Home » Purana Patralu - Mythological Stories » గంగాదేవి పుట్టుక గురించి తెలుసుకోండి..


గంగాదేవి పుట్టుక గురించి తెలుసుకోండి..

 

 

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో వామనావతారంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ స్వామి బలిని మూడు అడుగుల నేల యాచించి తీసుకుని ఆకాశం మొత్తం ఒక అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మ దేవుడు తన కమండలంలోని జలముతో కడుగగా పరమ పావనమైన ఆ పాదముల నుంచి ఉద్భవించింది గంగా నది.  ఆ ఘట్టాన్ని మానసిక దర్శనం చేసిన అన్నమయ్యగారు పొంగి పోయి బ్రహ్మ కడిగిన పాదము అంటూ, అల గంగాజనకునకు అర్ఘ్య పాద్య ఆచమనాలు అంటూ కీర్తించారు.

  
స్వర్గలోకంలో ప్రవహించే ఆ పావన నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు. ఆ నదే ఆ తరువాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధం అయిన సగర కుమారులకు ముక్తి ప్రసాదించడం కొరకు భగీరథుని  తపః ఫలితముగా ఇలకు దిగి వచ్చింది. భాగీరథీ అయింది. ఆ క్రమములో భూమికి ,ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటం పై పడి అక్కడి నుంచి ముందుగా హిమాలయాలలోని గంగోత్రి లో ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది. 

అందుకే  ఈ తరపు వాగ్గేయకారులు సైతం
శివుని శిరసు పైని చిందులాడెడి గంగ
శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ
గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ
కవుల ఘంటముల ఉరికిన గంగ అంటూ స్తుతించారు.

 

త్రోవలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తడిపి,కుదిపి, తుడిచి పెట్టేస్తే ఆయన మొత్తం గంగను ఔపోసన పట్టేసాడు. భగీరథుని కోర్కెపై  మరలా జహ్ను మహర్షి కుమార్తెగా ఆవిర్భవించి, అలకనందగా పావన జీవన వాహినిగా ప్రవహించి, పాతాళానికి చేరుకొని సగర కుమారుల భస్మ రాసుల మీదుగా ప్రవహించి వారికి ముక్తిని ప్రసాదించింది ఈ పావన నదీమ తల్లి.

 

మన భారత దేశములో ముక్తి ధామం అయిన కాశీ క్షేత్రములో సహజమరణం పొందేవారికి ఈ నదీమ తల్లి ఆశీర్వాదం ఉంటుంది అని పెద్దలు చెపుతారు. ఈ దేశములో దాదాపు ప్రతి ఒక్క హిందువు  ఇంట్లో కాశీ గంగ చెంబు అని ఒకటి తప్పకుండా ఉంటుంది.  ఈ పావన నదీమ తల్లి జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, దశమి రోజున ఆవిర్భవించింది కనుక ఈ నేల 12  బుధవారం న గంగలో స్నానం కానీ, గంగ పూజ కానీ చాలా శ్రేయోదాయకం అని పెద్దలు చెపుతారు.

 

"గంగ" వరకు వెళ్లలేని వారు "గంగ"ను స్మరిస్తూ ఏ నదిలో స్నానం చేసినా ఆ ఫలితం లభిస్తుంది. అదీ చేయలేక పోతే కనీసం ఇంట్లో అయినా సరే "గంగ"ను స్మరిస్తూ స్నానం చేయాలి. మరి ఎలా స్మరణ చేయాలో కూడా చెప్పాలి కదా.

 

"నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జా సంభూతా గంగా 
త్రిపథగామినీ భాగీరథీ
భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ "

 

అంటూ స్మరణ చేస్తూ స్నానం చేసిన వారికి ఆ గంగా మాత అనుగ్రహం లభిస్తుంది. స్వర్గం,భూలోకం,పాతాళము ఇలా మూడు లోకాలలో ప్రవహిస్తున్న ఈ నదీమ తల్లిని త్రిపథగ అని పిలవడం ఎంతైనా సమంజసం కదా. జీవన యాత్ర చాలించబోయే వారికి చివరగా గంగ తీర్థం, తులసి ఆకులు వేసి ఇవ్వడం అనేది ఒక సత్సంప్రదాయంగా మన దేశములో ఉంది. ఈ పావన నదీమ తల్లి జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, దశమి రోజున ఆవిర్భవించింది కనుక ఈ నేల 12  బుధవారం న గంగలో స్నానం కానీ, గంగ పూజ కానీ చాలా శ్రేయోదాయకం అని పెద్దలు చెపుతారు. స్వర్గం,భూలోకం,పాతాళము ఇలా మూడు లోకాలలో ప్రవహిస్తున్న ఈ నదీమ తల్లిని త్రిపథగ అని పిలవడం ఎంతైనా సమంజసం కదా. 

 

అందుకే ఆ పావన నదీమ తల్లిని కాలడి శంకరులు 
దేవి సురేశ్వరి భగవతి గంగే
త్రిభువన తారిణిని తరళ తరంగే
శంకర మౌళి విహారిణి విమలే
మమ మతిరాస్తాం తవ పద కమలే

 

భాగీరథీ సుఖ దాయిని మాతా
తవ జల మహిమా నిగమే ఖ్యాతః
నాహం జానే తవ మహిమానం
పాహి కృపామయి మామజ్ఞానం 
అంటూ తన గంగా స్తవంలో కీర్తించారు.

 

మానవ తప్పిదాల వలన కలుషితం అవుతున్న ఈ పావన నదీమ తల్లిని కాపాడుకునే ప్రయత్నములో మన వంతు సాయం చేస్తూ, ఈ రోజున ఆ నదీమ తల్లిని ధ్యానిస్తూ స్నానం చేసి పునీతులము అవుదాము. మన భవిష్యత్తరములకు శుద్ధమైన గంగా జలముతో పాటు, ఘన ఆధ్యాత్మిక గంగా వాహినిని అందిద్దాము. స్వస్తి...   https://www.youtube.com/watch?v=eJqkqVFIrkI

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.