ఆయనో జెన్ గురువు.
ఆయనంటే ఆ దేశపు రాజుకి విపరీతమైన కోపం.
ఆయనను తీసుకొచ్చి ఉరి వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు రాజు.
ఆయనను ఉరి తీసే ముందర రాజు గురువుతో  మాట్లాడుతూ ...
"నీకు ఇంకా 24 గంటల సమయముంది. ఆ 24 గంటలను నువ్వు ఎలా బతకాలని అను కుంటున్నావు?" అని అడుగుతాడు. రాజు మాటలకు జెన్ గురువు ఓ నవ్వు నవ్వుతాడు.  "నేను ఎప్పుడూ  ప్రతి క్షణం అదే ఆఖరి క్షణం అన్నట్టుగా బతుకుతుంటాను. నావరకు నేను  ఈ క్షణం తర్వాత మరేదీ లేదు అనుకుంటాను. కనుక నాకు ఇంకా 24 గంటలు ఉంటే ఎంత లేకపోతే ఎంత? పోనీ 24 సంవత్సరాలు ఉంటే మాత్రం నాకేమిటి? నాకు అందులో ఎలాంటి భేదం లేదు. కనుక నాకు ఏ క్షణానికి  ఆ క్షణమే ప్రధానం. మిగిలింది అప్రస్తుతం. నాకు నేనున్నఆ క్షణమే చాలు" అని అంటాడు జెన్ గురువు. రాజుకు ఆయన మాటలు బోధపడ లేదు. గురువు వంక అయోమయంగా చూసాడు. రాజుకు తాను చెప్పింది అర్ధం కాలేదని గ్రహించిన గురువు "నేను మిమ్మల్ని ఒకటి అడగదలచుకున్నాను. అందుకు అనుమతి ఇవ్వండి. మీరు రెండు క్షణాలను ఒకే సమయంలో జీవిం చగలరా? అని. ఆ ప్రశ్నకు రాజు లేదు అని జవాబిచ్చాడు. అప్పుడు గురువు  "నిజం చెప్పాలంటే ఎవరూ అలా బతకలేరు. జీవించడానికి ఒకటే దారి. ఏ క్షణానికి ఆ క్షణం జీవించడమే. ఆ క్షణాన్ని పరిపూర్ణంగా జీవిస్తే, తర్వాతి క్షణాన్ని అలాగే, ఆ తర్వాతి క్షణాన్ని కూడా అలాగే వర్తమానంలో సంపూర్ణంగా ఉండటం సాధ్యం. అప్పుడు జీవితం ఉన్నతమై దానిపై  ఆనందమయమైన పూల వర్షం కురుస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఆ జీవితమే జీవితం..." అని గురువు చెప్పేసరికి రాజు ఆయనకు  విధించిన ఉరిశిక్షను రద్దు చేసి ఆలోచనలో పడ్డాడు.

- యామిజాల జగదీశ్


More Good Word Of The Day