Home » mainanpati bhaskar » The Editor                                    ది ఎడిటర్

                                                                      మైనంపాటి భాస్కర్

 

                        

 

    వార పత్రిక ఆఫీసు ఎప్పుడూ బిజీగానే వుంటుంది. ఆ రోజు వీక్లీ తాలూకు ఒక సెట్ ప్రింటింగ్ వెళ్ళిపోవాలి. అందుకని మరీ బిజీ.
    ఉన్నట్లుండి తలుపు నెట్టుకుని ఎడిటర్స్ కేబిన్ లోకి దూసుకువచ్చింది ఒక నడివయసు స్త్రీ/ ఆమె వెనకాతలే ఎన్ క్లోజరులా ఆమె భర్త వచ్చాడు.
    "ఆంజనేయులు పంపాడు మమ్మల్ని" అంది ఆవిడ లోపలికి వస్తూనే ఇంగ్లీషులో.
    ఎడిటరు ప్రశ్నార్ధకంగా చూశాడు. "అంజనేయులా ' ఏ అంజనేయులూ?"
    "మీ అంజనేయులే అండీ! విజయవాడలో మీరందరూ కలిసి నాటకాలాడే వాళ్ళుటగా! మీ ఇద్దరికీ ఏరా అంటే ఏరా అనుకునేంత స్నేహమని చెప్పాడు!"
    ఎడిటర్ ఒక్కసారి మొహం చిట్లించి తర్వాత గుర్తు వచ్చినట్లు చిరునవ్వు నవ్వాడు.
    "ఓహ్! ఆంజనేయులు ! అవునవును! మేమందరంకలిసే నాటకాలడేవాళ్ళం! ఊ! ఆంజనేయులు బావున్నాడా? ఎక్కడుంటున్నాడూ?"
    "బెజవాడలో మా పేటలోనే ఉంటున్నాడండి! మిమ్మల్నోసారి కలవమన్నాడు."
    "అలాగా! ఏమన్నా పని వుందా?"
    ఆమె భర్త కళ్ళజోడూ గొంతూ రెండూ సవరించుకున్నాడు. "మై "వైఫ్ ఈజ్ ఏ వెరీ గూడ్ రైటరండి! మిమ్మల్ని కలిస్తే ఆమె ఆర్టికల్స్ మీ మేగజైనులో పబ్లిష్ చేస్తారని చెప్పాడు ఆంజనేయులు. ఆమె ఇదివరకోసారి 'ఉల్లిపోట్టుతో రవ్వలడ్డు' అనే వంటకం తయారుచేసే విధానం రాసి పంపిస్తే ఒక మేగాజైను వాళ్ళు వేసుకుని కాంప్లిమెంటరీ కాపీ కూడా పంపారు. షీ రైట్స్ వెరీగుడ్ ఇంగ్లిష్!"
    ఆ చివరి మాట విని ఎడిటర్ "మాది తెలుగు పత్రికని మీకు తెలుసా?" అన్నాడు.
    "ఆ. దాన్లేముంది?" అంది ఆ రచయిత్రి తేలిగ్గా చప్పరించేస్తూ "మీ దగ్గర సబ్ ఎడిటర్లు ఉంటారుకదండీ? నేను ఇంగ్లీషులో రాసి ఇచ్చేస్తే వాళ్ళచేత తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేయించుకోండి."
    అతి ప్రయత్నం మీద చిరాకుని అణుచుకున్నాడు ఎడిటర్.
    తనకు తను సమర్ధించుకుని చిరునవ్వుతోనే అన్నాడు "చూడండి! ఇది తెలుగు పత్రిక. తెలుగు రచనలే కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతుంటాయి. వాటిని చూడడానికే మాకు సమయం చాలదు. ఇంక ఇంగ్లీషుని అంగీకరించి ట్రాన్స్ లేట్ చేయించుకోవలసినంత అవసరమూ, అవకాశమూ కూడా మాకు లేవు. ఐయామ్ వెరీ సారీ!"
    "అదేమిటి! తన పేరు చెబితే చాలు మీరు వేసేసుకుంటారని చెప్పాడే ఆంజనేయులు!" అంది ఆమె సిన్సియర్ గా ఆశ్చర్యపోతూ.
    ఎడిటర్ నవ్వాడు. "మా వీక్లీలో ఆర్టికల్స్ పడాలంటే ఎవరి పేరూ చెప్పనక్కర్లేదు. అవి చదివించేటట్లు ఉంటే చాలు. మీరు తెలుగులో మంచి ఆర్టికల్స్ ట్రై చెయ్యండి. బావుంటే తప్పకుండా వేసుకుంటాం."
    వాళ్ళిద్దరూ మొహాలు గంటు పెట్టుకుని లేచి నిలబడ్డారు.
    "అంజనేయులిని అడిగానని చెప్పండి" అన్నాడు ఎడిటర్.
    వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
    తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు ఎడిటరు. వాళ్ళు చెబుతున్న ఆంజనేయులు ఎవరో తనకి తెలియదు. అసలు తను ఎప్పుడూ నాటకాలు ఆడలేదు. అయినా ఎవరినీ హార్ట్ చెయ్యడం తనకి ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు అందరినీ ప్లీజ్ చెయ్యాలనే చూస్తుంటాడు.
    దాన్ని అలుసుగా తీసుకుని ఎక్స్ ప్లాయిట్ చేస్తుంటారు కొంతమంది.
    వాచ్ చూసుకున్నాడు. పదకొండున్నర అవుతోంది. ఇంకో అరగంటలో సెట్ ప్రింటింగ్ కి పంపించెయ్యాలి.
    లేఅవుట్ ఆర్టిస్టు పీజీ మేకప్ పూర్తిచేసి తన ముందు ఉంచిన ఐవరీ బోర్డుని పరిశీలించాడు ఎడిటర్.
    "పేజీలో ఈ బాక్స్ రైట్ సైడ్ టాప్ లో బాగాలేదు. లెప్ట్ డౌన్ లో వుంచితే బావుటుంది కదా. మళ్ళీ పేస్ట్ చెయ్యాల్సి వుంటుంది." అన్నాడు ఆలోచిస్తూ.
    లేఅవుట్ ఆర్టిస్టు కూడా కొద్ది క్షణాలు పరీక్షగా చూసి "అవును సర్! పైగా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందనిపిస్తోంది. బాగా బాలెన్స్ అవుతుంది కూడా" అన్నాడు.
    "ఓకే! అలా చెయ్యండి" అన్నాడు ఎడిటర్.
    అతను బయటికి వెళ్ళగానే ఒక కుర్రాడు వచ్చాడు. వస్తూనే "నా నవలేమయిందండీ?" అన్నాడు.
    "ఏ నవల!" అన్నాడు ఎడిటర్.
    "కన్నీటి బతుకుల్లో పన్నీటి బుడగలు."
    వెంటనే బజర్ నొక్కాడు ఎడిటర్.
    పీయే లోపలికి వచ్చాడు.
Related Novels


The Editor

Vairam

Mister U

Maaranahomam

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.