Read more!

ఏకాదశి – ఓ దేవత!

 



ఏకాదశి – ఓ దేవత!

 

కార్తీకమాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులూ చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం! అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి/ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మవృత్తాంతం… అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలుదువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికీ మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. ఈలోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు.

 

 

విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతణ్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా! ఎప్పుడైతే చెడుతలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో, వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది. ఆమే ఏకాదశి! కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుని బస్మం చేసింది ఏకాదశి దేవి. తన రక్షణ కోసం ప్రత్యక్షం అయిన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. `నీకేం వరం కావాలో కోరుకో`మంటూ అభయాన్ని ఒసగాడు. దానికి ఏకాదశి `తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలనీ` కోరుకుంది. ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలుపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. మురాసురుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా `మురారి` అన్న పేరు సార్థకమయ్యింది.

 

 

ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి పక్వాహారమూ తీసుకోకుండా ఉంటారు. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉన్నారు. వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మంచిదనీ, అదీ కుదరకుంటే 15 రోజులకి ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు. తనని తాను స్వస్థత పరచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. ఇక అమావాస్య, పౌర్ణమి తిథులు దగ్గరపడుతున్న కొద్దీ జ్యోతిష రీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు, శరీరాల మీద అధికంగా ఉంటుంది. ఏదాదశిరోజున ఉపవాసం ఉండి ద్వాదశినాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య/పౌర్ణమినాటికి శరీరం దృఢంగా, మనసు తేలికగా ఉంటాయి.

- నిర్జర.