Read more!

కార్తీక దీపంతో డిప్రెషన్‌ పోతుందా

 

 

 

కార్తీక దీపంతో డిప్రెషన్‌ పోతుందా

 

 

పౌర్ణమినాట కృత్తికా నక్షత్రం వచ్చే మాసమే కార్తీక మాసం. కార్తీకమాసం అనగానే వనభోజనాలు, ఉపవాసాలు, నదీస్నానం వంటి ఆచారాలతో పాటుగా దీపారాధన కూడా గుర్తుకురాక మానదు. ధార్మికులైనవారు ఏడాది పొడవునా దీపం వెలిగించినా వెలిగించకపోయినా, కార్తీకమాసంలో మాత్రం తప్పకుండా దీపం వెలిగించాలని సూచిస్తుంటారు పెద్దలు. కార్తీక దీపం గురించి అంత ప్రత్యేకంగా చెప్పేందుకు కారణం ఏముంటుంది...

 

దీపారాధన మహత్యము

కార్తీకపురాణం ప్రకారం ఈ మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వల్లా కైలాసాన్ని చేరుకున్నాడనీ... కథలు కనిపిస్తాయి. ఇక ఈ మాసంలో ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిదంటుంది కార్తీక పురాణం. ఒకవేళ ఆవునేయిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్పనూనెతోగానీ, నారింజ నూనెతోగాని.... ఏదీ కుదరకపోతే ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చునని చెబుతోంది.

 

 

కారణాలు

- కార్తీకమాసంలో మొదలయ్యే చలికాలంతో పగటివేళలు తగ్గి, చీకట్లు త్వరగా కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతల్లోనూ, సూర్యకాంతిలోనూ ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలోని జీవగడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆహారం దగ్గరనుంచీ నిద్రవరకూ అన్ని అలవాట్లనూ ఇది ప్రభావితం చేస్తుంది. దీని వలన మనిషి మనసు కూడా స్తబ్దుగా మారిపోతుంది. మరికొందరైతే ఈ చలికాలంలో Seasonal affective disorder (SAD) అనే ఒక తరహా డిప్రెషన్‌కు లోనవుతారు. ఇలా చలికాలంలో మనసు చిరాకుగా ఉన్నప్పుడు వెలుతురుని చూడటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆధునిక శాస్త్రం చెబుతోంది. దీనినే వారు Dawn simulation, Light therapy వంటి పేర్లతో పిలుచుకుంటున్నారు. మన కార్తీక దీపాలు చేసే పని ఇదే కదా!

 

- ఆవునేయ్యి, నువ్వుల నూనె, ఆముదం... ఈ మూడింటికీ కూడా ప్రాచీన వైద్యంలో తగిన స్థానం ఉంది. వీటితో వెలిగించిన దీపాన్ని చూడటం వలన దృష్టి మెరుగుపడుతుందని చెబుతారు.

 

 

- నవంబరు మాసంలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల జలుబు, దగ్గు వంటి కఫ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఇక ఆస్తమా, సైనస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఇది కష్టకాలంగా మారిపోతుంది. ఆవునెయ్యి, నువ్వులనూనె నుంచి వెలువడే ధూపానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నివారించే శక్తి ఉందని చెబుతోంది ఆయుర్వేదం.

 

- నువ్వులనూనె, ఆముదం, ఆవునెయ్యి... ఈ మూడు ద్రవాలూ కూడా సాంద్రతని ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని వెలిగించిన దీపాలు ఎక్కువసేపు వెలుగులు చిమ్ముతాయి. పైగా అధికమైన వేడినీ ఇస్తాయి. అలా ఇవి మన ప్రాంగణాలలో చలిని కొంతవరకన్నా తగ్గిస్తాయి.

 

- చలికాలంలో క్రిమికీటకాలు ప్రబలుతాయి. వీటికి తోడు ఏపుగా పెరుగుతున్న పొలాలని ఆశించి బతికే సన్నదోమల వంటి కీటకాలు కూడా జనావాసాలలోకి ప్రవేశిస్తుంటాయి. వీటిని మన ఇళ్లకి దూరంగా ఉంచే సత్తువ నూనెదీపాలకు ఉంది.

 

ఎక్కడెక్కడ వెలిగిస్తారు

కార్తీకమాసమంతటా సాయంత్రం వేళల్లో శివాలయాలలో కానీ, విష్ణుమూర్తి ఆలయాలలోగానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఆలయ ద్వారం వద్ద కానీ, గోపురం వద్దకానీ, దేవుని సన్నిధి వద్దకానీ ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని పక్షాన ఇంట్లోనే పూజామందిరంలో కానీ, తులసి కోట వద్దకానీ దీపారాధన చేసుకోవచ్చు. ఇక ఉసిరి, రావి వంటి దేవతా వృక్షాల కింద, నదీతీరాలలో దీపారాధన చేసినా కూడా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.

 

ఒక్కరోజునన్నా

కార్తీకమాసమంతా ఉదయం, సాయంత్రం సంధ్యవేళల్లో దీపారాధన చేయమని సూచిస్తుంటారు. ఒకవేళ మాసమంతా కుదురకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి వంటి సందర్భాలలో అయినా దీపాలను వెలిగించమంటారు. ఇదీ కుదరకపోతే కనీసం పౌర్ణమి రోజునైనా దీపం వెలిగించి తీరమని చెబుతారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంలో 365 దీపాలను వెలిగించినవారికి ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందన్నది విజ్ఞుల మాట. దీపం వెలిగించే అవకాశం ఏమాత్రం లేనివారి కోసమే ఇలాంటి సౌలభ్యాలు ఏర్పరిచి ఉంటారు కానీ వీలైనంతవరకూ మాసం పొడవునా దీపాన్ని వెలిగించడమే మంచిది.

 

- నిర్జర.