సనకసనందనాదుల గురించి విన్నారా!

 


విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయవిజయుల శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయవిజయులు ఇరువురూ విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోని రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడమూ... వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలను దాల్చడం తెలిసిందే! ఇంతకీ ఆ జయవిజయులకు శాపం ఇచ్చి, పరోక్షంగా లోకకళ్యాణానికి కారణమైన వారు మరెవ్వరో కాదు- సనకసనందనాదులు! ఇంతకీ ఎవరీ సనకసనందనాదులు?

 

చాలామంది సనకసనందనాదులు ఇద్దరనుకుంటారు. నిజానికి వీరు నలుగురు అన్నదమ్ములు. వారి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. కొన్ని చోట్ల సనత్సుజాతుని పేరు బదులుగా సనాతన అన్న పేరు కనిపిస్తుంది. ఈ నలుగురు అన్నదమ్ములూ బ్రహ్మమానస పుత్రులు. ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు, తన పనిలో తోడుగా ఉంటారని తలంచి ఈ నలుగురికీ జన్మనిచ్చాడట. అయితే బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వ గుణంతో ఆవిర్భవించిన సనకసనందనాదులు... తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు.

 

సనకసనందనాదులు బాల్యంలోనే వేదాలను ఔపోసన పట్టేశారు. బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు. బ్రహ్మచారులై లోకసంచారం చేస్తూ, తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్మల్మషమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థని దాటి ఎరుగవు. కానీ వృద్ధులైనవారికి సైతం ఆధ్మాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు. నారదుడు, మార్కండేయుడు వంటి మహారుషులు సైతం వీరి నుంచి బోధను గ్రహించినవారే. ‘అజ్ఞానానికి అహంకారమే మూలం’ అంటూ పృధు చక్రవర్తికి బోధించినా, ‘ఆత్మ ఒక్కటే సత్యం’ అంటూ దృతరాష్ట్రుని మనసుని తేటపరచినా... అది సనకసనందనాదులకే చెల్లింది.

 

భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం. ఇక రామాయణంలోని ఉత్తరకాండలో సనకసనందనాదులు రాముని కలుసుకునే సన్నివేశం కనిపిస్తుంది. మహాభారతంలో అయితే జ్ఞానబోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు. ఇలా సనకసనందనాదులు గురించి పురాణాలలో ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి. అటు విష్ణుసంబంధమైన సాహిత్యంలోనూ, ఇటు శైవ సాహిత్యంలోనూ వీరి గురించి ఏవో ఒక గాథలు వినిపిస్తూనే ఉంటాయి. శివుడు దక్షిణామూర్తిగా అవతరించినప్పుడు, ఆయన జ్ఞానాన్ని పరీక్షించదలచిన సనకసనందనాదులు అనేక క్లిష్టమైన ప్రశ్నలను వేశారట. కానీ పరమేశ్వరుడు వాటన్నింటినీ అలవోకగా జవాబులనివ్వడంతో... సనకసనందాదులు వినమ్రతగా తమ ఓటమిని అంగీకరించారట.

 

మన దేశంలోని పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్థలపురాణాలలో కూడా సనకసనందనాదులతో ముడిపడిన కథలు కనిపిస్తాయి. ఉదాహరణకు మానససరోవరం గురించిన కథనే తీసుకోండి. సనకసనందనాదులు పరమేశ్వరునికి పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా వారి తండ్రి బ్రహ్మదేవుడు మానససరోవరాన్ని సృష్టించాడని ఓ గాధ ప్రచారంలో ఉంది. హిమాలయాల దాకా ఎందుకు సనకసనందనాదులు కొన్నాళ్లు తిరుమలలో తపస్సు చేసుకున్నారని చెబుతూ... వారు తపస్సు ఆచరించిన చోటుని సనకసనంద తీర్థంగా పేర్కొంటున్నారు.

 

ఇలా సనకసనందనాదుల ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగునా కనిపిస్తాయి. అన్నదమ్ముల అనుబంధానికీ, భక్తితో కూడిన జ్ఞానానికీ, వైరాగ్య భావనలకీ, నిష్కల్మష జీవితానికీ ప్రతీకగా నిలుస్తారు.

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories