తిరుచానూరు - బ్రహ్మోత్సవాలు

 

 

పద్మావతీ అమ్మవారిని దర్శించకుండా తిరుపతిని వీడి వెళ్తే యాత్రా ఫలితం దక్కదని భక్తుల నమ్మకం. అందుకని తిరుపతికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకునేందుకు, భక్తులందరూ తప్పక వెళ్తారు. సువర్ణముఖీ నదీ తీరాన ఉన్న ఈ తిరుచానూరుకి, అలమేలుమంగాపురం అన్న పేరు కూడా ఉంది. ఈ తిరుచానూరులోని పద్మసరోవరంలోనే అమ్మవారు అవతరించినట్లు క్షేత్రపురాణం చెబుతోంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు చతుర్భుజిగా దర్శనమిస్తారు. రెండు చేతులలోనూ పద్మాలతో, అభయ, వరద హస్తాలతో… దరిచేరిన భక్తుల అభీష్టాలను తీరుస్తూ ఉంటుంది ఆ తల్లి. తిరుచానూరు క్షేత్రానికి అనాదిగా ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఈ ఆలయం మాత్రం 17వ శతాబ్దికి ముందు ఉన్నట్లు ఎక్కడా శాసనాలలో నమోదు కాలేదు.

 

 

శ్రీనివాసునికి తిరుమలలో ఎంత వైభవంగా సేవలు జరుగుతాయో, ఈ పద్మావతీ అమ్మవారికి కూడా అంతే నిష్ఠగా సేవలు జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవ మొదల్కొని రాత్రి ఏకాంత సేవ వరకూ ఆలయంలో జరిగే సేవలలో భక్తులు విరివిగా పాల్గొంటారు. అమ్మవారికి జరిగే కుంకుమార్చనకి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. అమ్మవారిని అర్చించిన ఆ కుంకుమను ఇక్కడి ప్రసాదంతో పాటు అందిస్తారు. ఇక ఏటా కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. లక్ష్మీదేవి అవతారమైన ఈ అలమేలుమంగ కార్తీక శుక్ల పంచమినాడు, ఉత్తరాషాఢ నక్షత్రాన ప్రభవించిందని నమ్మకం. ‘అలరుమేలు మంగ’ అంటే తామరపూవు మీద ఉన్న స్త్రీ అని అర్థం. ఈ అలమేలుమంగ సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి అవతారం అని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది!

 



కార్తీక మాసంలో అమ్మవారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అలా ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబరు 8 నుంచి 17వరకు ఘనంగా జరుగుతున్నాయి. 8వ తేదీ ధ్వజారోహణంతో మొదలయ్యే ఈ కార్యక్రమాలలో అమ్మవారు చిన్నశేషవాహనం, పెద్దశేషవాహనం, హంసవాహనం, ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం, కల్పవృక్షవాహనం, గజవాహనం, హనుమద్వాహనం, గరుడవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనాల మీద భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడలేని భక్తులు ఈ శుభతిథులలో ఆమెను మనస్ఫూర్తిగా తల్చుకుంటే చాలు, ఆ చల్లని తల్లి తన ఆశీస్సులను అందిస్తారు.

- నిర్జర.

 


More Venkateswara Swamy