Home » Kantamaneni Swapna » చీఫ్ మినిస్టర్


 

"సర్, ఒకసారి స్పీచ్ చూసుకుంటే"...నసుగుతున్నాడు విష్ణు. 

ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు సుధీర్. 

తను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచీ తననే అంటి పెట్టుకుని ఉన్నాడు విష్ణు. నమ్మకస్తుడు. ప్రెస్ నీ, పార్టీ వాళ్ళని చాలా సార్లు కొత్త కొత్త వ్యూహాలతో తనకు అనుగుణంగా మార్చాడు. కానీ ఈ మధ్య అతణ్ణి చూస్తుంటే కూడా చిరాగ్గా ఉంటోంది. పిల్లల్ని చదువుకోమని పెద్దవాళ్ళు నస పెట్టినట్లు చాదస్తం గా మాట్లాడుతున్నాడు అనిపిస్తోంది.

కార్ స్టేడియం ని సమీపిస్తోంది. గుండెల్లో దడ మొదలైంది. ఏం అడిగి చస్తారో ప్రెస్ వాళ్ళు.  టెన్షన్ లో మాట తడబడితే తన మీద వార్తలు, trolls తప్పవు. వెధవ సీఎంగిరీ. 

కార్ స్లో అవగానే బ్లాక్ కాట్ కమాండో లు కార్ పక్కనే పరిగెత్తటం మొదలెట్టారు. వాళ్ళని చూస్తే ఈ మధ్య విపరీతమైన జెలసీ కలుగుతోంది. ప్రతిపక్షాల మాట దేవుడెరుగు. ముందు వీళ్ల మీద మండిపోతోంది. వాళ్ళలో ఒకడిని కాలు అడ్డం పెట్టి కింద పడేయలనిపిస్తుంది. ఇదేం ఎనర్జీ వీళ్ల లో.  ఒక్కసారైనా కాలు మడత పడి పడొచ్చుగా. బలంగా, ఆరోగ్యంగా, పొడుగ్గా, నల్ల డ్రెస్ లో స్టైలిష్ గా వాళ్ళు.  

మామూలుగా తను పొడుగు కిందే లెక్క అయినా వాళ్ళ మధ్యన పొట్టిగా, కళ్ళజోడుతో, తింటే ఆయాసం, తినకపోతే నీరసం లాగా, జోకర్ లాగా కనబడతాడు. ఉక్రోషం గా ఉంది అతనికి.

అర్జంట్ గా బాత్రూమ్ కి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. సైగ చేశాడు విష్ణు కి. 

"బయల్దేరే ముందు  ఇంట్లో వెళ్లే వచ్చారు కదా" ఆశ్చర్యం గా అన్నాడు విష్ణు.

విష్ణు ని కోపంగా చూసాడు. ఎవరి మీదా కోపం చూపించే అవకాశం లేదు. వెధవ కెరీర్. ఎవడెప్పుడు అడ్డం తిరుగుతాడో... ఏ రహస్యాలు బయటకి వస్తాయో అనే భయం. సెక్రెటరీ లకి, డ్రైవర్ లకీ మరీ భయపడాల్సి వస్తోంది. 

ఈ మూడేళ్లలో స్ట్రెస్ తట్టుకోలేక  షుగర్, బీపీ వచ్చాయి. అన్నీ తెలిసీ ఇప్పుడే వెళ్లారు కదా బాత్రూమ్ కి, మళ్లీనా అని ప్రశ్న.

ఇల్లు గుర్తొచ్చింది అతనికి.

***
బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. విష్ణు ఆ రోజు తన కార్యక్రమాల గురించి చెప్తున్నాడు వివరిస్తున్నాడు తనకు. 

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రద్ధ గా కూరగాయలు కట్ చేస్తోంది బృంద. 

సన్నటి, పొడుగాటి మనిషి. బంగారు రంగు లో మెరిసిపోతోంది. వయసు వల్లనేమో కొద్దిగా అలిసిపోయినట్లు కనపడుతోంది. తీర్చి దిద్దినట్లున్న పోలికలు. దేవుళ్ళ ఫోటోల్లో  నుంచి దిగి తనింట్లోకి వచ్చినట్లు ఉంటుంది. 

తను సీఎం అయినా ఏ మాత్రం లెక్క  లేనట్లే ప్రవర్తిస్తుంది. ఒంటి చేత్తో ప్రత్యర్ధులను మట్టి కరిపించి ప్రపంచ బాక్సింగ్ లో తిరుగు లేని ముద్ర వేసిన ప్రసిద్ధ బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ అలీ,  తన మొదటి భార్య తో చేసిన యుద్ధం తన జీవితం లో అతి క్లిష్టమైనది అన్నాడొక సందర్భంలో. ఇక సోక్రటీస్ ని అయితే భార్య తిట్టని తిట్టు లేదంటారు. శిష్యులతో అతను మాట్లాడుతుంటే వచ్చి మీద నీళ్ళు పోసేది అని చెప్పుకుంటారు. మంచి భార్య దొరికితే ఆనందంగా ఉండొచ్చు, చెడ్డ భార్య దొరికితే ఫిలాసఫర్ అవొచ్చనే నానుడి అక్కడ నుంచే మొదలయింది. ఇక ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ నీ రెండవ భార్య కొట్టేదంటారు. 

భార్య లకి భర్త సీఎం అయినా, పీఎం అయినా చులకనే. అందుకే ఈ మధ్య పీఎం కాండిడేట్ లు పెళ్లిళ్లు చేసుకోటం మానేశారు.

బృందని చూస్తే తనలో ఏదో భయం, చెప్పలేనంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.

తమ మధ్య మాటలు ఆగిపోయి కొన్నేళ్లవుతుంది.

మదాలస విషయం తెలిసిన రోజు తర్వాత మారతాడు అనుకుందేమో, పెద్ద కనురెప్పలు పైకిఎత్తి నిరసన గా చూసింది. కానీ మాట్లాడటం మానేయలేదు. 

వేరే వాళ్ళయితే ఆ చూపు కి ఆత్మహత్య చేసుకునేవాళ్లు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని ఉన్న అనుభవంతో తను తట్టుకోగలిగాడు.

తమ ఇద్దరికీ మాటలు ఆగిపోయిన రోజు నాటి సంఘటన ఇప్పటికీ గుర్తుంది తనకి.

***

అప్పుడప్పుడే తను రాజకీయాల్లో పైకి వస్తున్న రోజులు.

నిద్ర లేచి బయటికి వస్తున్నాడు తను. హాల్లో బృంద తో పాటు తమ ఊరివాళ్లు కొంత మంది కనపడ్డారు. అప్పుడే టీ ఇచ్చినట్లుంది. అంతా టీ తాగుతున్నారు. 

తనని చూడగానే వాళ్ళలో ఒకడు పరుగెత్తుకొచ్చి తన కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. అతడి భూమి ని తన మనుషులు కబ్జా చేశారట. ఆ భూమి తప్ప తనకి మరో ఆధారం లేదని ఏడుపు మొదలెట్టాడు. ఎలాగయినా తన భూమిని తనకు ఇప్పించమని బ్రతిమాలాడు. 

తన వాళ్ళు అలా చేయరనీ, ఆ భూమి నిజంగా అతనిదేనా అనీ ప్రశ్నించాడు తను అతణ్ణి. అన్ని ప్రూఫ్ లూ పట్టుకొచ్చాడు వెధవ. 

"నేను అన్ని డాక్యుమెంట్లు చెక్  చేశాను, ఆ భూమి అతనిదే" అంది బృంద. 

'చదువుకున్న వాళ్ళను ఇందుకే పెళ్లిళ్లు చేసుకోకూడదు' తనను తానే నిందించుకున్నాడు సుధీర్ ఆ క్షణాన. 

"కనుక్కుంటాను" అని చెప్పి వాళ్ళను పంపేశాడు  ఆ రోజుకి.

అతని స్థలాన్ని తమ వాళ్ళు ఆక్రమించడం నిజమే. ఆక్రమించిన స్థలాన్ని వాళ్లెందుకు వదులుతారు? కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం.  జనాలు ఓట్లేససేటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉంటే తామిలాంటి పనులు చేయాల్సిన అవసరం రాదు. ఏ చిన్న ఎలక్షన్ కి అయినా డబ్బుతోనే పని. ప్రతి సారి కోట్లకి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. ఇలాంటి పనులే చేయాల్సివస్తుంది రాజకీయాల్లో గెలవాలన్నా, అనుచరగణం ని మెయింటెన్ చెయ్యాలన్నా.

అయితే అక్కడితో ఆ సంగతి వదిలేయాల్సింది తను. కానీ అక్కడే తెలివితక్కువ స్టెప్ వేశాడు. బృంద ముందు తన గుట్టు విప్పినందుకు కన్నెర్ర చేశాడు. మర్నాటికి స్థలం యజమాని మటుమాయం అయ్యాడు.

ఎలా తెలిసిందో బృంద కి. తన వద్దకు వచ్చి ఒకటే మాట అంది ఆ రోజు.
 




Related Novels


చీఫ్ మినిస్టర్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.