార్థికి
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                6

    మదము, దొంగతనము, మంకుబుద్ధి, అసూయ,
    విసుగు, పిరికితనము, విరుగబాటు,
    సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                7

    మొరకువానితోడ సరసమాడుట రోత
    పిరికిపంద వెంట నరుగ రోత
    నీతిలేని వాని నేస్తంబు రోతరా
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                8

    ఎద్దు నెక్కె శివుడు; గ్రద్ద నెక్కెను విష్ణు;
    హంస నెక్కె బ్రహ్మ అందముగను;
    బద్ధకంపు మొద్దు బల్లపై నెక్కెరా!
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                9

    బడికి నడువలేడు, పాఠాలు వినలేడు,
    చిన్నపద్య మప్ప జెప్ప లేడు;
    రాజరాజుబిడ్డరా నేటి విద్యార్థి!
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                10

    పరమ సుందరములు ఫలములు, సంసార
    విష మహీజమునకు వెలయు రెండు;
    సాధుసంగమంబు, సత్కావ్యపఠనంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                11

    అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
    దేవతలకు నిడక తినెడివాని
    చెప్పనగు ధరిత్రి "జీవన్మృతుం"డని
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                12

    జనులకొరకు ధర్మశాలలు గట్టించి;
    బీదసాద నెంతొ యాదరించి;
    పేరుగన్న కర్మవీరుడే "మృతజీవి"
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                13

    హంసలందు బకము హాస్యాస్పదంబగు;
    మణుల గాజుపూస గణుతి గనదు;
    చదువురాని మొద్దు సభల రాణింపడు;
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                14

    జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
    కలిమి గలిగి, విద్య గనని జనులు
    గంధరహిత కింశుకప్రసూనంబులు;
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                15

    బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుటె గాదు
    చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు;
    త్యాగభావమునకు తరువులే గురువులు;
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                16

    జూలు చుట్టుకొన్న వాల మల్లార్పిన
    కొండకొమ్ముమీద కూరుచున్న
    కరుల గుండె లదర గర్జించునా నక్క
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                17

    తగిలినంతమేర దహియించుకొనిపోవు
    చెడ్డవాని చెలిమి చిచ్చువోలె;
    మంచివాని మైత్రి మలయమారుత వీచి;
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                18

    అది పయోధి దోష మడుగున మణు లిడి
    తృణగణమ్ము తల ధరించు టనిన;
    మణుల విలువ పోదు; తృణముల కది రాదు;
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                19

    ఫణిని మట్టుపెట్టి బాలు గాపాడిన
    ముంగి జంపె నొక్క మూర్ఖురాలు;
    మందమతుల కెపుడు ముందుచూ పుండదు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                20

    సాధుసంగమమున సామాన్యుడును గూడ
    మంచి గుణములను గ్రహించుచుండు;
    పుష్పసౌరభంబు పొందదా దారంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                21

    అడవి గాల్చువేళ నగ్నికి సాయమై
    నట్టి గాలి దీప మార్పి వేయు;
    బీదపడిన వేళ లేదురా స్నేహంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                22

    మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
    సరసిజంబు క్రింద తిరుగు కప్ప;
    కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు
    లలిత సుగుణజాల! తెలుగుబాల!                23




Related Novels


Karunashri Sahithyam - 3

Karunasree Saahithyam - 2

Karunasri Sahityam - 5

Karunasree Saahithyam - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.