ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం – తుంగనాథ్‌

 

 


హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం.

 

హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు! రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంది.

 

 

ఈ తుంగనాథ్‌ క్షేత్రం ‘పంచ కేదార’ ఆలయాలలో ఒకటి. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా! ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతోకొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాడట. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు! దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు. మరి పరమేశ్వరుడేమీ తక్కువవాడు కాదు కదా! వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభరూపంలోని శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు.

 

పంచకేదార క్షేత్రాలలో వృషభరూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది. అవడానికి ఇంత ఎత్తున ఉన్నా, మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం తేలికే! 58వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చాలు, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

 

 

ఒకపక్కన మందాకినీ నది, మరో పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. శీతకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది. అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడి తుంగనాథుని ఉత్సవవిగ్రహాన్ని మోకుమఠ్‌ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్యపూజలను నిర్వహిస్తారు. అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు శీతకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెబుతారు.

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories