కాశీ కబుర్లు – 20 ప్రయాగ...  వేణీ దానం

 

 

 

పడవలో కొంత దూరం వెళ్ళాక అక్కడ కొన్ని బోట్లు అడ్డంగా కట్టి వున్నాయి.  అదే సంగమం.  గంగ, యమునలను చూడచ్చు.  సరస్వతి అంతర్వాహిని.   అక్కడ బోటు మీద కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయిస్తారు.  తర్వాత అక్కడే స్నానం.  కార్యక్రమం దగ్గర  పండా మాత్రం పళ్ళెం సర్దాలి (పూజా ద్రవ్యాలకి, మాట్లాడింది దానితో సహా అయినా,) అని ఒకసారి, దేనికో కావాలి అడ్వాన్సు ఇవ్వమని ఒకసారి రూ. 200 తీసుకున్నాడు.  అక్కడ వాళ్ళు చేసిన హడావిడికి అవ్వి మర్చిపోయాం.  ఇవ్వన్నీ ఎందుకింత వివరంగా చెబుతున్నాను అంటే మీరెళ్ళినప్పుడు మీకు కొంత తలనొప్పి తగ్గుతుందని.

 

వేణీ దానం

మా గ్రూప్ లో వారికి పిండ ప్రదాన కార్యక్రమాలు లేవు.  అయితే ప్రయాగలో మాత్రమే చేసే వేణీదానం చేద్దామనుకున్నాము.  ఇక్కడ వేణీదానం చాలా ముఖ్యమైనది.  ఈ వేణీ దానం ప్రక్రియ  ప్రయాగలో మాత్రమే వున్నదంటారుగానీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి కూడా ఆడవాళ్ళు సాధారణంగా మూడు కత్తెర్లనీ, ఐదు కత్తెర్లనీ, బెత్తెడనీ జుట్టు ఇస్తూ వుంటారు.  అయితే అక్కడ ఏ తతంగాలు లేకుండా, కామ్ గా కానిచ్చేస్తారు.  ఇక్కడ దానికో సంకల్పం, పూజ వగైరాలన్నీ.

 


అసలు ఈ వేణీ దానం భార్యా భర్తలు ఇద్దరూ వున్నప్పుడు చెయ్యాల్సింది.  అన్యోన్యంగా వుండే భార్యా భర్తలు ముందు జన్మలో కూడా వారే భార్యా భర్తలు కావాలనే ఉద్దేశ్యంతో చేసే కార్యక్రమం అది.  ఇవ్వన్నీ మనకి ముందు తెలియవు.  అక్కడ వేణీ దానం చేస్తే మంచిది, అక్కడొక్క చోటే వుంది అలాంటి ప్రక్రియ, అన్నారు.    ఇంకేముందండీ, మనలాంటి వాళ్ళంతా అంత దూరం వెళ్ళాం కదా చేసేస్తే పోలా అనుకుంటాం.  చేసేస్తాం.  ఫలితాల సంగతి దేవుడెరుగు.

మా వారు ఈ యాత్రకి నాతో రాలేదు.  మరి నేను వేణీ దానం చెయ్యచ్చా అంటే చెయ్యచ్చన్నారు అక్కడి పండా.  సరే నేనూ వేణీ దానం చేశానని మళ్ళీ చెప్పక్కరలేదు కదూ.   నిజం చెప్పద్దూ, నాకు మాత్రం పండా చెప్పిన మంత్రాలు అస్సలు అర్ధం కాలేదు.  ఆయన మంత్రాలు చెప్పి మళ్ళీ నన్నవ్వి చెప్పమంటే, ప్రయత్నించీ మానేశాను .. తప్పులు చెప్పేకన్నా చెప్పకుండా వుండటం వుత్తమమని.  వాళ్ళు మాత్రం అనేక విధాల డబ్బు గుంజటానికి ప్రయత్నిస్తారు.  తతంగం జరిగేటప్పుడు ఒకతన్ని పిలిచి నన్నతనికి 10 రూ. ఇమ్మన్నాడు.  అది అతను నా కొంగుకి ముడి వేస్తాడని, వేసినందుకు ఆ బ్రాహ్మణుడికి ఏమైనా ఇమ్మని అన్నాడు.  నాకెందుకో చాలా కోపం వచ్చింది.  బ్రాహ్మణుడు వెయ్యాలంటే సంకల్పం చెప్తున్నాయన వెయ్యాలి, మధ్యలో ఎవరినో పిలిచి అతను వేసేదేంటి, ఠాట్ వల్లకాదు పొమ్మన్నా.  కావాలంటే నా కొంగుకి నేనే వేసుకుంటానని నేనే వేసుకున్నా.  పైగా నాకే పాపం చుట్టుకున్నాసరే, నాకనిపించింది చెబుతున్నాను.  అసలు వాళ్ళు బ్రాహ్మణులేనా అనే అనుమానం కూడా.  వాళ్ళ అవతారాలు అలా వున్నాయి.  అదే అనేశాను కూడా.  నా ఈ కాశీ ప్రయాణంవల్ల ఒక్కటి మాత్రం రూఢి అయిపోయింది.  నరకం, శిక్షలు వుంటే, నా కాశీ యాత్ర నాకు పెద్ద శిక్షలు తయారుగా పెట్టి వుంటుంది.

 

 

ఆ పండా చెప్పినది నాకర్ధం కాకపోయినా ఏ దేవుడు కరుణించాడో, ఆ తతంగం కొంచెం సంతోషాన్నే మిగిల్చింది.  ముందు సంగమంలో స్నానం చేశాక (నడుం లోతు నీళ్ళే వుంటాయి.  నీళ్ళంత బాగాలేవు) ఎఱ్ఱ గులాబీలు దోసిటనిండా పోసి సంకల్పం చెప్పించాడు. ఆ పూలని చూసి మనసు కుదుటపడింది.   రెండు పసుపు ముద్దలిచ్చి ఒకటి గౌరీ దేవి, ఒకటి మా వారిని తల్చుకుని శివుడు ఆకారం చెయ్యమన్నాడు (ఆయన రాలేదుకదా).  అది ఆకులో పెట్టి, మా వారి తుండు గుడ్డ (మా పిన్ని ముందునుంచీ పోరుతోంది తీసుకురా అని) నా చీరె కొంగుకి ముడి వేసి, రెండో చివర ఆ పసుపు ముద్దకి చుట్టి పెట్టాడు.  అంటే ఆయన కూడా అక్కడే వున్నట్లు.  తర్వాత బొట్టు, పసుపు రాసుకుని, పారాణి పెట్టుకోమన్నాడు.  జడ చివరిదాకా వేసుకుని పువ్వు పెట్టుకోమన్నాడు.  తర్వాత జడ చివర కొంచెం కత్తిరించాను (ఇది భర్త చేస్తాడు.  ఆయన రాలేదని వేరే ఎవరినో కట్ చెయ్యమన్నాడు నేను వద్దని నేనే చేశాను).  తర్వాత ఆ వెంట్రుకలు పసుపు ముద్దలో కలిపి అదీ, 3 కొబ్బరి కాయలు, పువ్వులు, నేను తీసుకెళ్ళిన జాకెట్ బట్ట అన్నీ గంగమ్మకి సమర్పించి, మళ్ళీ స్నానం చేయమన్నాడు.  (మనం కొబ్బరి కాయలు సమర్పించగానే అక్కడే కాచుకుని వుంటారు వాటిని తీసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి.) అక్కడికి కార్యక్రమం పూర్తయినట్లే.  భార్యా భర్తలు ఇద్దరూ వస్తే ఈ తతంగం అంతా భర్త ఒడిలో భార్యని కూర్చో పెట్టి చేస్తారు.

 

 

 

మొత్తానికి త్రివేణీ సంగమంలో కార్యక్రమం పూర్తయ్యి ప్రయాగ (అలహాబాద్) లో మిగతా ప్రదేశాలు చూడటానికి బయల్దేరాము.  ఆ విశేషాలు వచ్చే వారం.

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Kashi Yatra