విఘ్నేశ్వరుడు వక్రతుండుడు ఎలా అయ్యాడు?

Vighneswara Vakratunda

 

ఏక శబ్దాత్మకా మయా తస్యా: సర్వసముద్భవమ్!

దంతః సత్తాధర స్తత్ర మాయా వచన ఉచ్యతే!!

‘ఏక’ శబ్దంమాయా బోధకం. దంతశబ్దము ‘మాయిక’ బోధకమనేది మౌద్గల వచనం. మాయ, తన్మాయిక సంయోగంతో గణపతి ఏకదంతుడిగా వ్యవహరింపబడుతున్నాడు. గజాననుని ‘వక్రతుండుడు' అని కూడా (వంకరగా ఉండే తొండము గలవాడు) పిలుచుకుంటాం. వక్రం ఆత్మరూపం ముఖం యస్వసః వక్రతుండ: అంటే ఆత్మరూప ముఖం గలవాడు వక్రతుండుడని వ్యవహరింపబడుతున్నాడు. ప్రపంచమంతా మనస్సుకు, వాక్కునకు గోచరమైనది. కాని ఆత్మతత్త్వమైతే మనోవాక్కులకు గోచరము కానిది.

కంఠమునకు కింది భాగం మాయతో కూడినది. విఘ్నేశుని వక్రమని చెప్పబడే మస్తకం బ్రహ్మవాచకం. అందుచేతనే ఇతడు వక్రతుండుడని చెప్పబడుతున్నాడు. వాగ్గేయకారులలో ప్రసిద్ధులైన దీక్షితులు గణపతిని ‘ప్రణవ స్వరూపవక్రతుండం’ అని కీర్తించారు. గణపతికి ఉండే వక్రతుండం ప్రణవ స్వరూపమని చెప్పబడింది.

ఓంకారం సర్వమంగళకరం. వేదోక్తములగు సర్వకర్మలయందు, ఉపాసనాదులందు ముందుగా ఓంకారాన్నేఉచ్చరిస్తారు. కాళిదాసు ‘ప్రణవశ్చందసామి’ వేదముల కాద్యము ప్రణవం. ఓంకారమును ముందుగా ఉచ్చరించి, మూడుగా గణపతిని ఆరాధించుట చేతను గణపతి ఓంకార స్వరూపుడని చెప్పవచ్చు.

‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కారముల కలయిక ఓంకారము. ఇందు ఆకారము బ్రహ్మ స్వరూపము, మకారము శక్తి స్వరూపము. ఈ బ్రహ్మ శక్తి స్వరూపముల కలయిక వలన ఏర్పడే ఆనంద గ్రంధి ఉకారము. ఆ ఉకార స్వరూపమే గణపతి. ‘ఒమిత్యే కాక్షరం బ్రహ్మ’ ‘ఓం’ అనే ఒక్క అక్షరమే బ్రహ్మ స్వరూపమనే ఈ మంత్రార్ధము నందు గణపతికి సమన్వయపరచి గణపతిని ప్రణవస్వరూపునిగా శంకరులు దర్శింపజేశారు. గణపతి విఘ్నేశ్వరుడు. విఘ్ననాయకుడని పూజిస్తాము. దీనిని నిరూపించే ఒక కథ ఉంది. తనకు విధించిన సత్కర్మాచరణ వలన విశుద్ధాన్తః కరణుడైన మానవునకు భగవత్తత్వ సాక్షాత్కారము కలుగుతుందనే ధర్మమును నిరూపించేదీ కథ. స్కంద, మౌద్గల పురాణములందు ఈ వినాయక మహిమను తెలుపు కథ ఇలా చెప్పబడింది.

పూర్వం అభినందనుడనే ఒకరాజు ఇంద్రునకు హవిర్భాగము లేకుండా ఒక యజ్ఞమును చేయనారంభించాడు. ఇది తెలిసి ఇంద్రుడు కోపించి కాలపురుషుని పిలిపించి యజ్ఞభంగము చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు కాలపురుషుడు విఘ్నాసుర రూపములో ఆవిర్భవించాడు. కాలపురుషుడు అభినందనుని చంపి, దృశాదృశ్యరూపంగా అక్కడక్కడ సత్కర్మలను నాశనం చేస్తుండేవాడు. అపుడు వశిష్టాది మహర్షులు బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మ ఆదేశానుసారం వారందరు గణపతిని స్తుతించారు. కాలనాశము చేయగల సామర్ధ్యం గలవాడు, విఘ్నవినాశకత్వ గుణ సంపన్నుడు అయిన గణపతి వారి ప్రార్ధనను ఆలకించి కాలపురుషుని పరాజయము గావింపగా, అతడు గణపతి అధీనుడై ఆయనను శరణు కోరి, ఆయన ఆజ్ఞకు బద్ధుడై నడచుకుంటుండేవాడు. అప్పటినుండి విఘ్నము గణపతి అధీనమై ఉంది కనుక మనం చేసే ప్రతి పనికీ మొదట విఘ్నములు కలగకుండా ముందుగా గణపతిని ఆరాధిస్తాం.

 

vakratunda ganesha, maha ganapati prardhana, vighneswara prardhana, first puja ganapati, ganapati meaning


More Vinayakudu