ఉమానంద,  అసోం

 


పేరు చూసి ఇదేమిటి ఇలా వుంది అనుకుంటున్నారా?  అసోంలో, గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో  ఒక దీవి వుంది.  అంతకు ముందు దాని పేరు ఏమున్నా బ్రిటిష్ వారి హయాంలో పీకాక్ ఆకారంలా వున్న ఆ దీవిని చూసి వారు పీకాక్ ఐలెండ్ అన్నారు.  అదే పేరు ఇప్పటికీ చలామణీలో వున్నది.  ఈ పీకాక్ ఐలెండ్    ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగా కూడా పేరు పొందింది. ఆ దీవిలో ఒక శివాలయం.  ఆ  ఆలయంలో శివుడు పేరు ఉమానంద.  ఈ ఆలయం చేరటానికి  బ్రహ్మపుత్ర నది మీద లాంచీ లో వెళ్ళాలి.   ప్రయాణ సమయం 20 నిముషాలు పడుతుంది. అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలో మీటరు దూరం నడవాలి.  ఆ దోవలో ఒక నదీ పాయ దాటటానికి సన్నటి బల్లమీదనుంచి వెళ్ళాలి.  

 

లాంచీ దిగాక  దాదాపో 90 మెట్లు ఎక్కాలి. సమయం తక్కువ వుండటంతో మా టాక్సీ డ్రైవరు సలహాతో అతని ద్వారానే మేము ఉమానంద చేరటానికి లాంచీ మాట్లాడుకున్నాము.  మా నలుగురి కోసం ప్రత్యేకంగా వచ్చి, మా దర్శనమయ్యేదాకా వేచి వుండి తిరిగి ఇవతల ఒడ్డు చేర్చటానికి మనిషికి రూ. 200 తీసుకున్నారు. అందరితో కలిసి వెళ్తే చాలా తక్కువ అవుతుంది, కానీ అందరూ వచ్చేదాకా వేచి వుండటానికి సమయం పడుతుంది. ఈ ఆలయం వున్న చిన్ని కొండను భస్మాచల్ లేదా భస్మకూట అంటారు. ఈ ప్రదేశం గురించి అనేక కధలు ప్రచారంలో వున్నాయి. శివుడు ఇక్కడ భయానంద పేరుతో వున్నాడుట. ఒక కధనం ప్రకారం శివుడు ఇక్కడ భస్మం చల్లి తన భార్య పార్వతీ దేవిలో అపూర్వ జ్ఞానాన్ని తిరిగి కలుగ చేస్తాడు.   కాళికా  పురాణం ప్రకారం శివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ వుండగా మన్మధుడు తపోభంగం కావిస్తాడు.  శివుడు క్రోధితుడై మన్మధుణ్ణి భస్మం చేస్తాడు.  అందుకే భస్మాచల్ అనే పేరు వచ్చింది.

 

పూర్వం ఊర్వశి అనే దేవత ఇక్కడ నివసిస్తూ, కామాఖ్య అమ్మవారికి అమృతం సమర్పించేదిట. అందుకని ఈ దీవిని ఊర్వశి ఐలెండ్ అని కూడా అంటారు.  బ్రిటిష్ వారి సమయంలో వారికి ఈ దీవి బ్రహ్మపుత్ర నదిలో   ఒక నెమలిలా కనబడిందిట.  అందుకనే వారు  పీకాక్ ఐలెండ్ అన్నారు. మరి ఇక్కడ వున్న  పురాతనమైన శివాలయం  గురించి కూడా తెలుసుకోవాలికదా.    ఈ ఆలయాన్ని నిర్మించినదెవరో తెలుసా?  సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువూ, భూదేవీ కుమారుడైన నరకాసురుడు అని అక్కడి పూజారిగారు చెప్పారు.  తర్వాత క్రీ.శ. 1694 లో అహోం రాజు గదాధర్ సింఘ ఈ ఆలయాన్ని పునర్ నిర్మించాడు.  మొగలులు కామరూపని పరిపాలించిన సమయంలో మొగలు చక్రవర్తులు జహంగీర్, ఔరంగజేబు ఈ ఆలయానికి అనేక విరాళాలిచ్చారుట. 

 

క్రీ.శ. 1897 లో వచ్చిన భయంకరమైన భూకంపంలో ఈ ఆలయం చాలామటుకు శిధిలమయిపోయింది. తర్వాత  గౌహతిలోని వ్యాపారి ఒకరు బాగు చేయించారు.   అప్పుడు నిర్మాణంలో పాల్గొన్న శిల్పులు, ఆలయానికి వచ్చే భక్తులు రకరకాల దేవతలను పూజించే వారు కనుక    పునర్నిర్మాణ సమయంలో అక్కడ వివిధ  వైష్ణవ, శైవ దేవతల విగ్రహాలు చెక్కబడ్డవి.  ఇక్కడ రాళ్ళల్లో మలచిన శిల్పాలలో శివ కేశవ బేధం లేకుండా సూర్యుడు, శివుడు, గణేష్, దేవి, విష్ణు, ఆయన పది అవతారాలు కనబడతాయి. దీనినిబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ దేవతారాధకులు అని తెలుస్తోంది.  ఈ శిల్పాలు అస్సామీ శిల్పకళకు అద్దం పడతాయి.

 

గర్భగుడి గోడలకి క్రీ.శ. 1940లో టైల్స్ వేయించ బడ్డాయి. టైల్స్ కింద రాధే శ్యాం అని వున్నది. శివాలయం గర్భగుడి గోడలకి వేసిన టైల్స్ లో రాధే శ్యాం పేరేమిటని అడిగితే,  ఆ టైల్స్ వేయించినవారు కృష్ణ భక్తులు, అందుకని అలా వేయించారు అని చెప్పారు.

 

గర్భ గుడిలో లింగం స్వయంభూ.  ఈ లింగం మీద శివ పార్వతులిరువురి రూపం వుందని పూజారిగారు చూపించారుగానీ, అంత స్పష్టంగా కనబడలేదు.  లింగం చిన్న గుంటలాంటి దానిలో వున్నది.  పైన త్రిశూలం, నాగ పడగ.  వెనక కృష్ణుడు, పంచముఖ శివుడు విగ్రహాలున్నాయి. ఈ స్వామిని సోమవారాలు, ముఖ్యంగా అమావాస్య వున్న సోమవారం అర్చిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి కొంచెం దిగువగా ఆంజనేయస్వామి ఆలయం వున్నది.  

దర్శన సమయాలు:-
ఉదయం 7 గం. లనుంచి సాయంకాలం 7 గం. ల దాకా. మధ్యాహ్నం 1 గం. నుంచి 2 గం. ల దాకా గుడి మూసి వుంటుంది.


లాంచీ సమయాలు:-
ఉదయం 7 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  
కారు దిగిన దగ్గరనుంచీ తిరిగి కారుదాకా రావటానికి మాకు 2-30 గంటల సమయం పట్టింది.  అదీ లాంచీ కోసంగానీ, మరెక్కడా ఆగకుండా వస్తే.  అసోం వెళ్ళినవారు తక్కువ సమయం వున్నా తప్పకుండా ఈ అందమైన దీవిని చూసి రండి.  వీలుంటే కొంత ఎక్కువ సమయం గడపండి.

 

 

 

 

 

 

-పి.యస్.యమ్. లక్ష్మి
 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories