యోగినీ ఏకాదశి కథ

 


దైవనామస్మరణతో మనసు మీదా, ఉపవాసంతో శరీరం మీదా అదుపుని సాధించి... భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు పెద్దలు. అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే... యోగినీ ఏకాదశి. ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ఆచరణ గురించి ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే...

 

అలకాపురిని ఏలుతున్న కుబేరుడు సిరిసంపదలకు అధిపతి అయ్యుంటే కావచ్చు కాక! కానీ ఆయన పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే అతనికి రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు, హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది.

 

స్వరూపవతి అపర సౌందర్యవతి. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకుపడిపోయాడు. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. కుబేరుని ఆదేశాన్ని అందుకున్న సేవకుడు విషయాన్ని కనుక్కొని తిరిగివచ్చాడు. సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తన ముందు ప్రవేశపెట్టమంటూ ఆజ్ఞాపించాడు.

 

కుబేరుని ఆజ్ఞను అందుకున్న హేమమాలి వణికిపోతూ ఆయన దర్బారుకి చేరుకున్నాడు. హేమమాలిని చూస్తూనే కుబేరుడు మండిపడుతూ ‘నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమం’టూ శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్టువ్యాధిగ్రస్తుడై, భూలోకం మీద సంచరించసాగాడు.

 

హేమమాలి అదృష్టమో, లేక ఇన్నాళ్లుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలమోగానీ... అతనికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. ఆ రుషిని చూడగానే హేమమాలి మనసులో ఏదో చిన్న ఆశ. ఆయన తనకు శాపవిమోచనం కలిగించగలడేమో అన్న కోరిక! అంతట మార్కండేయ రుషికి కాస్త దూరానే నిలబడి ఆయనకు ప్రణామాలర్పించాడు హేమమాలి. హేమమాలిని చూసిన మార్కండేయ రుషికి చెప్పలేనంత జాలి కలిగింది. అతని దీనస్థితికి కారణం తెలిసిన తరువాత ఎలాగైనా సాయపడాలనిపించింది. ‘యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావు’ అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయులవారు.

 

మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి, మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి... హేమమాలి తన శాపవిమోచనాన్ని సాధించాడు. తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు.

 

అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు... ఎవరైతే యోగినీ అమావాస్యనాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు! జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక. ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియచేసే ప్రతీక!

 

- నిర్జర.


More Others