Read more!

సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఆరవ రోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది ఆరవ రోజు పారాయణము

 

 

ఏకవింశాధ్యాయము


విష్ణుగణాలు చెప్పినదంతా విని __విస్మృత చేష్టుడూ, విస్మయరూపుడూ అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్ గా ప్రణామాచరించి __'ఓ విష్ణుస్వరూపులారా! ఈ జనానీకమంతా అనేకానేక కత్రువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూవున్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో __ దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి' అని వేడుకున్న మీదుట, విష్ణుగణాలు అతనిని ఇలా సమాధాన పరచసాగాయి.

 

 

 


పాపరహితుడైన బ్రహ్మణుడా! నీ వడిగిన ప్రశ్నకు __ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను. విను. పూర్వం కాంచీపురాన్ని 'చోళుడు' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదునే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో __ తామరపర్ణీనది యొక్క రెండు తీరాలు కూడా కుబెరోదయానవనాలైన 'చైత్రరథా' ల వలే ప్రకాశించేవి. అటు వంటి రాజు ఒకానొకనాడు 'అనంతశయన ' మనే పేర యోగనిద్రా  ముద్రితుడై వుండే విష్ణ్వాలయానికి వెళ్ళి, మణిమౌక్తిక సువర్ణపుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు.  అంతలోనే  'విష్ణుదాసు' డనే బ్రహ్మణుడొకడు విష్ణ్వార్చనార్ధమై ఆ ఆలయానికి వచ్చాడు. 'విష్ణుసూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి  తులసిదళాలతోనూ, గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్తయై కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రహ్మణాభిజాత్యాన్ని విస్మరించి,

 

 

 

'ఓరి విష్ణుదాసుడా ! నేను మాణిక్యలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే __ అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా? అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి 'రాజు' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి 'ఓ  రాజా! దైవభక్తి లేదు సరికదా! రాజ్యైశ్వర్యమత్తుడవై వున్నావు. విష్ణు ప్రీత్యర్ధం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు' అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తీ శూన్యడవని  తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దరిద్రుడవూ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది.? అసలు నీవెప్పుడయినా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా వుంది. ఓ సదస్యులారా! సద్భాహ్మణులారా! శ్రద్దాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్నిపొందుతానో, ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి.   అంతటిలో మా ఇద్దరిలో భక్తీ ఎటువంటిదో మీకే తెలుస్తుంది' అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి __ చోళుడు స్వగృహానికి వెళ్ళి 'మద్గలుడు' అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్రయాగానికి పూనుకున్నాడు. బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినదీ, అన్నదానాలూ, అనేకానేక దక్షిణలతో, సామాన్యులకు  ఆచరించసాధ్యం కానిదీ, సర్వసమృద్ధి మంతమైనదీ అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు.

 

 

పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ _తులసీవన సంరక్షణలూ, ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడషోపచార విధిని నిత్యపూజలనూ, నృత్యగీత వాద్యాది మంగళ ద్వనులతోనూ, ఈ విధంగా తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యమూ సర్వవేళలలోనూ, బోజనాది సమయాలలోనూ,  సంచారమందూ, తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాలలో విశేష నియమపాలనని చరిస్తూ వున్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ, విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ  వ్యాపారాలనూ వ్రాత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తికోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే వుండిపోయారు.
   
ఏకవింశోధ్యాయ స్సమాప్తః
(ఇరువది ఒకటవ అధ్యాయము)

 ద్వావింశోధ్యాయ

 

 

 



కాలం గడుస్తూ వుండగా, ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కాని పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించి పోతూండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళపోనీయకూడదనే ఆలోచనలో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ భోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతి రోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే వున్నారు. అతను పస్తులుంటూ, కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా వుండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని, వంటకాలను పూర్వస్థానమందే వుంచి తానో చాటున దాగి కూర్చుని, దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకానొక ఛ౦డాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా వుంది. రక్తమాంసాలే మాత్రమూ లేకుండా __ కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా వున్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛ౦డాలుడు వంటకాలను దొంగిలించుకు పోసాగాడు. అతని దైన్యహైన్యస్థితిని చూసి, అప్పటికే కరుణాభరితమైన హృదయంతో వున్న బ్రాహ్మణుడు 'ఓ మహాత్మా! కాస్సేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు, అంటూ నేతి ఝూరీతోసహా అతని వెంటపడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చంఢాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పౌరుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరిగెడుతూ _ "అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకుని తినవయ్య స్వామి ' అని అరుస్తూనే వున్నాడు. అతనిని తనపై వస్త్రపు చెంగులతో ఆ చంఢాలుడు __ చిరినవ్వు నవ్వుతూ లేచాడు.

 

 

 

ఇప్పుడితను  విష్ణుదాసుని కళ్ళకు __ శంఖచక్ర గదాబ్జధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ శ్రీవత్సలాంఛితుడూ, కౌస్తుభాలంక్రుతుడూ అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంలో అతగాడు సాత్త్వికభావా వృతుడై పోయి __ అవాక్కుగా వుండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్ధం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీదా, విష్ణుదాసుడి మీదా కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది. అనంతరమా ఆదినారాయణుడు విష్ణుదాసుని గ్రుచ్చి కౌగలించుకున్నాడు తన సారూప్యాన్నిప్రసాదించి తనతో బాటే తన విమాన మెక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు. యజ్ఞవాటికలో వున్న చోళుడు __ గగనాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరీని చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి __'ఓ ముద్గురమునీ! నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితశ్వర్యవంతుడవైన నేను అసాధ్యలయిన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్ష్యాత్కరాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం ఆ సంగతమే గదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులూ కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైనా కృప కలిగినట్లు లేదు.  దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణ్వనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను, అని చెప్పాడు బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే వుండటం వలన నిస్సంతుడయిన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.



శ్లో '' తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యంశ భాగినః !
స్వ స్రీయా ఏవ జాయంతే తత్క్రుతావిధి వర్తినః !!



ఆ కారణం చేతనే __ ఇప్పటికీ కూడ  ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్ళులే కర్తలవుతూ వున్నారు.

 

 



అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి __ 'ఓ శ్రీహరీ! త్రికరణ శుద్ధిగా నీ యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రీ!" అని ప్రార్ధించి సమస్తసదస్యులూ చూస్తూండగానే అగ్నిప్రవేశ మాచరించాడు.    

 శ్లో '' ముద్గలస్తు అతః క్రోథా చ్చిఖముత్సాటయిన్ స్వకాం
 అతస్య్వ ద్యాసి తద్గోత్రే ముద్దలా విశిఖా2భవన్ !!


అది చూసి క్రుద్దుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. ఇది మొదలు ఆ గోత్రమీనాటికి 'విశిఖ' గానే వర్ధిల్లుతోంది.

హోమగుండంలో ప్రవేశించిన రాజును __ అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ననుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్తా! అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరిఅటు విష్ణుదాసుని, ఇటు చోళునీ కూడా అనుగ్రహించి, సాక్షాత్కారమిచ్చి __ తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి __ ఓ విప్రుడా! విష్ణ్వనుగ్రహానికి, విష్ణుసాక్షాత్కారానికి రెండు విధాలుగా వున్న ఒకే ఒక్క మార్గం __ అది భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం' అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు.
   
ఏవం శ్రీ పద్మా పురాణాం తర్గత మహాత్మ్యమందలి
ఇరువది ఒకటి, ఇరువది రెండు __ అధ్యాయములు

 

 

 

26 వ రోజు

నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు

దానములు :- నిలవవుండే సరుకులు

పూజించాల్సిన దైవము :- కుబేరుడు

జపించాల్సిన మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

ఫలితము :- ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

 

ఇరువది ఆరవ (బహుళ ఏకాదశి) రోజు పారాయణము సమాప్తము