Read more!

కార్తీక స్నానాలకు- బీచుపల్లి

 

 

 

కార్తీక స్నానాలకు- బీచుపల్లి

 

 

బీచుపల్లి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి కాకపోవచ్చు. కానీ కృష్ణా పుష్కరాలు వచ్చినా, కార్తీక మాసం మొదలైనా తెలంగాణవాసులకు తొలుత గుర్తుకువచ్చే క్షేత్రాలలో ఒకటి. ఎందుకంటే హైదరాబాదుకి దగ్గరగా నదీక్షేత్రాన వెలసిన పుణ్యక్షేత్రాలలో బీచుపల్లి ముఖ్యమైనది. ఆ బీచుపల్లి విశేషాలు...

 

వ్యాసరాయల ప్రతిష్ట

బీచుపల్లి అంటేనే కృష్ణా తీరాన వెలసిన ఆంజనేయస్వామి ఆలయం గుర్తుకువస్తుంది. ఇక్కడి స్వామిని కృష్ణదేవరాయల గురువుగారైన వ్యాసరాలయవారు ప్రతిష్టించారని తెలుస్తోంది. ఈ ప్రతిష్ట వెనుక ఉన్న కొన్ని కథలు కూడా విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి వ్యాసరాయలవారు ఇక్కడి నదీతీరంలో స్నానం చేసి విశ్రమిస్తున్నారట. ఆ సమయంలో ఆయన విడిచిన బట్టలను ఓ శిష్యుడు ఉతుకుతుండగా, బట్టలుతికే బండ నుంచి చిత్రమైన శబ్దాలు రాసాగాయట. వ్యాసరాయలు ఆ బండను తిప్పి చూడగా, అది సాక్షాత్తూ ఆంజనేయస్వామి విగ్రహం అని తేలింది.

 

 

మోయలేనంత బరువు

ఆ విగ్రహాన్ని తగిన ప్రదేశానికి తీసుకువద్దామని వ్యాసరాయలవారు స్వయంగా మోసేందుకు సిద్ధపడ్డారట. కానీ పర్వతాలని సైతం మోసిన ఆంజనేయుని మోయడం సామాన్యులకు సాధ్యమా! ఆ విగ్రహాన్ని మోసే ప్రయత్నం చేసిన వ్యాసరాయలవారు అది విపరీతమైన బరువు ఉండటాన్ని గ్రహించారు. దాంతో తన మీద దయ ఉంచి కాస్త బరువు తగ్గమని ప్రార్థించారట. ఆయన ప్రార్థనలకి కరిగిన ఆంజనేయుడు నిజంగానే బరువు తగ్గాడని చెప్పుకొంటారు. ఓ రావి వృక్షం దగ్గరకు రాగానే విగ్రహం తిరిగి బరువుదేలడంతో... అదే స్వామివారిని ప్రతిష్టించాల్సిన సూచనగా వ్యాసరాయలవారు గ్రహించారు.

 

బీసన్న పేరుమీదుగా బీచుపల్లి

స్వామివారిని ప్రతిష్టించిన రోజు రాత్రి వ్యాసరాయలవారికి ఓ కల వచ్చిందట. మరుసటి రోజు ఉదయం ఎవరైతే తన తొలి దర్శనానికి వస్తారో, వారిని తన పూజారిగా నియమంచమంటూ స్వామివారు ఆ కలలో నిర్దేశించారు. అలా మరుసటిరోజు ఉదయాన వచ్చిన ‘బీసన్న’ అనే బోయని పూజారిగా నియమించారు. ఆ బీసన్న మీదుగానే బీచుపల్లి అన్న పేరు స్థిరపడిందట. అలా అయిదు వందల ఏళ్లుగా ఈ బీచుపల్లి ప్రసిద్ధ హనుమాన్‌ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.

 

 

 

హరిహర క్షేత్రం

బీచుపల్లిలో అటు ఆంజనేయస్వామి ఆలయం. దాని వెనుకనే నదీతీరాన చిన్న శివాలయం కనిపిస్తాయి. ఇక నదీ స్నానం చేసేందుకు విశాలమైన ఘాట్లు కూడా ఉంటాయి. జాతీయ రహదారి పక్కనే ఉండటం, హైదరాబాదు నుంచి 170 కిలో్మీటర్ల దూరంలో ఉండటంతో కార్తీక స్నానాలు చేసేందుకు భక్తులు అసంఖ్యాకంగా బీచుపల్లిని చేరుకుంటారు. ఇరువైపులా శంఖుచక్రాలతో ఉన్న ఇక్కడి హనుమంతుడు, కోరిన కోరికలను తీర్చే భక్తసులభునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి నుంచి అలంపురం కూడా ఓ 50 కిలోమీటర్లలోపే ఉంటుంది. ఒకే రోజులో ఇటు కృష్ణాతీరాన వెలసిన బీచుపల్లినీ, అటు తుంగభద్ర తీరాన శక్తిపీఠమై ఉన్న అలంపురాన్నీ దర్శించుకోవచ్చు.

 

 

- నిర్జర.