Read more!

కార్తీక పౌర్ణమి – త్రిపురాసుర వధలోని ఖగోళ విజ్ఞానం!

 

 

కార్తీక పౌర్ణమి – త్రిపురాసుర వధలోని ఖగోళ విజ్ఞానం!

 

 

కార్తీక మాసమంటేనే భక్తిశ్రద్ధలకు నెలవైన నెల. శివకేశవులను తల్చుకుంటూ, ప్రకృతితో మమేకయ్యే మాసం. ఇందులోని ప్రతి ఒక్క తిథికీ ఒకో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి గురించి ఇక చెప్పేదేముంది! కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. శివరాత్రి తరువాత శివునికి సంబంధించిన అతి ముఖ్యమైన పర్వదినాలలో ఈ త్రిపురి పౌర్ణమిని ఒకటిగా భావిస్తారు. శివునికి త్రిపురాంతకుడు అన్న పేరు ఉంది కదా! అది త్రిపురాలను ఏలే ముగ్గురు రాక్షసులను ఈ రోజున సంహరించడం వల్ల ఏర్పడిన నామం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురినీ కలిపి త్రిపురాసురులు అని పిలిచేవారు. త్రిపురాసుర అన్న పేరు వెనుక ఓ కథ ఉంది. ఒకనాడు ఈ త్రిపురాసురులు ముగ్గురూ, శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. తమ అన్నదమ్ములలో ఒక్కొక్కరూ ఒక్కో లోకంలో నగరాన్ని నిర్మించుకుంటామనీ… బంగారం, వెండి, ఇనుముతో నిర్మించుకున్న ఆ మూడు నగరాలూ ఒక్క సమాంతర రేఖ మీదకు వచ్చినప్పుడే తమని సంహరించే అవకాశం ఉండాలనీ వరాన్ని కోరుకున్నరారు. అలా వారు త్రి`పురా`లకు అధిపతులై త్రిపురాసురులుగా పేరు పొందారు.

 

 

త్రిపురాసురులను నిర్మించుకున్నాక వారి ఆగడాలు మితిమీరిపోవడంతో సాక్షాత్తూ శివుడే వారిని సంహరించేందుకు బయల్దేరాడు. బంగారు రథాన్ని అధిరోహించి, పాశుపతాస్త్రాన్ని చేపట్టాడు. త్రిపురాలన్నీ ఒక్క తాటి మీదకు రాగానే వింటిని సంధించి ఒక్క పెట్టున బాణాన్ని వదిలాడు పరమశివుడు. ఆ ధాటికి త్రిపురాలు మూడు భగ్గుమన్నాయి. మూడులోకాలలో ఉన్న మూడు పురాలూ కూడా ఒక్క తాటికి మీదకి రావడం అని చెప్పడంలో మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానం కూడా కనిపిస్తుంది. బంగారు కాంతులను వెదజల్లే బంగారు `పురం` సూర్యడు. వెండిలా తెల్లటి కిరణాలను ప్రతిఫలించే వెండి `పురం` చంద్రుడు. ఇక ఖనిజాలను నెలవైన ఇనుముతో చేసిన `పురం` భూమి అని భావించవచ్చు. సూర్యుడు, చంద్రుడు, భూమి మూడూ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయనీ… ఆ మూడూ ఒకోసారి ఒక్కతాటి మీదకు వస్తాయని, అలా రావడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని బహుశా మన పూర్వీకులు ఆనాటికే గ్రహించి ఉంటారు. చంద్రగ్రహణం కేవలం పౌర్ణమినాడే సంభవించే అవకాశం ఉంది కాబట్టి త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమినాడే జరిగిందని చెప్పడంలో సహేతుకత కనిపిస్తుంది.

 

 

ఇక ఏడాదిలో ఏ రోజున దీపం వెలిగించే అవకాశం, సందర్భం లేకపోయినా… కార్తీక పౌర్ణమినాడు 365 వత్తులతో కూడిన దీపాన్ని కనుక వెలిగిస్తే ఆ పాప శంక తీరిపోతుందని శాస్త్రం చెబుతోంది. మరి కొందరు ఏడాదిలోని పగలు, రాత్రులకు చిహ్నంగా 720 వత్తులు కూడా వెలిగించి తృప్తి చెందుతారు. కార్తీక పౌర్ణమినాడు జ్వాలాతోరణం పేరుతో శివాలయాల్లో ఒక వేడుకని నిర్వహిస్తారు. మంటలు చిమ్ముతున్న ఓ తోరణం కిందుగా శివపార్వతులతో కూడిన పల్లకిని మూడు సార్లు తిప్పుతారు. త్రిపురాసురుడిని సంహరించిన శివునికి గౌరవార్థంగా ఈ జ్వాలాతోరణ వేడుక మొదలైనట్లు చెబుతారు. ఇక తమిళనాట ఉన్న తిరువణ్ణామలై క్షేత్రంలో అరుణాచలం కొండ మీద ఈ రోజున వెలిగించే కార్తీక దీపాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. సాక్షాత్తూ అగ్నిలింగంగా భావింపబడే ఈ కొండ మీద జ్యోతి వెలుగుతుంటే పర్వతమే ఒక ప్రమిదగా తోస్తుంది.

- నిర్జర.