Read more!

శంఖుడు.. లిఖితుడు అనే అన్నదమ్ముల కథ

 

శంఖుడు.. లిఖితుడు అనే అన్నదమ్ముల కథ

 

 

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రుసమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘దర్మరాజా ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెబుతాను విను,’ అంటూ ఇలా చెప్పసాగాడు...

 

పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్లు ఇద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే! త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడినవారే! వారిద్దరూ కూడా బహుదానదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తున్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచిచూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆశ్రమంలో విరగకాసిన పండ్లచెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పళ్లని చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కాసిన పళ్లని కోసుకున తినసాగాడు.

 

ఇంతలో శంఖుడు ఆశ్రమంలోకి రానేవచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్లని చూసి ‘అవెక్కడివని’ అడిగాడు. ‘నీ ఆశ్రమంలోనివే!’ అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. ‘సోదరా! మునివర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా! పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయడం దొంగతనంతో సమానం కదా! కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్లి తగిన దండన స్వీకరించు,’ అని సూచించాడు.

 

లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా... తాము ఇరువురమూ సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా! కాబట్టి ఆశ్రమధర్మాలను పాటించి తీరవలసిందే కదా! అనిపించింది. వెంటనే ఆ దేశ రాజుగారైనా సుద్యుమ్నుని చెంతకు వెళ్లాడు. తన రాజప్రాసాదం వద్ద లిఖితుని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. ‘ప్రభూ నేను నా అన్నగారి అశ్రమంలో పండుని దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను. ఒక దొంగకి ఎలాంటి శిక్షను విధిస్తారో, నాకు కూడా అదే శిక్షను విధించండి,’ అంటూ సుద్యుమ్నుని కోరాడు.
లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు- ‘లోకకళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులని ఎలా దండించగలను,’ అంటూ లిఖితుని మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోకపోవడంతో, రాజదండన చట్టం ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులనూ నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు.

 

ఖండితమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంఖుడు- ‘సోదరా! చేసిన తప్పుకి శిక్షను అనుభవించడంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరుని నిలబెట్టారు. వెళ్లు వెళ్లి ఆ బహుదానదిలో నీ పితృదేవతలను తలచుకొని స్నానం చేసి రా!’ అంటూ పంపాడు శంఖుడు.

 

ఆశ్చర్యం! లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులూ తిరిగివచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమైంది. తనకి మంచిచెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్లి ‘అన్నగారు! ఖండితమైన నా చేతులని కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా! మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా! ఆ రాజుగారి దగ్గరకు వెళ్లమని ఎందుకు సూచించినట్లు,’ అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంఖుడు చిరునవ్వు చిందిస్తూ- ‘సోదరా! ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవడం మన ధర్మం. పాలన చేయడం, పాపులను శిక్షించడం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురుపత్నిని మోహించడం, సాధువులను హత్య చేయడం, సురాపానం, చెడుసావాసం చేయడం వంటి పాతకాలకి రాజదండన అనుభవించాల్సిందే! అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను,’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

‘కాబట్టి ఓ ధర్మరాజా! ఒక రాజుగా ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో శత్రువులని సంహరించడం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులని వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపమూ అంటదు. ఇక నీ బాధ్యతని నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది?’ అంటూ వ్యాసుడు ధర్మరాజుని ఓదార్చాడు. పై కథ చదివాక... చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్షా! అన్నగారు మళ్లీ తల్చుకోగానే చేతులు తిరిగివస్తాయా! లాంటి ప్రశ్నలకు రావడం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటివారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెబుతోంది. అది సొంత సోదరుని సొత్తయినా కానీ, అతని అభీష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవూ ఉంది. అన్నింటికీ మించి... ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది.

- నిర్జర.