Home » Kartika Maha Puranam  » సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము


సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము

 

 

సప్తవింశోధ్యాయము
   
నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు - ఆ ధనేశ్వరునకు ప్రేతపతియనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుని తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు.
   
తప్తవాలుకము: 'ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే, పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై - దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ వుంటారు. దీనినే 'తప్తవాలుక నరకము' అంటారు. వైశ్వదేవపరులైన అతిధులను పూజించనివారూ, గురువులను - అగ్నిని - బ్రాహ్మణులను , గోవును,  వేదవిదులను , యజమానిని- కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు లెలా కాల్చుతున్నారో చూడు.
   
అంధమిస్రము: ఈ నరకములో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు - పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ వుంటాయి. ఇది పదహారు రకములుగా - కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై వుంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ యీ నరకంలోనే దండింపబడుతూ వుంటారు.

 

 

Sampoorna Karthika Maha Purananamu 29th Day Parayanam

 

   
క్రకచము: అనే పేరుగల యీ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగానూ, నిలువుగానూ, ఏటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగాలుగానూ - రంపాలతో కోస్తూంటారు.
   
అసిపత్రవనం: నాలుగు నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యా-భర్తలను, తల్లి-దండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి - నిలువెల్లా బాణాలతో గ్రుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి, ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరమే తోడేళ్ళ గుంపులకు భయపడి, పారిపోవాలని పరుగులు తీసి, పారిపోయే దిక్కులేక పరితపిస్తూ వుంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా వుంటుంది.
   
కూటశాల్మలి: పదహారు రకాలుగా దండించేదీ - పరస్త్రీలనూ, ద్రవ్యాన్నీ హరించే వాళ్ళూ, పరాపకారులూ అయిన పాపులు వుండేదీ 'కూటశాల్మలీ' నరకం.

 

 

Sampoorna Karthika Maha Purananamu 29th Day Parayanam

 

   
రక్తపూయము: 'రక్తపూయ' మనే ఈ విభాగం ఆరవనరకం. ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ వుంటారు. ఎవరైతే తమ కులాచారరీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో - వారంతా ఈ నరకంలోనే వుంటారు.
   
కుంభీపాకము: మొట్టమొదట నీకు విధించబడినదీ ఘోరాతి ఘోరమైనదీ, నరకాలన్నిటిలోకీ నికృష్టమైనదీ అయినది ఈ 'కుంభీపాక'మే ఏడవ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి వుంటుంది.
   
రౌరవము: నరకాలలో ఎనిమిదవదైన ఈ 'రౌరవం' దీర్ఘకాలికమని తెల్సుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బైటపడలేరు.

ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకంటిన పాపాన్ని శుష్కమనీ, మనకు మనమై చేసుకున్న పాపాన్నీ ఆర్ద్రమనీ అంటారు. ఆ రెండు రకాల పాపాలూ కలిపి ఏడు విధాలుగా వున్నాయి. 1.అపకీర్ణం 2.పాంక్తేయం 3.మలినీకరణం 4.జాతిభ్రంశం 5.ఉపవీతకం 6.అతిపాతకం 7.మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ వున్నాయి. కాని, నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు.

 పై విధంగా చెబుతూ - యమదూతయైన ప్రేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై, కుబేరునకాప్తుడై, ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు డయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్ధం ఇతని పేరు మీదనే సుమా! అందువలన, సత్యభామా! పాపహారిణీ, శోకనాశినీ అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు' అని - సత్యభామకు చెప్పిన వాడై - శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టానార్ధయై స్వీయ గృహానికి వెళ్ళాడని - సూతుడు ఋషులకు ప్రవచించాడు.
   
 
సప్తవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము)
   
 
 అష్టావింశోధ్యాయము

 

 

Sampoorna Karthika Maha Purananamu 29th Day Parayanam

 

   
సూత ఉవాచ: ఈ కార్తీకమాసము పాపనాశని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి - ముక్తిదాయినీ అయి వుంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతః స్నానము, తులసీసేవ ఉద్యాపనం, దీపదానం - అనే ఈ అయిదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించినవారు ఇహాన భుక్తినీ పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్ధ కామమోక్షాలు నాలుగింటి కోసమూ ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి వుంది.

కష్టములలో వున్నవాడయిననూ, దుర్గారణ్యగతుడయినా, రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినాసరే వ్రతమును మానకుండా శివాలయంలోనో, విష్ణాలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టు వద్దగానీ, తులసీవనంలో గాని వ్రతం చేసుకోనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు లాలపించే వాళ్ళు సహస్ర గోదానఫలాన్నీ, వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేథ ఫలాన్నీ, నర్తకులు సర్వతీర్ధాల స్నానఫలాన్నీ పొందుతారు. ఆపదలలో వున్నవాడూ, రోగీ మంచినీరు దొరకనివాడూ వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జన మాచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తిలేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.
   
        శ్లో || అవ్యక్త రూపిణో విష్ణోః స్వరూపో బ్రాహ్మణోభువి||
 
  
శ్రీమహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం.
   
అందుకుగాను శక్తిలేనివాళ్ళు గోపూజ చేసినా చాలును, ఆపాటి శక్తయినా లేనివాళ్ళు రావి, మర్రి వృక్షాలనూ పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు.
   
దీపదానం చేసే స్తోమతు లేనివారు, దీపారాధనకయినా తాహతు లేని వారు - ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింప చేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి.
   
 రావి - మర్రి

 

Sampoorna Karthika Maha Purananamu 29th Day Parayanam

 

సూతుడు చెప్పినది విని - ఇతర వృక్షములన్నిటి కంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు.

పూర్వమొకసారి పార్వతీ-పరమేశ్వరులు మహా సురత  భోగంలో వుండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ - కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినికిన పార్వతీ దేవి 'సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ వున్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడి వుండండి' అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్ధంగానూ, శివుడు వటముగానూ మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావిచెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా - శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు.
   
(ఇరువది ఏడు - ఇరువది అధ్యాయములు)

 

Sampoorna Karthika Maha Purananamu 29th Day Parayanam

 

29 వ రోజు

నిషిద్ధములు :- పగటి ఆహారం, ఉసిరి

దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం

పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)

జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,
                                           ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

 

ఇరువది తొమ్మిదవ (బహుళ చతుర్దశి) రోజు పారాయణము సమాప్తము

 

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.