Home » Lalladevi » Kougitlo Krishnamma


 

                        కౌగిట్లో కృష్ణమ్మ

                                                        లల్లాదేవి

                  

    రవి చంద్రుల దివారాత్రాల దోబూచులాటలో రాత్రి పొద్దు ప్రారంభమయింది.
    అది వసంతరాత్రి! రాకాసుదాంశుని వెలుగు కిరణాలు వెల్లువలా వియత్తలాన్ని ముంచెత్తుతున్న మధురయామిని. తెల తెల్లని వెన్నెల తరగలు నేల నాలుగు చెరగులా పరచుకుంటున్నాయి.
    ఆకాశం అంచులదాకా ఎక్కడ చూసినా చుక్కల జాడలేదు. పదహారు కళలతో నిండయిన రాకాసుధాకరుడే గగనతలాన్ని ఏలు కొంటున్నాడు.
    ఇంద్రకీలాద్రిని ఒరుసుకుంటూ జలజల జాలువారుతున్న కృష్ణ వేణీ సలిల ధారలు పండు వెన్నెల కిరణాలు సోకి తరళాయితం అవుతున్నాయి. నీలి నీలి జీవ జలధారలు కొండ మీది కరెంట్ దీపాలకాంతులు ప్రతిఫలిస్తూ మరింత తరళాయితం అవుతున్నాయి.
    మెత్తని శబ్దంతో నీటిని చీల్చుకుంటూ మునుముందుకు సాగుతోంది పుష్కల. బ్యారేజ్ వెనుక రిజర్వాయిరులో నడుస్తోంది స్టీమ్ బోట్ : దాని పేరే పుష్కల!
    దాని మీద కృష్ణవర్ణం చారలు చీకటి లేని రాత్రి అయినా నల్లగా కనిపిస్తున్నాయి. అది ముందుకు పోతూ వుంటే కృష్ణ సర్పం వరదలో చిక్కి పోయినదాన్లా అనిపిస్తోంది.
    పుష్కలను నడుపుతున్న జ్యోతి రవంత అలసిపోయినదానిలా ముఖం మీది చిరుచెమటను అడ్డుకుంది. స్టీమ్ బోటును మూడు గంటలుగా డ్రైవ్ చేస్తోందామే.
    వీస్తున్న ఏటిగాలి చల్లనిదే అయినా చిరుచెమటలు క్రమ్ముతున్నాయి. కాస్తున్నది పండువెన్నెల అయినా అలసట తీరినట్లు అనిపించలేదు. విశాల సుందరమయిన నేత్రాలు అలసట వల్లనే కాబోలు అర్ధ నీమిలితంగా అవుతున్నాయి.
    వాలిపోతున్న ఆల్చిప్పల్లాటి రెప్పల్ని ప్రయత్నపూర్వకంగా అల్లన పైకి లేపుతూ నేత్రాలు విశాలం చేసి ముందు దారిని చూచుకొంటోంది జ్యోతి.
    కృష్ణ వేణి తరంగిణిలోని జీవ జలధారల్ని వోరుసుకుంటున్న ఒద్దు దగ్గర అవుతుంది. పుష్కలను వేగం తగ్గించి తీరం వంక ఓరగా చూచిందామె.
    చూస్తూ వుండగానే అది మరింత దగ్గరగా అయిపొయింది. వేగం తగ్గించి స్టీం లాంచిని తీరం పట్టించింది జ్యోతి.
    ఇంజను అపు చేసి లంగరు దింపింది. అంతటితో మూడు గంటలు  పైగా అమరావతిని కొనసాగిన ప్రయాణం ఆసాంతమయిపోయింది.
    ప్రయాణికులు ఎవరి సామాను వారు సర్దుకుని బిలబిల మంటూ బయట పడిపోతున్నారు. ఎవరైనా ఏదయినా చిన్న చిన్న సామానులు మర్చిపోతే అవి తీసి వారికి అందిస్తూ జాగ్రత్తలు చెప్తోంది జ్యోతి. వారు కృతజ్ఞతపూర్వకమయిన పొగడ్తలు ప్రారంభించగానే చిరునవ్వులు చిందిస్తూ అవతలకు తప్పుకుపోతోంది.
    ప్రయాణీకులంతా దిగిపోయినారు. మారొక్కమారు లాంచీ లోపలి భాగమంతా కలయచూచి డెక్ మీదికి వచ్చిందామే. డెక్ మీద నాలుగు కర్ర కుర్చీలు , ఒక బెంచీ వున్నాయి. వాటిలో కూర్చున్నవారు దిగిపోయినారు.
    కుర్చీలో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తీ మాత్రం కదలలేదు. అలోచనామగ్నురాలాయి అలాగే కూర్చుంది. జ్యోతి మెట్లు ఎక్కి డెక్ మీదికి రాగానే సాలోచనగా ఆమె వంక చూచింది.
    "మీరు దిగి వెళ్ళరా?" అని అడిగింది జ్యోతి. ఆ ప్రశాంత ప్రకృతి వదనంలో పండు వెన్నెలనూ, పచ్చి గాలినీ చీల్చుకుని వచ్చిన ఆ మాటలకూ చిరునవ్వు బదులు చెప్పింది ఆమె.
    వీణ మీద వేదనాదాలు పలకరించినట్లు మధుర మధురంగా వున్న ఆ కంతస్వరానికి ముగ్ధురాలయినట్లుగా రెప్పలు అల్లార్చి మరొకమారు ఆమెను సమీక్షగా చూచింది.
    తీయతీయని ఆ కంట మాధుర్యం మనసుని దూరదూర తీరాలకు తరలించుకుపోతోంది. దిశాంతాలతో నిండారిన వెలుగు చీకటుల మధ్యకు పరుగులు తీశాయి ఆలోచనలు.
    తనే స్వయంగా స్టీం లాంచి నడుపుతూ , ఇంత చక్కని రూపూ అంత చిన్న వయసు అపురూపమయిన కంట మాధుర్యమూ కలబోసిన ఈ అరుదైన యువతి ఎవరా అని ఆలోచించిందామె.
    విధాత చెక్కిన వినూత్న శిల్పంలా ఉన్న ఈ అందాలరాశి కృష్ణవేణీ తరంగాల మీద తేలియాడుతూ జీవన గమ్యాన్ని అన్వేషిస్తోంది కాబోలు అనిపించింది ఆమెకు.
    గట్టు మీద నియాన్ దీపకాంతులు వెన్నెల వెలుగుల్ని అధికమించి ఆమె చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తిన్నాయి. లేలేత అరుణవర్ణం కలియబోసిన పాలమీగడ తరగల్లాంటి చెక్కిళ్ళు దీపకాంతుల వల్ల మరింత తరళాయితం అవుతున్నాయి.
    యెర్రని పెదవులపై తెల్లని చిరునవ్వు. విశాల ఫాలం మీదికి ఏటి గాలి విసురుకు ఉలికివచ్చిన నీలికపోలాలు. ఎదసయ్యేదలో ఒదిగిఒదిగి పోతున్న వయసు ఒయ్యరాలు ! ఆమెకు రెండు పదులు నిండాయో లేదో అనుకుందామే. ఆలోచనా మగ్నురాలాయి అలాగే చూస్తూ వుండిపోయిన ఆమెను తిరిగి తన పలుకులతో జాగృతం చేసింది జ్యోతి.
    "అమ్మా! లాంచి తీరం చేరిపోయింది. ప్రయానికులంతా దిగి పోయినారు. మీరు దిగి వెళ్ళరా?" అని అడిగింది మధురనాదాలు ఒలికిపోతున్న మందస్వరాన!
    వింటున్న ఆ ప్రయాణికురాలు తిరిగి మంత్రముగ్ధ అయింది.
    "శాపగ్రస్తురాలయిన యక్షిణిలా ఆ మధుర స్వరమేమిటని ఎంత చిత్రం" అనుకుంది మనసులో.
    అంత మధురమయిన కంఠస్వరాన అరుదైన అపురూపమయిన ఉచ్చారణతో అలా మాట్లాడుతూ వుంటే ఒక మహాగాయని మధుర గీతాలను ఆలపిస్తున్నదేమో అనిపించింది.
    సాధారణమయిన సంభాషణలలో అంతటి మాధుర్యాన్ని చిలికిస్తో వుంటే ఎందుకో బాధ అనిపించింది . జీవనదులలోని పవిత్ర జలధారలు దూరదూర తీరాల నించి సాగివచ్చి సాగరసంగమం అవుతున్నట్లు, సముద్ర జలాల బరువుతో బహూదూరం పయనించిన మేఘాలు చవిట పర్రలపై వర్షిస్తున్నట్లు నిర్జనారణ్యంలో వెదురుకర్రలు పిల్లగాలులకు వంశనాదాలు అలపిస్తున్నట్లు వృధా అవుతున్నాయి అనిపించినప్పటి బాధ  అది.
    ఆ స్వరం యోగ్యమయిన వేదిక నించి పాటగా ప్రవహిస్తే అది చిరస్మరణీయమైన అనుభూతిగా మిగిలిపోతుంది.
    కానీ ఈమె!?
    సాధారణమయిన స్థితిలో బ్రతుకు ప్రవాహం మీద తేలియాడుతూ రేపటి కోసం తాపత్రయపడుతోంది. ఆ ప్రయాణికురాలి మనసు రవంత వ్యధా పూర్ణమయింది.




Related Novels


Kalaniki Nilichina Katha

Kougitlo Krishnamma

Black Tiger

Ardha Manavudu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.