Read more!

అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు ఎందుకు..

 

అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు ఎందుకు?

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి తోడుగా, ఆంజనేయుడు ఆయన రథం మీద జెండా రూపంలో కనిపిస్తాడు. ఇలా అర్జునుడి జెండా మీద హనుమంతుడు ఉండేందుకు వెనుక ఓ సరదా కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే...

కురుక్షేత్ర సంగ్రామానికి చాలారోజుల ముందరి సంగతి ఇది. అర్జునుడు ఓసారి దేశాటనకని బయల్దేరాడు. తన యాత్రలో భాగంగా ఒకో ప్రాంతాన్నీ, అక్కడి పుణ్యక్షేత్రాలనీ సందర్శిస్తూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తూ ఆ రాములవారు ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్రతీరాన తిరుగుతూ అక్కడి రామసేతువుని గమనించాడు. నలుడనే వానరుని ఆధ్వర్యంలో నిర్మించిన ఆ వంతెనని చూడగానే అర్జునుడికి ఓ ధర్మసందేహం వచ్చింది. ‘రాముడు మహా శక్తిసంపన్నుడు కదా! గొప్ప విలుకాడు కదా! అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా!’ అన్నదే ఆ సందేహం.

అర్జునుడి మనసులో ఇలా సందేహం మెదిలిందో లేదో- అక్కడ రాముని ధ్యానంలో ఉన్న హనుమంతులవారికి విషయం చేరిపోయింది. వెంటనే ఒక సాధారణ వానరుడిలాగా అర్జునుడి దగ్గరకు చేరుకుని ‘మీరు ఏదో సమస్యతో మధనపడుతున్నట్లు ఉన్నారు. ఏమిటీ విషయం?’ అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరం ముందర నిలిపాడు.

‘రాములవారు బాణాలతో సేతువుని నిర్మించలేకేమీ కాదు! కాకపోతే కోట్లకొలదీ వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే, రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితం. అందుకనే వానరులతో వంతెనని నిర్మింపచేశారు,’ అని బదులిచ్చాడు హనుమంతుడు.

వానరరూపంలోని హనుమంతుడు చెప్పిన జవాబు, అర్జునుడికి సంతృప్తిగా తోచలేదు. ‘ఏదైనా సరే, రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సింది!’ అంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్తా గొడవకు దారితీసింది. చివరికి హనుమంతునికి కోపం వచ్చి ‘సరే! రాములవారి సంగతి అలా ఉంచు. నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా! సాక్షాత్తూ ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కదా! మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. ఆ వంతెన మీద నేను నడుస్తాను. నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే. లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా?’ అని అడిగాడు.

హనుమంతుని సవాలుతో అర్జునుడికి పట్టుదల చెలరేగింది. ‘నీ ధాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే, ఓటమిని అంగీకరించడమే కాదు... ఇక్కడికిక్కడే అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేస్తాను,’ అని శపథం చేశాడు. ఇంకేం! రసవత్తరమైన పోటీకి రంగం సిద్ధమైంది.

అర్జునుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్భుతమైన ఓ శరవంతెనను నిర్మించాడు. కానీ ఏం లాభం! రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదో... వంతెన కాస్తా తునాతునకలు అయిపోయింది. ఆ ధాటికి విస్తుపోవడం అర్జునుడి వంతయ్యింది. దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇంతలో...

ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వారిని సమీపించాడు. అగ్నిప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చూసి ‘ఏం జరుగుతోంది?’ అంటూ ప్రశ్నించాడు. ఆ బ్రహ్మణుడి ముఖవర్చస్సు చూసి హనుమంతుడు, అర్జునుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆపై జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించారు.

‘అంతాబాగానే ఉంది! కానీ న్యాయనిర్ణేత లేకుండా పోటీ అనర్హం కదా! అందుకని మీరు మరోసారి మీ పోటీ సాగించండి. ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను. ఎలాంటి పక్షపాతానికీ ఆస్కారం లేకుండా చూస్తాను,’ అన్నాడు బ్రాహ్మణుడు.

బ్రాహ్మణుని మాటలు కూడా సబబుగానే తోచాయి. వెంటనే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి అర్జునుడు తన గురువు, ఆప్తబంధువు అయిన అర్జునుడిని తల్చుకుని వారధిని నిర్మించాడు. అలా నిర్మించిన వారధిని స్పృశించి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆశీస్సులని అందించాడు. ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని కూలగొట్టేందుకు దాని మీదకు ఎక్కాడు.

విచిత్రం! ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది. అతను ఎన్ని కుప్పిగంతులు వేసినా అది కించిత్తయినా కదలనే లేదు. అది చూసి హనుమంతునికీ, అర్జునుడికీ కూడా ఏదో అద్భుతం తోడయ్యిందన్న విషయం అర్థమైంది. తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాడనీ... సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణపరమాత్ముడనీ బోధపడింది. అహంకారానికి లోనై, తాము పనికిరాని పంతాన్ని పట్టామని ఇద్దరికీ అర్థమైంది. వారికి ఆ జ్ఞానోదయం కలిగినవెంటనే శ్రీకృష్ణుడు తన నిజరూపంలో వారి ముందు సాక్షాత్కరించాడు. రాముని అవతారంలో తనని సేవించిన హనుమంతునీ, కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడినీ కలిపాడు. అలా చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువైనాడని అంటారు.

- నిర్జర.