ఊర్వశి పురూరవుని ఎందుకు వదిలేసింది?

  (Why Uvashi deserted Puroorava)

 


ఊర్వశి మహా సౌందర్యవతి. విష్ణుమూర్తి ఊరువు నుండి ఉద్భవించిన ఆమె ముగ్ధమోహన లావణ్యానికి ఎంతటివారైనా దాసోహం అనాల్సిందే.

అనన్య సామాన్యమైన అందాల రాశి ఊర్వశి శాపగ్రస్తురాలై మానవజన్మ ఎత్తింది. యుక్తవయస్కురాలైన ఊర్వశి ఒక సందర్భంలో పురూరవుని చూసింది. అప్పటికే ఆమె అతని గురించి విని ఉన్నది. పురూరవుడు పరాక్రమానికి ప్రతిరూపం అని అందరూ కీర్తిస్తుంటారు.

పురూరవుడు ఊర్వశిని చూస్తూనే మోహావేశంలో పడిపోయాడు. ఆమెను చేసుకుంటే చాలు జన్మ ధన్యమౌతుంది అనుకున్నాడు. తన ప్రేమను తెలియజేసి, "నువ్వు లేకపోతే నాకు లోకమే లేదనిపిస్తోంది.. మనం పెళ్ళి చేసుకుందామా?" అనడిగాడు.

ఊర్వశి చిరునవ్వు నవ్వి ''పురూరవా, నిన్ను చేసుకోడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే రెండు షరతులు.. నువ్వు వాటిని పాటిస్తాను అంటే అలాగే చేసుకుందాం'' అంది.

''నా శౌర్యం గురించి వినే ఉంటావు కదా.. ఎంత కష్టమైన షరతులైనా పరవాలేదు.. చెప్పు'' అన్నాడు.

''అయితే విను.. నేను రెండు గొర్రెలను ప్రేమగా పెంచుకుంటున్నాను..వీటిని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. ఈ గొర్రెలకు పూర్తి రక్షణ ఇవ్వాలి.. ఇక రెండో నిబంధన ఏమిటంటే నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నా కంటికి వివస్త్రునిగా కనిపించకూడదు..'' అంది ఊర్వశి.

పురూరవుడు నవ్వి ''అలాగే.. వీటికి నేను కట్టుబడి ఉంటాను.. నిన్ను చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నాడు.

''ఇప్పుడే చెప్తున్నాను పురూరవా.. నువ్వు గనుక ఎప్పుడు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతాను..'' అంది ఊర్వశి.

''అలాంటి అవకాశం నీకు ఇవ్వనులే'' అంటూ నవ్వాడు పురూరవుడు.

ఊర్వశీ పురూరవుల వివాహం జరిగింది. పురూరవుని ఆనందానికి అవధులు లేకపోయాయి. ఊర్వశి కూడా సంతోషంగానే ఉంది.

___+++___+++___

భూలోకంలో ఊర్వశీ పురూరవుల జంట సంతోష సరాగాలలో తేలుతుండగా దేవేంద్రుడు ఊర్వశి గురించి పరితపించసాగాడు. ఒకరోజు గంధర్వులను పిలిచి "ఊర్వశి ఎక్కడ ఉందో గాలించండి.. ఆమె ఎక్కడున్నా సరే తక్షణం తీసుకురండి..'' అన్నాడు.

గంధర్వులు ముల్లోకాలు వెతుకుతూ బయల్దేరారు. చివరికి భూలోకంలో ఊర్వశి జాడ దొరికింది. ఆమె గొర్రెలను ప్రాణప్రదంగా పెంచుతోందని తెలిసి, ''వాటిని తీసికెళ్తే సరి, ఆమె అనుసరించి వస్తుంది'' - అనుకున్నారు.

ఒక రాత్రివేళ గంధర్వులు తాళ్ళు విప్పి తీసికెళ్తోంటే గొర్రెలు భయపడి పెద్దపెట్టున అరిచాయి.

ఊర్వశి వెంటనే లేచి కూర్చుంది. పాపం పురూరవునికి మెలకువ రాలేదు. ఊర్వశి లేపగా లేపగా చాలాసేపటికి లేచాడు. ఈలోపు గంధర్వులు గొర్రెలను తీసికెళ్ళిపోయారు.

పురూరవుడు ఉలిక్కిపడి లేచేసరికి ఊర్వశి కోపంగా ''నువ్వు షరతు తప్పావు.. గొర్రెలను రక్షిస్తానన్నావు.. ఇప్పుడు చూడు, గొర్రెలను దొంగిలించుకుపోయారు..'' అంది.

''అవునా, నేనిప్పుడే వెళ్ళి గొర్రెలను విడిపించుకు వస్తాను'' అంటూ కంగారుగా లేస్తున్న పురూరవుడి పంచె జారిపోయింది.

ఊర్వశి కోపం హెచ్చిపోయింది. ''ఛఛ.. రెండో నిబంధన కూడా తప్పావు..నా ఎదుట వివస్త్రుడివి కాకూడదు అని చెప్పానా లేదా?" అంది.

పురూరవుడు ''తప్పయిపోయింది.. క్షమించు..మరెన్నడూ ఇలాంటి పొరపాటు జరగదు.. నీకు ఇష్టమైన గొర్రెలను ఇప్పుడే తీసుకొస్తాను..'' అని వెళ్ళబోతోంటే ఊర్వశి అడ్డుకుంది.

''అవసరం లేదు.. ఇది సరిదిద్దుకునే తప్పు కాదు.. నేను ముందే చెప్పాను, ఎప్పుడు ఉల్లంఘిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని.. నేను స్వర్గలోకంలో ఉండవలసిన దాన్ని.. శాపవశాన ఇక్కడికొచ్చాను.. ఇంతటితో మన రుణానుబంధం తీరిపోయింది.. నేను వెళ్తున్నాను..'' అంటూ బయల్దేరింది.

పురూరవుడు ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది. ఊర్వశి లేని లోకం శూన్యంగా కనిపించింది. పురూరవుడు అనేక ధార్మిక గ్రంధాలు చదివాడు. యజ్ఞయాగాలు చేశాడు. చివరికి ఊర్వశిని చేరుకున్నాడు.

Urvashi, Celestial Myth, Urvashi and puroorava, Urvashi Puroorava story, mythological characters Urvashi-puroorava, mythological story Urvashi, mythological story puroorava, Why Uvashi departed from Puroorava


More Purana Patralu - Mythological Stories