షిర్డీ సాయి తత్వమిదే

షిర్డీ సాయిబాబా తత్వమేమిటని పరిశీలిస్తే, మత సమన్వయాన్ని ప్రబోధించి, మత సామరస్యాన్ని పెంపొందించి, మతంలో వున్న లోపాల్ని సరిదిద్ది, సంఘం ఆచరించాల్సిన సరైన విధానాన్ని బోధించారని సాయి తత్వాన్ని కూలంకషంగా పరిశీలించిన పెద్దలు చెబుతారు. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు మూడింటినీ మేళవించి, వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపించారు.

షిర్డీ సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఎలాంటి మంత్ర తంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఎవరికీ ఏ మంత్రాన్నీ ఉపదేశించలేదు. ఏ యోగ మార్గాన్నీ ఆయన ఆచరింపచేయలేదు. పూజా విధానమంటూ ఏ ప్రత్యేక పూజా విధానాన్నీ ఆయన ప్రతిపాదించలేదు. హఠయోగాన్ని, షట్కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చిన కన్నడ ప్రాంతానికి చెందిన యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి విముఖుడిని చేశారు.  ఏకాదశి నాడు ఉపవాసాలనే తంతు నుంచి కూడా ఆస్తికులను విముక్తులను చేయించి, వారికి తిండి తినిపించమే కాకుండా ఉల్లిపాయలు కూడా వారిచేత తినిపించారు. తిథి, వార, నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే, భక్తి, ప్రేమల్ని ప్రోత్సహించారు. ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నిరాకారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారాయన.

రాధాబాయి దేశ్‌ముఖ్ అనే వృద్ధ మహిళ దగ్గర మాత్రమే ఆయన నిజమైన ధ్యానమార్గాన్ని సవివరంగా బోధించారు. గురుశిష్య బంధాన్ని, గురువుకున్న ప్రాధాన్యాన్ని, ధ్యాన సాధన ప్రాధాన్యాన్ని ఆయన కూలంకషంగా వివరించారు. ఆత్మజ్ఞాన, సాధన మార్గంలో నడవాలనుకునే వారికి హృదయ వైశాల్యం వుండాలని,  ఎల్లప్పుడూ ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని సాయిబాబా సూచించారు. ఆత్మజ్ఞాన సాధకుడయినప్పటికీ ఇంద్రీయ నిగ్రహం అంత తేలిగ్గా అలవడని, దాన్ని ప్రతినిత్యం సాధనతో అలవరుచుకోవాలని తార్కాణాలతో సహా నిరూపించారు.

ప్రారబ్ధ కర్మలతో బాధల్ని అనుభవిస్తున్న మానవుల బాధలన్నిటినీ తాను స్వీకరించి వాళ్ళను బాధల నుంచి విముక్తులను చేశారని అనిపిస్తూ వుంటుంది. కొలిమిలో పడిన పసిబిడ్డను తన చేతిని కాల్చుకుని బాబా రక్షించారు.  భక్తుడి చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గం అని మనకు అవగతం అవుతుంది. కుచేలుడి దారిద్ర్యం మొత్తాన్నీ మూడు పిడికిళ్ళ అటుకులు తీసుకోవడం ద్వారా  తొలగించిన శ్రీకృష్ణుడి తరహాలో బాబా తన భక్తుల బాధల్ని, ఆకలిని, వ్యాధులను తొలగించారు. వారి బాధలను ఆయన భరించారు. ఇలాంటి తత్త్వాన్ని బాబా తప్ప మరే సిద్ధ పురుషుడూ ప్రదర్శించలేదు.

-అంతర్యామి


More Saibaba