అమ్మా బైలెల్లినాదో... 

 

ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణా రాష్ట్రమంతా పండగ వాతావరణమే. మహిళలకందరికీ ఉత్సాహం ఉరకలు వేస్తూంటుంది. మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఇంకా ఎందరో గ్రామదేవతలు, తమ గ్రామాలనీ, తమ కుటుంబాలనీ కనిబెట్టుకుని కాచే అమ్మ తల్లులు .. వారికి ఉత్సవం చెయ్యాలి. బోనాలు సమర్పించాలి. జాతరలు చెయ్యాలి.

బోనాలు ఆషాఢ మాసంలో గురువారం, ఆదివారాలలో ఈ తల్లులందరికీ బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తున్నది. ఈ బోనాల పండుగని రాష్ట్రీయ పండుగగా కూడా ప్రకటించారు. తొమ్మిది వారాలపాటు సాగే ఈ బోనాల పండగ తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలకు మచ్చుతునక. దీనికీ కొన్ని నియమాలున్నాయి. ముందు గోల్కొండలోని జగదంబా మహాకాళి ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్కడ తొమ్మిది వారాలపాటు గురు, ఆదివారాలలో బోనాలు సమర్పించి అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిదవ వారంతో సంబరాలు ముగుస్తాయి. ఇక్కడ మూడోవారం జరిగే పూజలతోబాటు సికిందరాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఐదవ వారం జరిగే పూజలతో లాల్ దర్వాజ ఆలయాలలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాలలో ఆ ప్రాంతం వారేకాక చుట్టుపక్కల ఊళ్ళనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

ఇంతకీ బోనం అంటే భోజనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం. కొందరు వండిన అన్నంతో పాలు, బెల్లం కలిపి, కొందరు అన్నం, ఉల్లిపాయలతో కలిపి బోనాన్ని తయారు చేస్తారు. కొత్త మట్టి కుండను పసుపు, కుంకుమ, తెల్ల రంగులతో అందంగా అలంకరిస్తారు. దానిలో బోనాన్ని పెట్టి, దానిమీద వేపాకుతో అలంకరించి, ఆ పైన దీపం వెలిగిస్తారు. తమ చుట్టపక్కాలతో, ఇరుగు పొరుగుతో కలిసి ఆ కుండలని నెత్తిమీద పెట్టుకుని బయల్దేరుతారు. అందంగా అలంకరించుకున్న మహిళలు, ఇంకా అందంగా అలంకరించిన బోనాల పాత్రలని తీసుకుని భక్తి శ్రధ్దలతో అమ్మవారి గుడికి బయల్దేరితే కోలాహలం కూడా వుండాలికదా. అందుకే డప్పుల వాయిద్యాలు, పోతురాజుల హడావిడి, వారిని చూసి దడుసుకునే చిన్న పిల్లలు, సందడికేం తక్కువ వుండదండీ. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనాలని మోస్తూనే డప్పులవాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

అన్నట్లు కొందరు ఆపదలు వచ్చినప్పుడు తాము నమ్మిన అమ్మవారికి మొక్కుకుంటారు, ఆపద గట్టెక్కిస్తే బోనమెత్తుతామని. కొందరు ఆనవాయీగా చేస్తారు. మహిళలు తెచ్చిన బోనాలని ఆలయంలో ఒక చోట కుప్పగా పోస్తారు. దానిమీద పసుపు, కుంకుమ జల్లి అమ్మకి నైవేద్యంపెట్టి, ముడుపులు చెల్లించుకుని, తమని చల్లగా కాపాడమని ప్రార్ధిస్తారు. ఈ సందర్భంగా జంతుబలి కూడా వుంటుంది. ఇదివరకు దున్నపోతులని బలి ఇచ్చేవారుట. ఇప్పుడా ఆనవాయితీ పోయింది. కోడి పుంజులని మాత్రం ఇస్తారు. మరి భక్తులందరూ వస్తున్నప్పుడు ఆలయాలని మాత్రం అలంకరించద్దూ. ముందునుంచే ఆలయాధికారులు తమ నిర్వహణలో వున్న ఆలయాలను మరమ్మత్తులు చేయింది, రంగులు వేయించి, ఉత్సవాలకు సిధ్ధం చేస్తారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. తండోపతండాలుగా వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా శ్రధ్ద తీసుకుంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ అమ్మవార్లని తమ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలగా భావించి భక్తి, శ్రధ్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలు సమర్పిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని చిహ్నం. అందుకే వాళ్ళని శాంతపరచడానికి ఈ మహిళలు ఆలయం దగ్గరకు వస్తున్న సమయంలో వారి పాదాలమీద మిగిలిన భక్తులు నీళ్ళు పోస్తారు.

తొట్టెలు: ఈ సందర్భంగానే భక్తులు తొట్టెలు కూడా సమర్పిస్తారు. ఈ తొట్టెలను కర్రలు, రంగు రంగుల కాయితాలతో అందంగా తయారు చేస్తారు. వీటిని కూడా ఊరేగింపుతో తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.

పోతురాజు: పోతురాజుని అమ్మవారి సోదరుడంటారు. ఇదివరకు కొంతమంది వంశాచారంగా, ఆనవాయితీగా పోతురాజు వేషం వేసేవారు. ఇప్పుడు అలాంటివారు చాలా తక్కువమంది వున్నా, ఔత్సాహికులు చాలామంది పోతురాజు వేషం వేస్తారు. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలంగా ఉంటాడు; ఒంటిపై పసుపు పూసుకుని, నుదుటిపై పెద్ద కుంకుమబొట్టు ధరించి, కాలికి ఘల్లు ఘల్లుమని మ్రోగే గజ్జెలు కట్టుకుని, చిన్న ఎర్రని ధోవతిని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తాడు. ఒక్కొక్కసారి ఈయన నోట్లో నిమ్మకాయ ధరిస్తాడు. చేతిలో కొరడాతో కొట్టుకుంటూ రౌద్రంగా నాట్యంచేసే పోతురాజులని చూసి కొందరు చిన్న పిల్లలు భయపడతారు. ఆయన దగ్గరకు రాగానే పారిపోయి, దూరంగా వెళ్ళగానే నాట్యం చూడాలనే కుతూహలంతో మళ్ళీ వస్తారు. ఈయన పూజా కార్యక్రమాలకు ఆరంభకుడేకాదు, భక్త సమూహాలకి రక్షకుడుకూడా.

విందులు, సంబరాలు: బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించే పండుగ అవడంతో ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత ఇంట్లో బంధు మిత్రులతో మాంసాహార విందు భోజనం చేస్తారు.పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరుతో వాడ వాడలా పండుగ వాతావణం నెలకొంటుంది.

ఫలహారపు బళ్ళు: బోనాల రోజు సాయంత్రం రకరకాల ఫలహారాలతో బళ్ళని తీసుకువచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఈ ఊరేగింపులోకూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అందంగా అలంకరించిన ఫలహారపు బళ్ళతో, పోతరాజుల విన్యాసాలతో, యువకుల నాట్యాలతో ఊరేగింపు ఉత్సాహంగా జరుగుతుంది.

ఘటం: ఒక రాగి కలశాన్ని అలంకరించి దానిని అమ్మవారి ప్రతి రూపంగా భావిస్తారు. దానినే ఘటం అంటారు. ఈ ఘటాన్ని సాంప్రదయమైన వస్త్రధారణతో, ఒంటికి పసుపు రాసుకున్న పూజారి నెత్తిన పెట్టుకుని తీసుకురాగా, పండగ మొదటిరోజునుంచీ, చివరి రోజుదాకా ఆలయ పరిసర ప్రాంతాలలో రోజూ డప్పుల మేళాలతో ఊరేగిస్తారు. చివరి రోజున ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఈ ఊరేగింపులో పోతురాజులేకాక పౌరాణిక వేషాలు ధరించిన ఉత్సాహవంతులు కూడా పాల్గొని ఊరేగింపుకి అందాన్ని తెస్తారు.

రంగం: బోనాలు సమర్పించిన మరునాడు రంగం జరుగుతుంది. దీనిలో ఒక అవివాహిత అయిన స్త్రీ ఒక పచ్చి కుండమీద నుంచుని భవిష్యత్ గురించి చెబుతుంది. ఆ సమయంలో ఆవిడని అమ్మవారు ఆవహించి ఆవిడచేత భవిష్యత్ చెప్పిస్తారని భక్తుల నమ్మకం. భవిష్యత్ అంటే ఆసక్తి లేనిది ఎవరికి? భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆషాఢమాసం, బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. మరి మనంకూడా వచ్చేవారు జంట నగరాలలోని కొన్ని ముఖ్య ఆలయాలు దర్శిద్దాము.

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Bonalu