Read more!

జ్యోతిషానికి తొలి గురువు - పరాశరుడు

 

 

 

జ్యోతిషానికి తొలి గురువు - పరాశరుడు

 


హిందువుల విజ్ఞానంలో జ్యోతిషానికి గొప్ప స్థానం ఉంది. మానవుల జీవితంలో శుభాశుభాలను అంచనా వేసేందుకే కాకుండా ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఈ జ్యోతిషాన్ని ప్రమాణికంగా నమ్ముతారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ జ్యోతిషశాస్త్రానికి ఒక భూమికను ఏర్పరిచినవాడు పరాశరుడు. ‘పరాశరహోర’ పేరుతో ఆయన రచించిన గ్రంథాన్ని ఇప్పటికీ భక్తితో అనుసరించేవారు ఉన్నారు.

 

తండ్రి కోసం పగపట్టి

 

సప్తర్షులలో ఒకరైన వశిష్టునికి, శక్తి అనే కుమారుడు ఉన్నాడు. ఆ శక్తిమహర్షికి జన్మించినవాడే పరాశరుడు. ఓసారి శక్తి మహర్షిని ఓ రాక్షసుడు సంహరించేశాడు. దాంతో తన తండ్రి చావుకి కారణమైన రాక్షసజాతి ఉండటానికి వీల్లేదని పరాశరుడు పగపట్టాడు. ఆ పగతో ఆయన వందలాది రాక్షసులను సంహరించాడు. చివరికి పరాశరుని శాంతింపచేసేందుకు సాక్షాత్తూ అతని తాత వశిష్టుడు దిగిరావల్సి వచ్చింది. ‘వ్యక్తిగత ద్వేషంతో సృష్టిధర్మాన్ని తిరగరాయద్దని’ వశిష్టుడు నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు.

 

జాలరి అమ్మాయితో ప్రేమ

 

పరాశరుడు సకలశాస్త్రాలనూ అభ్యసిస్తూ నిత్యం ప్రయాణించేవాడు. అలాంటి ప్రయాణంలో ఓమారు యమునా నదీ తీరాన ఉన్న ఓ జాలరి గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో అడుగుపెట్టిన పరాశరుని ఆ ఊరిపెద్ద దాసరాజు నిండుమనసుతో ఆహ్వానించాడు. అతడికి అతిథిసత్కారాలు గావించి నదిని దాటించి రమ్మంటూ తన కూతురు సత్యవతిని ఇచ్చి పంపాడు. జ్ఞానవర్చస్సుతో వెలిగిపోతున్న పరాశరుని చూసి సత్యవతి, సత్యవతి నిష్కల్మషమైన సౌందర్యాన్ని చూసి పరాశరుడు మోహంలో పడిపోయారు. అలా వారికి జన్మించిన కుమారుడే వ్యాసుడు. తర్వాతకాలంలో వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు అనే కుమారులు జన్మించిన విషయం తెలిసిందే! అలా పరాశరుడు కూడా కౌరవపాండవులకు పూర్వికునిగా నిలిచాడు.

 

 

సాటిలేని జ్ఞాని

 

పరాశరుడు వేదాల మీద సాధికారతని కలిగి ఉండటమే కాదు, తానే స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు చెబుతారు. రుగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుని పేరు మీదగానే ఉన్నాయి. ఇవే కాకుండా పరాశర స్మృతి, పరాశర హోర వంటి శాస్త్రాలను కూడా ఆయన రచించారు. విష్ణుపురాణంలోనూ ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. ఇక పరాశరుడు ‘కృషి పరాశర’ పేరుతో వ్వవసాయం గురించీ, ‘వృక్షాయుర్వేద’ పేరుతో వృక్షాల గురించీ అపూర్వమైన గ్రంథాలు రచించినట్లు తెలుస్తోంది.

 


ఇంతటి అపారమైన జ్ఞానం ఒకే వ్యక్తిలో ఊహించడం సాధ్యం కాదు కాబట్టి, పరాశర అన్న పేరుతో అనేకమంది రుషులు ఉండిఉండవచ్చని కొందరి అనుమానం. పరాశరుడు ఒకరా అనేకమందా అన్న విషయం పక్కన పెడితే, భారతీయ విజ్ఞానానికి ‘పరాశరుడు’ అన్న పేరు ఓ మూలస్తంభం అనడంలో సందేహం లేదు.

- నిర్జర.