బ్రహ్మోత్సవాలు – తొలి నాలుగు రోజుల కబుర్లు!

 

 

ఆశ్వయుజమాసంలో నవరాత్రులనగానే దసరా మాత్రమే కాదు... బ్రహ్మోత్సవాలు కూడా జ్ఞప్తికొస్తాయి. సృష్టికి కారణభూతమైన అమ్మవారితో పాటుగా, ఆ సృష్టిని నడిపించే అయ్యవారిని కూడా కొలుచుకునే సదవకాశం ఇది. ఇంతకీ బ్రహ్మోత్సవాలు అన్న పేరు ఎలా వచ్చిందనేదాని మీద చాలా గాథలే ప్రచారంలో ఉన్నాయి. బ్రహ్మ మొదలిడిన ఉత్సవాలు కాబట్టి అని ఒకరంటే, బ్రహ్మాండమైన వైభవంతో జరిగే ఉత్సవాలు కాబట్టి అంటూ మరి కొందరి నమ్మకం.


ఆశ్వయుజమాసంలోని శ్రవణా నక్షత్ర లగ్నాన వేంకటేశ్వరుడు ఆవిర్భవించాడని అంటారు. అందుకు తొమ్మిది రోజుల ముందు నుంచే ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఆ సమయంలో నవధాన్యాలను కలశాలలో ఉంచి అవి మొలకెత్తేలా (అంకురము) చేస్తారు. అందుకే అంకురార్పణ అన్న పేరు స్థిరపడింది. ఈ అంకురార్పణ అంతా కూడా వేంకటేశ్వరుని సైన్యాధిపతి అయిన విష్వక్సేనుని ఆధ్వర్యంలో జరుగుతుందట.


అంకురార్పణ జరిగిన మర్నాడు వేంకటేశ్వరుని వాహనమైన గరుడుడు ధ్వజం మీదకి ఎక్కి ముల్లోకాలలోనూ ఉన్న జీవులందరినీ స్వామివారి ఉత్సవాలకు ఆహ్వానిస్తాడు. అదే ‘గరుడ ధ్వజారోహణం’. అలా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఊపందుకుంటాయి. మొదటిరోజు స్వామివారు పెద్దశేషవాహనం మీద ఊరేగుతారు. స్వామివారి తల్పమైన ఆదిశేషుని ప్రతిరూపమే ఈ పెద్దశేషవాహనుడు.


బ్రహ్మోత్సవాలు రెండోరోజు ఉదయాన్నే చిన్నశేషవాహనుని మీద స్వామి ఊరేగుతారు. క్షీరసాగరమధనంలో సాగరాన్ని చిలికేందుకు తోడ్పడిన ‘తాడే’ ఈ వాసుకి. తన మీద భారం వేసి, జీవితమనే సాగరాన్ని మథిస్తూ వెళ్తే... ఫలితం సిద్ధిస్తుందన్న సందేశాన్ని చిన్నశేషవాహనుడి మీదున్న స్వామి చెప్పకనే చెబుతున్నాడు. రెండోరోజు సాయంవేళ స్వామి శారదాదేవి రూపంలో హంసవాహనుడై ఊరేగుతాడు. స్వామివారి అనుగ్రహంతో మంచిచెడులను వేరుచేసి చూసే జ్ఞానం లభిస్తుందన్న సూచనను హంసవాహనం అందిస్తుంది.


బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజున ఉదయాన సింహవాహనం మీద స్వామి ఊరేగుతారు. సింహం బలానికీ, అధికారానికీ ప్రతీక. దాన్ని అదుపు చేయకపోతే అదే మదంగా మారి తలకెక్కుతుంది. మనలోని విచక్షణని నిర్వీర్యం చేస్తుంది. అలా జరగకుండా, మనుషులలోని పశుప్రవృత్తిని అదుపుచేస్తాననే సూచనను స్వామి సింహవాహనుడి రూపంలో తెలియచేస్తున్నారు. ఇక మూడో రోజు సాయంత్రం స్వామి ముత్యపుపందిరి వాహనం మీద ఊరేగుతారు. సముద్రగర్భాన దొరికే తెల్లటి ముత్యం... శ్రమకూ, స్వచ్ఛతకూ చిహ్నం. శ్రమించే తత్వం, స్వచ్ఛమైన మనసు లేనిదే మనిషి వ్యక్తిత్వానికి విలువ లేదు కదా! అదే సత్యాన్ని ముత్యపు పందిరి వాహనం తెలియచేస్తుంది.


నాలుగో రోజు ఉదయాన స్వామి కల్పవృక్షవాహనం మీద ఊరేగుతారు. తన చెంతకు చేరినవారి మనసులోని ప్రతి కోరికనూ తీర్చేదే కల్పవృక్షం. భక్తుల మనసులోని ప్రతి కోరికనూ గ్రహించి తీర్చే వేంకటేశ్వరుని మించిన కల్పవృక్షం మరేముంటుంది. ఇహపరమైన కోరికలే కాకుండా, భక్తిమార్గంలోని కైవల్యపథాన్ని కూడా అందించగల అరుదైన కల్పవృక్షం ఆ శ్రీనివాసుడే అన్న సత్యాన్ని ఈ వాహనం తెలియచేస్తుంది.


నాలుగో రోజు సాయంవేళ స్వామి ‘సర్వభూపాల’ వాహనం మీద ఊరేగుతారు. భూపాలుడు అంటే రాజు. కానీ స్వామివారి రాజ్యానికి ఎల్లలుండవు. అష్టదిక్కులకీ, అష్టైశ్వర్యాలకీ, ఆయుష్షుకీ, ఆరోగ్యానికీ... ఆయనే రాజు! అదే విషయాన్ని సర్వభూపాల వాహనం చాటి చెబుతోంది.


బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇప్పటివరకూ నాలుగు రోజుల వాహనసేవలు జరిగాయి. ఈ నాలుగు రోజుల పాటు స్వామివారు తిరుగాడే వాహనాల విశేషాలను ఇప్పటివరకూ చూశాము. ఇక ఐదో రోజున సాగే మోహినీ అవతారం విశేషాలు మరో వ్యాసంలో...

 

- నిర్జర.


More Tirumala Brahmotsavam