ఆలయంలో ఇలా....

 

 

ఎక్కడికి వెళ్ళినా రాని మనశ్శాంతి దేవాలయానికి వెళితే వస్తుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆలయాల్లో ప్రతిష్ఠ సమయంలో వేసే యంత్రాలు, చేసే యజ్ఞాల వల్ల చాలా మటుకు శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఆ తరువాత కూడా నిత్యం చేసే జపాలు, అభిషేకాలు, అష్టోత్తరాలు వీటన్నిటి వల్ల కూడా ఆ ప్రదేశమంతా ఒక శక్తి కేంద్రంగా విలసిల్లుతూ ఉంటుంది. అలాంటి పవిత్ర ప్రదేశాలు కావటం వల్లే అక్కడికి వెళ్ళిన వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది.

 

 

మరి అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే ఇంకా మంచిది కదా. ముందుగా ఆలయానికి కాలి నడకన వెళితే తప్పనిసరిగా కాళ్ళు కడుగుకుని గాని లోపలికి వెళ్ళకూడదు. లోపలి వెళ్ళిన తరువాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలా చేసేటప్పుడు ద్వజస్థంభానికి గర్భగుడికి మధ్య నుంచి వెళ్ళకూడదు. ద్వజస్థంభం చుట్టూ తిరిగి చేస్తేనే ప్రదక్షిణ పరిపూర్ణం అయినట్టు. దేముడిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఇక గుడి లోపలికి  వెళ్ళిన తరువాత ఎప్పుడూ దేముడికి ఎదురుగా నిలబడకూడదు.  పక్కగా నిలబడి నమస్కరించాలి. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు శబ్ధం చేయకుండా తీసుకోవాలి. తీర్థం పుచ్చుకున్నకా ఆ చేతిని తలపై రాసుకోకూడదు. ఎందుకంటే మన తలపై పెట్టే శటారి మీద దేముడి పాదాలు ఉంటాయి, ఆ శటారి సాక్షాత్తు దేముడి పాదాలతో సమానం. అలాంటి దేముడి పాదాలకి మనం ఎంగిలి చేసిన చెయ్యి అంటుకుంటుంది కాబట్టి తీర్థం పుచ్చుకున్న చెయ్యి తలపై రాసుకోకూడదు. అలాగే ప్రసాదాన్ని కింద పడకుండా తినాలి.

 

 

దర్శనం అయ్యాకా చాలా మంది గుడిలో ఉన్న పురోహితులకి దణ్ణం పెడతారు. అలా పెడితే దేముడిని అవమానించినట్టే అవుతుంది. అంత పెద్ద పరమాత్ముడు మన కళ్ళ ముందు ఉండగా మనవమాత్రులైన వారికి దణ్ణం పెట్టటం ఆయనని కించపరచినట్టే అవుతుంది కదా. ఆలయంలో కూర్చునేటప్పుడు మన వెనక భాగం దేముడి వైపు కూర్చోకూడదు. ఆలయంలో కూర్చునప్పుడు దైవ సంబంధమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఆలయ ప్రాంగణంలో దేవతలు నివాసం ఉంటారు. నిరంతరం దైవప్రార్ధనలో ఉండేవాళ్ళని మనం విసిగించటం ఎంతవరకు సబబో ఆలోచించండి.


దేముడికి దణ్ణం పెట్టేటప్పుడు ఒక చేత్తో ఎప్పుడూ దణ్ణం పెట్టకూడదు. రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకోవాలి. అలాగే శాలువా గాని,  కంబళిలాంటిది గాని కప్పుకుని దేముడిని దర్శించకూడదు. అలాగే తలపై టోపీ పెట్టుకుని గుడిలోకి వెళ్ళకూడదు. గుడిలో పూసిన పువ్వులను కోసి మళ్లీ గుడిలో దేముడికే పెట్టమని ఇవ్వకూడదు. అలాగే గుడిలో పూవులని ఇంట్లో పూజకి ఉపయోగించకూడదు. ఆలయ మంటపంలో భోజనం చేయకూడదు. తిన్న ప్రసాదం పోట్లాలని అక్కడే పారేయకూడదు.


దేముడికి హారతి ఇచ్చి మనకి చూపించినప్పుడు దానిని కళ్ళకి అద్దుకోకూడదు. అలాగే  పిల్లలకి కూడా అద్దకూడదు. వీలయినంత వరకు ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులకి, బిచ్చగాళ్ళకి అన్నదానం చెయ్యటం మంచిది. ఇలా భగవంతుడిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైనట్టు ఉంటూ అతని అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి.

 

..కళ్యాణి


More Enduku-Emiti