వాస్తు నమ్మకాన్ని బట్టి ఉంటుందా?

 

 

కొందరు "వాస్తును నమ్మి ఆచరించడం మొదలుపెడితే, ఇక అనేక సూత్రాలు పాటించాలి. అదంతా ఒట్టి చాదస్తం. నమ్మనివాళ్ళకి ఏ గొడవా ఉండదు" అనుకుంటారు. తెలిసి పట్టుకున్నా, తెలీక పట్టుకున్నా నిప్పు కాలుతుంది కదా! అలాగే, వాస్తు నమ్మినా, నమ్మకున్నా దాని పని అది చేస్తుంది. కనుక వాస్తుకు నమ్మకంతో సంబంధం లేదు. వాస్తు శాస్త్రీయం కనుక, అది సరిగ్గా ఉంటే, మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు సక్రమంగా లేకుండా, దోషాలతో లోపభూయిష్టంగా ఉంటే, అందుకు తగ్గట్టే దుష్ఫలితాలు చేకూరుతాయి. ఇందుకు రెండు ఉదాహరణలు చూద్దాం.

వాస్తును నమ్మనివాళ్ళు తాము ఉంటున్న ఇంట్లో సుఖంగా, సంతోషంగా ఉన్నారనుకోండి.. వాళ్ళకు నమ్మకం లేకపోవడం వల్ల హాయిగా ఉన్నారు అనుకుంటే అది పొరపాటు. అది నమ్మకం లేకపోవడం వల్ల వచ్చిన ప్రశాంతత కాదు. ఆ ఇల్లు వాస్తు సూత్రాలకు అనుగుణంగా చక్కగా ఉండి ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్లే తగిన జాగ్రత్తలు తీసుకుని అనుకూలంగా కట్టించి ఉంటారు. కొనుక్కున్నది లేదా, అద్దెకు దిగిన ఇల్లు ఎదైనా కావచ్చు, వారికి కాలం కలిసొచ్చి, అదృష్టం బాగుంటే వాస్తు బాగున్న ఇంట్లోకి వెళ్ళగలుగుతారు.

ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి. ఆ ఇంటి యజమానికి, లేదా అందులో అద్దెకు ఉంటున్న వారికి దుష్ఫలితాలు ఎదురౌతాయి. అవి కేవలం నమ్మకం వల్ల వచ్చే ఫలితాలు కావు. వాస్తులో ఉన్న లోపాల వల్ల చోటుచేసుకునే మార్పులే. కొన్నిసార్లు వాస్తు సరిగా లేదని తలుపులు ఉన్నచోట తీసేయడం, లేనిచోట పెట్టించడం లాంటి మార్పుచేర్పులు చేస్తుంటారు. అయినా చెడు ఫలితాలు ఎదురౌతంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాస్తు బాగా తెలిసిన వారిమీద మాత్రమే ఆధారపడాలి. తెలీనివారిని నమ్మితే అలాగే ఉంటుంది. ఏదో ఒక మార్పు కాదు కదా చేయించాల్సింది. దోషం లేనటువంటి మార్పు కావాలి. అప్పుడే సత్ఫలితం ఉంటుంది.

ఈ పూర్వాపరాలు తెలీనివారు, వాస్తును పట్టించుకోనివారికి ఏ హానీ జరగదని, ఎలాంటి గుండెదుడుకూ ఉండదని, వాస్తును నమ్మి పండితులు చెప్పిన మార్పుచేర్పులు చేస్తున్నప్పుడే లేనిపోని తలనొప్పులు వస్తుంటాయని అపోహ పడుతుంటారు. కనుక నమ్మినా, నమ్మకున్నా, పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఫలితాలు వాస్తును అనుసరించే ఉంటాయి.


More Vastu