Home » Chalam » Musings 1



    
                                     మ్యూజింగ్స్ - 1
    
                                                                                    ---చలం

                      


    
    పది అయినట్టుంది. గంటకొట్టారు. యములాళ్ళలాగు పరీక్షకి యిద్దరు పెద్ద మనుషులు తయారైనారు. మేంముగ్గురం యీ గదిలో మూడు గంటలసేపు పడివుండాలి. వాళ్ళు పరీక్ష వ్రాస్తారు. నేను కావిలి. చుట్టూ చూశాను, ఆ కొట్ట గదిచుట్టూ, తలుపులు తెరిచిన కైదు. తలుపులోంచి చిన్నదొడ్డి కనపడుతోంది. దొడ్డి గోడ వెనక చెరువు. అవతల గట్టున మర్రిచెట్టు. నా కుర్చీవీపు వీళ్ళవేపు తిప్పి ఆ చెరువువేపు మొహం తిప్పడానికి వీలుంటే కొంత 'కన్సొలేషన్'. ఆరు గజాలదూరంలో కూచున్న ఆ యిద్దరు నిర్భాగ్యులూ కాపీ కొట్టకుండా చూడడంతప్ప యింకేపనీ నేను చెయ్యకూడదని, అధికారి భగవదాజ్ఞ. నేను చదవకుండా మాట్లాడకుండా ఆజ్ఞాపిస్తాడు. ఆలోచించకుండా కలలు కనకండానో!
    ఆకలికొన్న కుక్కలు పులిస్తరాకు మీద పడ్డట్టు వాళ్ళిద్దరూ పరీక్ష కాయితాల మీద పడ్డారు నా ఆలోచనల్లో నేను పడ్డాను.
    ఈ తోటలో యిన్ని వుడతలూ, గోరింకలూ యెల్లా పోగై నాయో! గోరింకలు విసుగూ విరామం లేకుండా వాగుతో వుంటాయి. ఆ శబ్ధాలకి ఏమన్నా అర్ధం వుందా లేదా? అది వాటి సంభాషణా? వుత్త ఆనందంవల్ల అర్ధం లేకుండా పలికే శబ్దాలా? తోక లెత్తుకొని చెట్ల మానుల కెగబాకే వుడతల్ని, చెట్టుకొమ్మమీదనించి వాటివంక కిందికిచూసే గోరువంకల్నీ కనిపెడుతోవుంటే, వీటికేమన్నా కష్టాలూ దుఖ్కాలూ వుంటాయా అనిపిస్తుంది కష్టాలున్నా జ్ఞాపకం వుండవు. ఈ 'మెమొరీ' అనేది మనుషులకి యెన్ని లేనిపోని వేదనల్ని తెచ్చిపెట్టింది!    
    చెరువులోనించి లేచి గేదెలు మర్రిచెట్టుకింద పోగవుతున్నాయి. ఆ చెట్టు వొంగి ఆ గేదెలకేసి చూస్తున్నట్టేవుంది నాకు. నిజంగా చూట్టంలేదా? నిన్న నేను మాధవధారకి వెళ్ళేప్పుడు కొండ మీదికి నా old horse వెళ్ళలేకపోతే దాని మీదనించి దిగి నడిపించాను. ఆ సైకిల్ నేను దిగిన తరవాత కిచకిచ మంటోంది దోసపొడుగూనా, దిబ్బ నెక్కుతో అలిసినప్పుడు చేతుల్లో యెత్తుకుంటే కుక్కపిల్ల కుయి కుయి లాడదూ తోక ఆడిస్తో; అట్లా అనిపించింది నాకు. ఏమీ? నాసైకిల్ కి, పదిహేనేళ్ళ స్నేహం గల నా సైకిల్ కి నేను గుర్తు వుండకూడదూ? నేను తన శ్రమని గుర్తించి దిగినందుకు కృతజ్ఞతను చూపకూడదూ? మృగాలకు గుర్తుంటాము. చెట్లకీ తెలుస్తామేమో! వొస్తువులకీ! Consoiousness కి యెక్కడ నడిగీత గియ్యగలం?
    తలుపుదగ్గిర నుంచున్న నాపాదల దగ్గిర చల్లగా, మెల్లిగా, పచ్చగన్నేరు పువ్వు వాలింది. ఏం చేస్తానో అని curiosity తో నాకేసి చూస్తున్నట్టుంది దాని మొహం. నా బూడ్సుకాలితో తొక్కుతానేమోనని భయం చూపలేదు. ఈ పువ్వుగర్భంలో యెరుపూ పసుపూ కలిసినచోటుని చూసినప్పుడల్లా ఏవో, నాకు తెలీని సంగతులు జ్ఞాపకం వొచ్చి సగం బాధిస్తాయి. సగం సంతోషపెడతాయి. ఈ రంగుకీ నాకూవున్న సంబంధ మేమిటో! బందరులో ... యాతో స్నేహానికి యిట్లాంటి రంగుచీరే కారణం. ఈనాటి కార్యాలకి యేనాటి ఆకర్షణలో ఇట్లా కారణాలవుతాయి. గడిచినదీ, గడవబొయ్యేదీ ఒక్కటే straight line. అందువల్ల నేనేమో భవిష్యత్తును కొందరు చెప్పగలుగుతారు.
    ఒక్కొక్క angle నించి చూస్తే, సాధారణవిషయాలు అద్భుతంగా వికృతంగా కనపడతాయి. వొంటరిగా కూచోడం అలవాటైనవాడికి, యెప్పుడూ తమ స్వంతపనులలో ఆలోచనల్లో వున్న వారికి తోచని సందేశాలూ సందేహాలూ కనపడతాయి.
    రాళ్ళవంటి యీ గేదెలేమిటి? వీటిలో నించి ఆ జిగటపదార్ధాన్ని మనుషులు పిండుకోడమేమిటి సన్న ధారలుగా! వాటిని గడ్డ కట్టించడం-దాంటోంచి జిడ్డులాగడం - ఇదంతా తమాషాగా లేదూ? పాలని పెరుగుచేసిన మొదటిమనిషి యెవరో! అతను ఆశ్చర్యపడడం, అందరికీ చూపడం విషంగా మారిందేమోనని భయపడటం......
    పదకొండయింది. ఇంకా రెండుగంటలు. నేను గేదెలసంగతి ఆలోచిస్తోవుంటే యీ గదిలోనే ఒకడు హైడ్రాలిక్సు లెక్కలు కడుతున్నాడు. ఇంకొకడు Banking ని గురించి పేజీలు  పేజీలు  నింపుతున్నాడు. ఒకేచోట కూచున్నాం ముగ్గురం. మా మూడు మెదళ్ళూ మూడు వేరేలోకాల సంచరిస్తున్నాయి. ప్రియుడి హస్తాల్లో అణిగి అతని కళ్ళల్లోకి చూస్తోనేవుంది. ఆలోచనలు యెక్కడున్నా యో యెవరు చెప్పగలరు? ఎందరు యీర్ష్యగల భర్తలు, స్త్రీల దేహాన్ని చేతుల్లో గదుల్లో బంధించి ఆమె మనసుని యేమాత్రమూ పదిలపరచలేక బాధపడ్డవాళ్ళు? ఈ లోకంలోని యీ నిరంకుశత్వమూ క్రూరత్వమూ, బలవంతమూ చూసి జాలిపడి యే దేవుడో ఎవ్వరూ పాలించలేని బంధించలేని యీ మహాస్వేచ్చవరాన్ని ప్రసాదించాడు మనసుకి!
    Human Consciousness ని తలుచుకుంటే, తక్కిన Consciousness తో పోల్చిచూస్తే ఏమనిపిస్తుందంటే - యీ ప్రపంచమనేది ఒక diffused Consciousness సముద్రమనీ, అదిక్రమేపీ చిక్కనై concentrate అయినకొద్దీ జడపదార్ధాల, వృక్షాల, మృగాల, మానవుల, Consciousness గా తయారవుతోందనీ తోస్తున్నది. ఒక దానికొకటి భేదంలేదు. అంతా వొకటే. Different stages. విద్యుచ్చక్తి అంతటావుంది. కేంద్రీకరిస్తే దీపం వెలిగింది. అట్లానే యీ Consciousness ఇంకా చిక్కనైతే కొత్త యింద్రియాల్ని కల్పించుకుని, కొట్ట అనుభవాలతో, time లో space లో దూరంగా happen అయ్యే వాటినికూడా అనుభవిస్తుందేమో! Radio, Television చేసే పనులను మనుష్యుడి మనసే చెయ్యగల దేమో! ఏలోకానో అట్లాంటి జీవులు వుండకూడదా?
    మధ్యాహ్నమౌతోంది. గోరింకల గోల అణిగింది. ఏమైనాయో ఎక్కడా కనపడవు పిట్టలు. గేదెలన్నీ నీళ్ళల్లో చేరాయి మళ్ళీ. నీళ్ళ మీద మూతులు జాచి పడుకున్నవాటి కళ్ళల్లోకి చూస్తే సంపూర్ణ మైన సంతుష్టి కనపడుతుంది. ఈ ఆనందం స్వభావమేమిటి? నలుగురిలో, స్నేహంలో, ప్రేమలో, ప్రపంచ సంస్కార ప్రయత్నంలో తనని మైమరచి, తానున్నానని మరిచిపోవడమే అధికమైన ఆనందం అంటాడు బెట్రాండ్ రస్సెల్. కాని నాకట్లా అనిపించదు. అది వుత్తగేదెలు నీళ్ళల్లో పడుకునే ఆనందం, కుక్కలు ప్రేమతో కొరుక్కుంటో గంతులేసే ఆనందమనిపిస్తుంది. ఆనందించేప్పుడు ఆనందిస్తున్నాననే జ్ఞానం కలిగివుండడం అతీతమయిందనుకుంటాను నా అనుభవంవల్ల. కాని యీ 'నేను' అనేది మరవకపోవడంవల్ల చాలా వ్యసనాలుకూడా కలుగుతాయి. ఆహారం develop అయినవాడికి, మృగాల stage లో ఉత్త feelings మీద, ఇంద్రియానుభవాల మీద ఆధారపడేవారికన్నా యెక్కువ సందేహాలు, వ్యసనాలు కలుగుతాయి. కాని అది మార్గంలో ఒక stage అనీ, యీ అహాన్ని develop చెయ్యడమే అహాన్ని మించగల stage అందుకోడానికి means అనీ అనుకుంటాను. అహం యీ సర్వంలో కలవకూడదు. ఈ సర్వమూ వొచ్చి నా అహంలో కలవాలి.




Related Novels


Musings 2

Musings 1

Maidanam

వివాహం

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.