రథసప్తమి రోజు ఏం చేయాలంటే...

 

 

మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన డిస నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని చెపుతున్నాయి మన శాస్త్రాలు.

రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం  సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలిట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు,ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. 

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,

సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే ||

("సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)

 


 

ఈ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యటం శ్రేయస్కరమట. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరుబయట(సూర్యకిరణాలు పడే చోట) తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి,దానిపై వరిపిండితో పద్మం వేసి,పొయ్యి పెట్టి ఆవుపేడతో చేసిన పిడకలు అంటించి, ఆవుపాలు పొంగించి,ఆ పాలల్లో కొత్తబియ్యం,బెల్లం,నెయ్యి,ఏలకు

లు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా ఏడూ చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుఆకులపై పరమాన్నం ఉంచి దేముడికి నైవేద్యంగా పెట్టేవారు.


కాని ఇప్పుడు కాలం మారింది దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సివచ్చింది. పొయ్యలు పోయి గ్యాస్ స్టవ్ లు  వచ్చాయి కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు  పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు. రథసప్తమి నాడు దేముడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చిమ్మిలి దానం ఇస్తే సకలశుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం.


 ఇలా రథసప్తమి నాడు చెయ్యాల్సిన  వాటికి ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు శ్రమ లేకుండా చిత్తశుద్ధి తో సూర్యుడిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. 

...కళ్యాణి
 

 


More Ratha Saptami