Read more!

విష్ణుభక్తుడైన రాజు – కులశేఖర ఆళ్వారు

 

 

 

విష్ణుభక్తుడైన రాజు – కులశేఖర ఆళ్వారు

 


అతను దక్షిణభారతంలో పేరొందిన రాజు. కానీ తన హృదయ సామ్రాజ్యంలో మాత్రం రాముడినే ప్రతిష్టించుకున్నాడు. తన రాజ్యాన్ని విస్తరిస్తూ మహాసామ్రాజ్యాన్ని నిర్మించినా కూడా ఆ దేవదేవుని గడప దగ్గరే ఉండేందుకు వరాన్ని కోరుకున్నాడు. అందుకనే 12 మంది ఆళ్వారులలో ఒకరిగా శాశ్వతంగా చరిత్రగా నిలిచిపోయాడు- ఆయనే కులశేఖర ఆళ్వారు.

 

చేరవంశం

కేరళని పాలించిన రాజులలో చేరవంశపు రాజులది ఓ ఘనచరిత్ర. అలాంటి వంశంలో దృఢవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయనకీ ఎంతకీ పిల్లలు కలగకపోవడంతో ఆర్తిగా ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకున్నాడు. దృఢవ్రతుని వేడుకోళ్లు ఫలించాయా అన్నట్లుగా సరిగ్గా రాములవారి జన్మనక్షత్రం అయిన పునర్వసు నక్షత్రం రోజునే ఓ కుమారుడు కలిగాడు. వారసునిగా తన పేరు నిలుపుతాడనే నమ్మకంతో అతనికి కులశేఖరుడు అని నామకరణం చేశారు.

 

తండ్రికి తగ్గ తనయుడు

కులశేఖరుడు తన పేరుకి తగినట్లుగానే రాజవంశ ప్రతిష్టను నిలిపేలా ఎదిగాడు. సకల విద్యలనూ అభ్యసించాడు. సంస్కృతంలో సైతం విశేష పాండిత్యాన్ని గడించాడు. ఇక యుద్ధవిద్యలైతే చెప్పనక్కర్లేదు. కులశేఖరుడు సుమారు క్రీ.శ 800 సంవత్సరంలో రాజ్యసింహాసనాన్ని అధిష్టించాడని అంచనా వేస్తున్నారు. స్వతహాగా విష్ణుభక్తుడు అయినప్పటికీ రాజుగా సైతం కులశేఖరునిడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉండేవాడు. అందుకే  అప్పటివరకూ కేరళకే పరిమితం అయిన తన రాజ్యాన్ని తమిళనాడుకి సైతం విస్తరించారు.

 

భక్తికి పరాకాష్ట

కులశేఖరునికి విష్ణుమూర్తికి సంబంధించిన గాథలన్నా, విష్ణుభక్తులన్నా మహాగౌరవం. దీనికి సంబంధించి అనేక కథలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా ఆసక్తిగా ఉంటుంది- కులశేఖరునికి రాముడంటే మహా ఇష్టం. ఆయన కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు. పండితులను పిలిపించి ఆయన గురించిన గాథలను చెప్పించుకునేవాడు. ఆ గాథలని వింటూ వాటిలో లీనమైపోయేవాడు. అలాంటి ఓ సందర్భంలో, పండితులవారు రాముడు యుద్ధానికి బయల్దేరే ఘట్టాన్ని వివరిస్తున్నారు. అంతే! ఆ ఘట్టంలో లీనమైపోయి ఉన్న కులశేఖరుడు తాను కూడా రాముని పక్షాన యుద్ధం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. వెంటనే తన సైన్యాన్నంతా యుద్ధానికి సిద్ధం కమ్మంటూ ఆదేశించాడు. యుద్ధం ఎందుకో, ఎవరితోనో తెలియక సైన్యాధిపతులు బిక్కమొగం వేసుకుని నిల్చొన్నారు. ఇంతలో రాములవారు యుద్ధంలో విజయం సాధించారన్న ఘట్టాన్ని పండితుడు వివరించడంతో, కులశేఖరుడు శాంతించాడు.

 

సాఫల్యం

కులశేఖరుడు కేవలం భక్తుడే కాదు. తనలోని భక్తిని అక్షరబద్ధం చేయగల సృజనకారుడు కూడా! అందుకే ‘పెరుమాళ్‌ తిరుమొళి’  పేరుతో ఆయన రాసిన 105 పాశురాలను ఆళ్వారుల సాహిత్యంలో భాగంగా పరిగణిస్తారు. దీనికి తోడుగా ‘ముకుందమాల’ పేరుతో సంస్కృతంలో ఆయన రాసిన స్త్రోత్రం కూడా బహుళ ప్రచారంలో ఉంది. ఈ విధంగా కులశేఖరుడు సాహిత్యంలో ఎలాగూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయినా తనివితీరక, నిత్యం ఆ విష్ణుమూర్తిని చూసుకుంటూ ఉండే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకున్నాడట. దాంతో తిరుమలలోని వేంకటేశ్వరుని గర్భగుడి ముందు గడపగా ఉండే వరాన్ని పొందాడు. అందుకనే తిరుమలలోని గర్భగుడి ముందు ఉన్న గడపని ‘కులశేఖర పడి’గా పిలుచుకుంటారు.

 

- నిర్జర.