వెన్నెల పారాయణం ఎలా చేస్తారు? ఫలితాలు ఏమిటి! 

 

వైశాఖం అంటేనే ప్రకాశం అని అర్థం. ఇక ఈ నెలలో భౌతికంగానూ, మానసికంగానూ మరిన్ని వెలుగులను పంచే సందర్భం వైశాఖ పౌర్ణమి. ఆ మాటకు వస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, ప్రతి పౌర్ణమినీ విశిష్టంగా భావిస్తూ ఉంటారు. జాతకరీత్యా చంద్రుడు మనః కారకుడు. పౌర్ణమి నాడు అలలు ఎలా ఉవ్వెత్తున ఎగసిపడతాయో, మనసు కూడా అంతే ఉత్తేజితంగా ఉంటుంది. ఆ ఆలోచనల మీద అదుపు లేకపోతే విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది. అదే ఆలోచనలను నియంత్రించుకోగలిగితే శక్తివంతమైన ధారణ ఏర్పడుతుంది. 

ఇందుకోసం పౌర్ణమినాడు తప్పకుండా ధ్యానం చేయాలని చెబుతూ ఉంటారు. పౌర్ణమి ప్రభావాన్ని మరింత దైవికంగా మార్చుకునేందుకు ‘లలిత సహస్రనామం’ పారాయణం చేయాలంటారు పెద్దలు. దీనిని వెన్నెల పారాయణం అని కూడా అంటారు. ఇంతకీ ఈ పారాయణం ఎలా చేయాలో, దాని వల్ల కలిగే ఫలితాలేమిటో చూద్దాం. 

వెన్నెల పారాయణానికి రాత్రివేళ పౌర్ణమి తిథి ఉన్న వేళను ఎంచుకోవాలి. ఆ రోజు కాచిన పాలల్లో యాలుకల పొడి, చక్కెర వేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పాలల్లో చంద్రుడిని చూస్తూ తొమ్మిదిసార్లు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఒకోసారి మనకు చంద్రుడు కనిపించకపోవచ్చు. వర్షం, మబ్బులు కారణంగా చంద్రుడిని చూడలేకపోవచ్చు. అపార్టుమెంటులాంటి చోట్ల ఉండేవారికి వెన్నెలలో కూర్చునే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో… పళ్లెంలోకి ఒక తమలపాకు తీసుకుని, అందులో గంధాన్ని అద్దిన రూపాయి బిళ్లను ఉంచాలి. ఇక్కడ గంధం అద్దిన రూపాయినే మనం చంద్రుడిగా భావిస్తున్నామన్నమాట! 

పౌర్ణమి రోజున ప్రత్యేకించి లలిత సహస్రనామాన్ని చదవడం వెనుక ప్రత్యేకమైన కారణమే కనిపిస్తుంది. లలితాదేవిని ఈ సృష్టికే మాతృస్వరూపంగా భావిస్తూ ఉంటారు. సృష్టి, స్థితి, లయలను నియంత్రించే త్రిపురసుందరిగా నమ్ముతారు. ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను చదువుతూ ఉంటారట. ఈ నామాలు వినడానికి భౌతికమైన వర్ణనల్లాగే తోచినా… విశ్లేషిస్తే, ఆధ్యాత్మికమైన నిగూఢ రహస్యాలెన్నో బోధపడతాయి. ముఖ్యంగా కుండలినికి సంబంధించి బోధలెన్నో ఇందులో ఉన్నాయని చెబుతారు. అందుకనే దీనిని ‘రహస్యనామ స్తోత్రం’ అని కూడా అంటారు. ఇంత విశిష్టమైన లలితను, మనసు ఉత్తేజంగా ఉండే పౌర్ణమినాడు చదివితే, విశేషమైన ఫలితం వస్తుందని నమ్మకం. భౌతికంగా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి, ఎలాంటి సంకల్పం అయినా సిద్ధిస్తుంది. 

ఇక లలిత సహస్రనామం తొమ్మిదిసార్లు పారాయణం చేయాలి అనే నియమం వెనుక కూడా ముఖ్యమైన కారణం కనిపిస్తుంది. తొమ్మిది పరిపూర్ణమైన సంఖ్య. ఏ పని అయినా తొమ్మిదిసార్లు చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. అలాగే లలిత సహస్రనామం కూడా తొమ్మిదిసార్లు చేస్తే… భక్తుడి చుట్టూ ఓ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందని నమ్ముతారు. తొమ్మిదిసార్లు కుదరని పక్షంలో ఒక్కసారైనా పారాయణ చేయాలి. ఇక పారాయణ పూర్తయిన తర్వాత… గిన్నెలోని పాలని ఇంటిల్లపాదీ తాగాలనీ, రూపాయికాసు మీద రాసిన గంధాన్ని ఉదరానికి రాసుకుంటే చలవ చేస్తుందని సూచిస్తారు. 

- మణి

 


More Purana Patralu - Mythological Stories