Home » Karthikamasa Vaibhavam » కార్తీకపౌర్ణమి ప్రత్యేకత


 

కార్తీకపౌర్ణమి ప్రత్యేకత

 

హైందవ ధర్మాచరణలో దీపానికి గొప్ప ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజాగదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ ఓపిక లేకనో, సమయం కుదరకనో ప్రతి రోజూ అలా దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అందుకోసం కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగించి తీరమంటూ సూచిస్తున్నారు. వీలైతే సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ గుర్తుగా ఈ రోజున 365 వత్తులు వెలిగించమని చెబుతారు.

 

దీపారాధన ఇలా

కార్తీక పౌర్ణమి రోజు తలార స్నానం చేసి, పూజాదికాలను నిర్వహించుకొని, ఉపవాసం ఉండి... సాయంవేళలలో ఆవునెయ్యి లేదా నువ్వులనూనెతో దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో దీపానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి, అలాంటి దీపాన్ని దానం చేస్తే మరింత మంచిదని చెబుతుంటారు. అందుకోసం బియ్యపుపిండి లేదా గోధుమపిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తుంటారు. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలలో సైతం దీపదానం చేస్తారు. మట్టితో చేసిన ప్రమిదలని దానం ఇవ్వడం అంత శుభసూచకం కాదు కాబట్టి ఇలా పిండితో చేసిన దీపాలను దానం చేయమని సూచించి ఉంటారు.

 

త్రిపురి పౌర్ణమి

కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలవడం కద్దు. పూర్వం శివభక్తులైన ముగ్గురు రాక్షసులు ఉండేవారట. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదన్నా వరాన్ని కోరుకొనమని అడుగగా తమను బంగారం, వెండి, ఇనుము అనే మూడు పురాలకు అధిపతులుగా చేయమని కోరుకున్నారు. అంతేకాదు! అంతరిక్షంలో సంచరించే ఈ మూడు పురాలూ ఎప్పుడైతే ఒకే రేఖ మీదకి వస్తాయో, ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకున్నారు. ఇలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఆ పరమేశ్వరుడే వారిని సంహరించేందుకు పూనుకున్నాడు. వేయి సంవత్సరాల అనంతరం ఎప్పుడైతే ఆ మూడు పురాలూ ఒక్క తాటి మీదకు వచ్చాయో, అదను చూసి వాటిని తన బాణంతో ఛేదించి త్రిపురాంతకుడు అయ్యాడు.

 

జ్వాలాతోరణం

కార్తీకమాసం రోజున శివాలయాల వద్ద జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. ఒక ద్వారం రూపంలో ఉన్న కర్రలకి ఎండుగడ్డిని చుట్టి, అవి మండుతుండగా వాటి కింద నుంచి శివపార్వతుల విగ్రహాలను తీసుకువెళ్తారు. జ్వాలాతోరణంలోని గడ్డిని కనుక పశువులకు తినిపించినా, గడ్డి మేటలో దాచుకున్నా సకల శుభాలూ కలుగుతాయని రైతులు భావిస్తారు. శివుడు అగ్ని స్వరూపం కాబట్టి ఇలా జ్వాలా రూపంలో కానీ, దీప రూపంలో కానీ ఆయనను కొలవడం వింతేమీ కాదు. బహుశా అందుకేనేమో అగ్నిలింగాన్ని సూచించే తిరువణ్ణామలై కొండ మీద కార్తీకమాసంలోని కృత్తికా నక్షత్ర సందర్భంగా భారీ దీపాన్ని వెలిగిస్తారు.

 

సముద్రస్నానాలు


ఇక కార్తీకపౌర్ణమి అనగానే సముద్ర స్నానం తప్పక గుర్తుకువస్తుంది. ఏడాదిలో ఎప్పుడు సముద్ర స్నానం చేసినా చేయకపోయిన ఆషాడం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా సముద్ర స్నానం చేయమని సూచిస్తుంటారు. సముద్ర స్నానం చేయడానికి ఈ సందర్భాలు అనువుగా ఉండటం ఒక కారణం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుందనీ, ఇలాంటి సందర్భంలో సముద్ర స్నానం చేయడం వలన సమస్త చర్మరోగాలు నశించిపోతాయని పెద్దల మాట.

- నిర్జర






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.