"మా" చిన్తపూర్ణి

 

 ప్రముఖమైన  శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం.

 

చిన్తపూర్ని హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో  మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది.   డిల్లి నుంచి పఠాన్ కోట్ చేరుకొని అక్కడినుంచి టాక్సీ లో స్వామి  చిన్మయానంద వారి తపోవన్ ఆశ్రమం చేరుకున్నాము. అక్కడి నుంచి  మేము హిమాచల్ ప్రదేశ్ లోని చుట్టుపక్కల ప్రదేశాలు చూసాము. వాటిలో శక్తి  పీఠం గా  విరాజిల్లే మా చింత పూర్ణి మందిరం ఒకటి.భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన టూరిష్టులు  కూడా వస్తుంటారు.

 

చరిత్ర కథనాలు

 

దక్షప్రజాపతి కుమార్తె, (పార్వతి దేవి) అయిన దాక్షయని పరమ శివుని వరించి వివాహం చేసుకుంటుంది. కాని దక్షుడు శివుని శక్తిని గుర్తించడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చేయ తలపెడతాడు. ఆ దక్ష యజ్ఞానికి శివుని కాని దాక్షాయినిని కాని ఆహ్వానించడు. అయినా దాక్షాయిని పుట్టినింటి  మీద మమకారంతో  పిలవకపోయినా పుట్టినింటికీ వెడుతుంది. కాని అక్కడ ఆమెకి అవమానం జరుగుతుంది. ఎవరు ఆమెని ఆహ్వానించరు పలకరించరు. శివుని కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అది భరించలేక తనకి తాను అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞ కుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పటినుంచి ఆమె పవిత్రమైన  సతిగా పేరుగాంచింది. 

 

సతి మరణ వార్త విన్న పరమ శివుడు దుఃఖితుడై హుటాహుటిన దక్షవాటికకు  వస్తాడు.  శివ తాండవం చేస్తూ, దక్ష యజ్ఞానాన్ని  నాశనం చేస్తాడు. అనంతరం  సతీ దేవి మరణాన్ని జీర్ణించుకోలేని శివుడు సగం కాలిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేస్తూ భూమండలం అంతటా మతిలేని వాడిలా  తిరుగుతూ ఉంటాడు. అది చూసిన దేవతలందరూ శివునికి సతీదేవి పై గల ప్రేమ, సతి వియోగంతో శివుని బాధనీ స్థితిని చూసి ఆందోళన చెందుతూ  శివుని నుండి సతీదేవి శరీరాన్ని వేరు చేయాలని విష్ణు మూర్తిని ప్రార్దిస్తారు.  విష్ణువు శివుని వెంట అనుసరిస్తూ సమయం చూసి సతి దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రం తో ముక్కలు ముక్కలు చేస్తాడు.  సతీదేవి శరీర భాగాలు భూమండలం అంతటా పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఆ జగన్మాత  కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం, విశ్వాసం.

 

ఈ  శక్తిపీఠాలలలో పరాశక్తి భైరవునితో (తన భర్త అయిన శివుడు) వెంట కాలభైరవుని (శునకం) తోడుగా కొలువై వుంటుంది  చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు.  ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో వుండదు. పిండి రూపం లో వుంటుంది. ఇక్కడకి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది. 

 

చిన్మస్తిక దేవి. (శిరస్సు లేని దేవత)

 

స్థల పురాణాన్ని బట్టి  ఈ కధ కూడా  ప్రచారంలో వుంది. 'మస్తిక'  అంటే శిరస్సు  అని, 'చిన్'  అంటే లేదు అని, అర్థం... శిరస్సు లేని దేవత గా ఇక్కడి మాత ని కొలుస్తారు.  ఇతిహాసాలలోని పురాణాల  ప్రకారం  మార్కండే పురాణం లో ఒక గాధ ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండి దేవి అసురుల్ని ఓడిస్తుంది.  అందులో సాయపడిన   ఢాకిని, యోగిని గా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని  సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని,  యుద్దానంతరం కూడా వారు విపరీతమైన  రక్త దాహంతో వున్నపుడు చండి దేవి  తన తలని తానె ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త దారాలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి దేవికి చిన్ మస్తికాదేవిగా   శిరస్సు లేని దేవిగా పిలువ బడుతోంది. 

 

పురాణాలు, ఇతిహాసాలలో ఈ స్థలాని రుద్ర  దేవుడు ఈ ప్రదేశాన్ని నలు దిక్కులా కాపాడుతుంటాడని కూడా వుంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్ ఆలయం దక్షిణాన శివ్  బారి ఆలయం వున్నాయి. అందుకే  ఆ ఆలయాన్ని చిన్ మస్తిక దేవి ధామ్ అని అంటారు
పండుగలు

 

ప్రతి సంవత్సరంలో పది రోజులు జూలై ఆగష్టు మధ్య ఉత్సవాలు జరుగుతాయి సావన్ (శ్రవణ్ ) అష్టమి ఉత్సవాలుగా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు.  శ్రవణ మాసం లోను, దసరా నవరత్రులలోను కార్తిక మాసంలోను, చైత్ర మాసం లోను, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు

 

ఎంతెంత దూరం

 

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా  నుంచి 47 కి.మీ. దూరం లో  వుంది.  సొలా  సింఘి  పర్వత  శ్రేణులలో  పర్వత శిఖరం పైన  940 మీటర్ల (3,117 అడుగుల) ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం వుంది.      
65 కి. మీ. ధర్మశాల నుంచి.అతి దగ్గరి   విమానాశ్రయం గగ్గల్. కాంగ్రా జిల్లాలో వుంది. రైలు మార్గం ఉనా జిల్లాలోని అంబ నుంచి 20 కి.మీ. దూరం లో వుంది. ఢిల్లీ నుంచి 430 కి మీ  దూరంలో వుంది. పంజాబ్ రాష్ట్రం లోని హోషియార్ పూర్ 43 కి.మీ. దూరం లో వుంది. చుట్టూ సుందరమైన ప్రక్రుతి దృశ్యాలతో అలరారుతూ వుంటుంది. ఢిల్లీ నుండి చందిగడ్, నంగల్, ఉన, ముబరిక్పూర్, తానికపుర , భార్వైన్  చిన్తపూర్ని ఒక మార్గం ఢిల్లీ నుండి జలంధర్, హోషియార్పూర్ ముబారిక్పూర్ భార్వైన్, తానికపుర ద్వారా   చిన్తపూర్నికి  ఇంకొక మార్గం

 

 

ఉప హిమాలయాలు సొలసింఘి  ధార్

 

 

ఇక్కడి పర్వతాలు ఉప హిమాలయ పర్వతాలుగా పిలవబడే   సొలా సింఘి దార్ లేదా  జస్వాన్ దార్ పర్వత శ్రేణుల నడుమ ఎర్రని ధూళితో నిండి వుంటాయి బియాస్ నది   కాంగ్రా, ఉనా జిల్లాలను  తాకుతూ ప్రవహిస్తుంది. ఇంకో ప్రక్క స్వాన్ నది పారుతూ వుంటుంది.  

 

ఈ పర్వతాల నడుమ శక్తి పీఠం అయిన చిన్తపూర్ని ఆలయం అలరారుతోంది.

 

 


ఉత్సవాలలో సుందరంగా అలకరించిన ఆలయం

 

 

దర్శనం చేసుకుని రాగానే కనిపించే ఆలయం

 

 

ఉత్సవాలలో అమ్మవారు

 

చ్ఛిన్నమస్త దేవి  , చినమస్తా దేవి , చిన్మస్తిక దేవి ఇలా భిన్నమైన పేర్లతో దేవిని కొలుస్తారు.  శిరస్సు లేని దేవిగా ప్రసిద్ధి చెందింది.

 

ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రక్రుతి రమణీయ దృశ్యాలు ,  అగాధమైన లోయల నడుమ  అందమైన గృహాలు, భవంతులు కనువిందు చేస్తాయి. ఇటు ఆధ్యాత్మికం గాను, విహార యాత్రలకి ఏంతో అనువైన ప్రదేశం ఇది

 

ఈ ఆలయంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు.

 

ప్రతి ఒక్కరు ఆలయంలోకి ప్రవేసించే ముందు తలపై షాల్ కాని, కర్చీఫ్ కాని, టోపీ  కాని  ధరించాలి. స్త్రీలు కూడా తలపై కొంగుని కప్పుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించాలి.  పాదాల వరకు వస్త్రాలను ధరించాలి.

 

తోలు వస్తువులు అంటే  బెల్త్, లెదర్ పర్సులు వంటివి ఆలయం లోకి తీసుకు రాకూడదు. ఆలయంలో పాన్, గుట్కా, మత్తు పదార్ధాలు సేవించటం నిషిద్దం. ఆలయం లోకి ప్రవేసించే ముందు మాంసాహారం ఆల్కహాలు వంటివి తీసుకుని వుంటే లోనికి ప్రవేసించ కూడదు. దేవతా విగ్రాహాలకి ఎదురుగా కాళ్ళు జాపి కూర్చోకూడదు, పడుకో కూడదు. పండిట్ మాయి దాస్, కలియా సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు.  ఛాప్రో గ్రామం లో మాతా చింత పూర్ణి దేవి ని కనుగొన్నట్లు చెబుతారు. 26 తరాలకి ముందు వాడు  ఇతను. ఇప్పటికి ఇతని వంశీకులే ఆలయంలో దేవిని అర్చిస్తున్నారు.

 

కాలియా కుటుంబీకుల చరిత్రని బట్టి చుస్తే... భక్తుడైన మాయీ దాస్ తండ్రి పాటి యాలాకి దగ్గరలో అతూర్ గ్రామానికి చెందినవాడు. ఇతను దుర్గా మాత  భక్తుడు. ఇతనికి దేవి దాస్, దుర్గ దాస్, మాయీ దాస్ అనే ముగ్గురు కొడుకులు. ఆ తరువాత ఆ కుటుంబం హిమాచల్ ప్రదేశ్,   ఉన దగ్గరలోని గ్రామానికి వలస వచ్చారు. మాయీ దాస్ కూడా తండ్రి వలే దుర్గాదేవి భక్తుడు. ఎప్పుడు భజనలు కీర్తనలు చేస్తుండేవాడు. వివాహం కూడా జరిగింది. తండ్రి మరణానంతరం ఇతని కుటుంబాన్ని  అన్నలు సరిగా చూడక పోవటంతో ఇంటి నుంచి బయటికి వచ్చి ఇబ్బందులు పాడుతుండేవాడు. అయినా కూడా మాయీ దాస్ దుర్గా మాతని ఇంకా భక్తి తో సేవిస్తూ ఉండేవాడు దుర్గా  దేవి తన చింతలని పోగోడుతుందని నమ్మేవాడు.

 

ఒకసారి మాయీ దాస్ అత్తవారింటికి వెడుతూ మర్రి చెట్టు కింద సేద తీరుతాడు. చుట్టూ అడవి. నడిచి నడిచి అలసి పోయి నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో ఒక అందమైన అమ్మాయి కనపడి, "మాయీదాస్!  నీవు ఇక్కడే వుంది నన్ను సేవించుకో. నీకు మంచి జరుగుతుంది" అని అంటుంది. మాయీ దాస్ వెంటనే లేచి చుట్టు  చూస్తాడు కాని అక్కడ ఎవరు కనపడరు .  అతనికి అంతా అయోమయంగా వుంటుంది.

 

అతను తిరిగి అత్తవారింటికి తన ప్రయాణం కొనసాగిస్తాడు. కాని తనకి వచ్చిన కల గురించే ఆలోచిస్తాడు. ఆ ఆమ్మాయి నిజంగా దేవేనా?  అలా ఐతే  ఆ అజ్ఞాని ఎలా అమలు పరచగలడు ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ అత్తగారింట్లో ఎక్కువ కాలం ఉండలేకపోతాడు.

 

తిరుగు ప్రయాణంలో అదే వృక్షం కింద కూర్చుని తన ఆలోచనలను దుర్గా దేవి గురించే ఆలోచిస్తాడు. "ఓ జగజ్జనని! నీ కున్న శక్తి నాకు లేదు. నేను చాల చిన్న వాడిని. నన్ను నీ నిజమైన భక్తునిగా స్వీకరిస్తే నా సందేహాలని పోగొట్టు" అని ప్రార్ధిస్తాడు.  మాయీ దాస్ ప్రార్ధనలు విన్న దుర్గామాత అతని ముందు చతుర్భుజాలతో సింహ వాహినియై  ప్రత్యక్షమౌతుంది. మాయీ దాస్ ఆమెని కీర్తిస్తాడు. "తల్లీ నీవు నన్ను ఆజ్ఞాపించు. నేను నిన్ను ఎలా సేవించుకోవాలి? నీ పాదాల చెంత నా జీవితం అంకితం  చేసుకుంటాను" అని అర్దిస్తాడు.

 

దానికి సమాధానంగా దుర్గా దేవి "నేను ఇక్కడ తరతరాలుగా ఉంటున్నాను. కాని ఈ కలి యుగం లో ప్రజలు  ఈ ప్రదేశాన్ని, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఇక్కడ పిండి రూపంలో (గుండ్రని రాతి రూపం) వున్నాను. ప్రతి రోజు పూజాదికాలు నిర్వహించేలా చూడు"  అని ఆజ్ఞాపించింది. తరువాత  అతనికి మంత్రోపదేశం  చేసింది.  దుర్గామాత "వ్స్వు ఇంతవరకూ ఛిన్నమస్తిక దేవిగా అందరికి తెలుసు. నేను అందరి బాధలు, కష్టాలు తొలగిస్తాను కనుక ఇప్పటి నుంచి ప్రజలు నన్ను చింత పూర్ణికగా  పిలుస్తారు.   నా భక్తులు ఇక్కడ నాకు ఆలయం నిర్మిస్తారు. భక్తులు సమర్పించే కానుకలు నీ బుక్తికి సరిపోతాయి" అని కూడా చెప్పింది. 

 

కొండ శిఖరాన ఆ ప్రదేశం అంతా కొండచిలువలతోను క్రూర మృగాలతోను నిండి వుంది.  అంత ఎత్తులో అక్కడ  నీళ్ళు దొరకడం కూడా చాల కష్టం. అప్పుడు దుర్గ మాత కొంత దూరం లో  ఒక ప్రదేశం చూపించి అక్కడ తవ్వితే నీరు లభిస్తుందని చెప్పింది. మాయీ దాస్ దేవి చూపించిన ప్రదేశంలో ఒక రాతిని తొలగించితే అక్కడ  మంచి నీటి వూట ఉవ్వెత్తున పైకి లేచించి. మాయీ దాస్ ఆనందానికి అవధులు లేవు.    ఆ నీటితో ప్రతి రోజు అమ్మవారికి అభిషేకానికి ఉపయోగించేవాడు. భజనలు, స్త్రోత్రాల తో పూజించేవాడు. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పాక వేసుకుని ఉండేవాడు.

 

ప్రస్తుతం అతని  తరువాత  26 తరాలవారు మాత ని సేవించుకున్నారు. నేటికి అతని వంశీకులే   అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.  ఆ వూరిలో అధిక భాగం అతని దయాదులే వున్నారు.

 

ఆ నీటి ట్యాంక్ సమీపం లో మాయీ దాస్ సమాధి వుంది. ఆనాడు తవ్విన తటాకమే నేడు  ఆధునీకరించి  ఆ నీటినే అభిషేకానికి, ఆలయ అవసరాలకి  వాడుతుంటారు.     

 

అడవిలో చెట్టు కింద మాయీ దాస్ చే పూజలు అందుకున్న చిన్తపూర్ని అమ్మవారికి నెమ్మది నెమ్మదిగా  ఆలయం నిర్మించి ఏంతో  అభివృద్ధి చేసారు. నేటికి ఆ ఊరిని ఛాప్రోగానే  పిలుస్తారు.

 

పూర్తిగా అడవితో నిండి వుండే ఆ ప్రదేశం రోడ్లు వాహనాల రాకపోకలతో నిత్యం  రద్దీగా మారింది. ఆలయానికి 1.2 కి.మీ. దూరంలోనే వాహనాలు ఆపి రద్దీగా వుండే బజార్ల గుండా కాళీ నడకన నడిచి ఆలయానికి వెళ్ళాలి. మంగళ శుక్ర, శని ఆది వారాలలో విపరీతమైన రద్దీ వుంటుంది. మాకు దర్సనానికి మూడు గంటల సమయం పట్టింది.

 

సాధారణంగా భక్తులు అమ్మవారికి తియ్యటి పదార్ధాలు నివేదన చేస్తారు. రవ్వతో చేసిన హల్వా, లడ్డు, బర్ఫి ఖీర్,  కొబ్బరి  వంటి ఆహార పదార్దాలే కాక  ఎర్రటి చున్ని, ధ్వజం అంటే ఎర్రటి జెండా, పూలు, నెయ్యి వంటివి కూడా దేవికి సమర్పిస్తారు. ప్రసాదాన్ని ఇంటినుంచి కాని అక్కడ బజార్లలోని షాపులలో  కాని కొని నివేదన చేస్తారు.

     

    

 

 


 

అందమైన్ స్వాన్ నది

 

....Mani Lopalle


More Temples