ధనూ రాశి - (2018-2019)

ధనస్సు రాశి -  మూల 1,2,3,4 (యే,యో,బా,బీ)

పూ.షా.1,2,3,4(బూ,ధా,భా,ఢా),ఉ.షా.1(బే)

ఆదాయము 5  వ్యయం 5 రాజపూజ్యం 1 అవమానం 5

    ఈ రాశి వారికి 11-10-2018 వరకు గురువు 11వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 12వ స్థానంలో తదుపరి వత్సరాంతం 1వ స్థానంలో ఉండును. శని వత్సరమంతా 1వ స్థానంలో, రాహు, కేతువులు 7-03-2019 వరకు 8, 2  స్థానాల్లో తదుపరి వత్సరాంతం 7, 1 స్థానాల్లో ఉందురు.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించి చూడగా శుభాశుభ మిశ్రమ ఫలితములు కనపడుచున్నవి. వత్సరారంభంలో గురుబలము కొంత అనుకూలముగా ఉండును. పనుల యందు ఆలస్యము, తమ సహనానికి ఒక పరీక్షలాగా ఉండును. పితృ సంబంధ ఆస్తి తమ పేరుపై మారుట, నూతన గృహ నిర్మాణ ఆలోచనలు, పనులన్నియు ఆలస్యముగా మిశ్రమ ఫలితంగా నెరవేరును. తొందరపాటు నిర్ణయాలు తీసుకొనరాదు. శ్రేయోభిలాషుల సలహా కొంత మేలు చేయును. ధనము కాస్త ఆలస్యంగానైనా చేతికందుతుంది. కులాచార ప్రవర్తన ఏర్పడుతుంది. స్వగృహ ప్రాప్తికై ఆరాటము. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. తల్లి ఆరోగ్యము ఇబ్బందికరముగా ఉండవచ్చును. ఔషధ సేవనము అవసరం కావచ్చును. స్త్రీ సౌఖ్యము, అన్య పరిచయాలు ఏర్పడవచ్చును. ధనము అనాలోచితముగా ఖర్చు చేసే అవకాశము గలదు. ధనాన్ని కాపాడు కోవడం విజ్ఞుల లక్షణమని తెలుసుకోవాలి. వృధా భ్రమణం, స్వజనులచే దూషింపబడుట, గతంలో పొగడినవారే ఇప్పుడు విమర్శించుట ఆశ్చర్యానికి, వైరాగ్యానికి గురిచేస్తుంది. తమను అభిమానించే వారికి విలువనివ్వకపోవడం, అభిమానించని వారికై పరితపించడం జరుగుతుంది. ఈ విషయంలో ఆశాభంగం కలుగవచ్చును. మే తరువాత పరిస్థితులు అర్థంగాని రీతిలో ఉండును. ఎదుటివారికి సలహాలిచ్చి వారి అభివృద్ధికి కారణమయినవారు తమ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితి ఏర్పడవచ్చును. తనపై తనకు నమ్మకం తగ్గుట జరుగును. మతిమరుపు, కటి నుండి కంఠం వరకు ఒక రకమైన అనారోగ్యం వ్యాధి భయం ఏర్పడవచ్చును. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. బంధుజనముతో విద్వేషాలు ఏర్పడే సూచనలు కలవు. జ్యేష్ఠ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. కాని అందుకు ధనము సర్దుబాటు కొరకు అనేక ప్రయత్నాలు చేయవలసి వచ్చును. పాప కార్యాచరణకై మనస్సు ఆకర్షితమగును. తస్మాత్‌ జాగ్రత్త. మధ్యవర్తిత్వము చేయు సమయమున చాలా ఓపిక, తెలివిగా ప్రవర్తించుట అవసరం. వత్సరాంతమందు కొంత పేరు ప్రతిష్ఠ వచ్చిననూ కేవలం మీచే పనులు తీసుకోవడానికి మిమ్ములను పొగడుచున్నారని గ్రహిస్తారు. వాక్కాఠిన్యము, నాలుక అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామిని ఆదరించండి, వారి మనస్సు గాయపరచకుండా ప్రవర్తించండి. తద్వారా అనేక శుభఫలితాలు పొందండి. శతృవులపై తమదే అధిపత్యమయ్యే విధంగా ప్రవర్తిస్తారు. అందుకు ప్రతిక్షణము జాగ్రత్త పడవలసిన అవసరం గలదు. శతృధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసివచ్చుట, ప్రతి చిన్నపనికైననూ ఎక్కువ మారులు ప్రయాణించుట జరుగును. మందబుద్ధి ఏర్పడే అవకాశములు గలవు. సంపాదన, ఖర్చు సమపాళ్ళలో ఉంటుంది. కళత్ర విచారము. జీవిత భాగస్వామితో తరచూ వివాదములు. గృహంలో ఆశాంతికి మీరు కూడా కారణము కావచ్చును. అందుచేత మౌనేన కలహం నాస్తి అను ధర్మాన్ని పాటించండి. కొంతవరకు మీ తెలివి తేటలతో శతృవులపై ఆధిపత్యాన్ని పొందుతారు. శతృధనాన్ని పొందడం జరుగవచ్చు. భార్యయొక్క లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం పనికిరాదు. నరములకు సంబంధించిన బాధలు ఉండవచ్చును. ఆశాభంగం ఏర్పడవచ్చును. ప్రతి పనియందు తెలియని అసంతృప్తి, ఎంత శ్రమించినా అందవలసిన ఫలము అందకపోవడం, నైరాశ్యానికి గురి చేస్తుంది. నిద్రాభంగం, అకాల భోజనం, ప్రతి పనిని అది పూర్తి అగువరకు రహస్యం పాటించాలి. ఏలినాటి శని చివరి దశ కనుక పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. నమ్మిన వారే మోసం చేసే ఉద్దేశ్యంతో ఉన్నారనే విషయం తెలిసి బాధపడతారు. తమ ఎదురుగా ఒక మాట చాటుగా మరో మాట మాట్లాడే వారిని చూసి లోకంలో ఈ విధమైన మనుషులు కూడా ఉంటారా అనే ఆవేదన ఏర్పడుతుంది. ఏదో తెలియని అసంతృప్తి, నిర్వేదం కాలం వృధాగా నడుస్తున్నదనే భావన. ప్రాణ స్నేహితులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం. కుటుంబంలో ఒక రకమైన అశాంతి. ఈ రాశి ఉద్యోగస్థులకు సంవత్సర ఆరంభంలో కొద్దిపాటి అనుకూలతలు ఏర్పడవచ్చును. ప్రమోషన్లు, ఇంకా అందవలసిన ప్రయోజనాలు పొందడానికి మీ విశేష కృషి అవసరం. ఉద్యోగ స్థాన చలనము సూచనలు కలవు. ప్రతి క్షణము మీ నిజాయితి, మీ నైపుణ్యం చూపించు కొనవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా అందలమెక్కడం ఆశ్చర్యాన్ని, ఆవేదననూ కలుగ చేస్తుంది. మనము కాల భ్రమణంలో ఉన్నాము కనుక తప్పదు. భగవధ్యానము, సజ్జన సాంగత్యంతో ఈ రకమైన ప్రభావాన్ని కొద్దిగా తగ్గించుకొనవచ్చును. ఉపశమనము పొందవచ్చును. ప్రైవేట్‌ సంస్థలలో పనిచేసే వారికి తరచూ ఉద్యోగం మారే స్థితి రావచ్చును. ఒక దగ్గర స్థిరంగా మనస్సు నిలువక పోవడం జరుగవచ్చును. కోపము, ఆవేశం అదుపులో ఉంచుకొనుట శ్రేయస్సునిస్తుంది. ఈ రాశి విద్యార్థులకు ఆరంభంలో అనుకూలంగా ఉన్నది. వృధా భ్రమణం ఊహలలో విహరించడం, కాలయాపన వదలి మీ విద్యపై దృష్టి పెట్టండి. చక్కని ఫలితాలు సాధించగలరు. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ఉత్తముల లక్షణము. విదేశాలలో విద్యకై వెళ్ళువారు విశేష కృషి చేయండి. అందుకు ఇదే తగిన సమయం. అయితే ప్రయాసతో కార్య సాఫల్యం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కాని ఏ ప్రదేశంలో సీటు ఒప్పుకోవాలో నిర్ణయం చేయలేకపోతున్నారు. నిత్యం శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయండి. మేధాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుకోండి. ప్రభుత్వ పరంగా కొంత అనుకూలతగలదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి తాము ఆశించినంత స్థాయి కాకున్నా దానికి తగిన స్థాయి లభించును. విశేషకృషి చేయండి. శని శాంతి చేయండి. దేవీ ఆరాధన చేయండి. అఖండ విజయం సాధించండి. వ్యాపారస్థులు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఒంటరి పోరాటం మానుకొని శ్రేయోభిలాషుల మాట వింటే మంచిది. జీవిత భాగస్వామి కంట నీరు రాకుండా జాగ్రత్తపడండి. అనవసర, అకారణ, అపోహల వల్ల గృహశాంతిని భంగపరచుకోరాదు. నూతన గృహ నిర్మాణం. తమ కల నెరవేరే అవకాశం గలదు. అయితే కొంత ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం గలదు. ప్రస్తుత సమయంలో భవిష్యత్‌ జీవితానికి ఒక గుణపాఠం కాగలదు. ఎవరు తనవారు పరాయి వారేవరో తెలుస్తుంది. సంతానం యొక్క ప్రవర్తన కొంత చిరాకు కల్గించే అవకాశం కలదు. విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. దాంపత్య విభేదాలు, వ్యాపారాలలో లాభాలు ఆశించినంత రాకున్నా ఉన్న ధనాన్ని కాపాడుకుంటే సంపాదించినట్లేనని భావించండి. ప్రయాసచే పనులు పూర్తిచేసే అవకాశం తమ ప్రమేయం లేకున్నా ఎవరో చేసిన పొరపాటుకు తాము భాద్యత వహించవలసిన స్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న ప్రదేశాన్ని వదలి కొత్త ప్రదేశాలలో నివాసం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఏది అవసరమో అది మానివేసి అనవసర విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. సంతాన ప్రాప్తి కలదు. మౌనంతో అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని నిత్యం శని ధ్యానం, గురు,కుజ,రాహు ధ్యాన, జపాదులు మేలు చేయును. గత సంవత్సరం కన్నా కొద్దిగా మార్పు ఉన్ననూ కొద్ది పాటి నియమాలతో జీవితాన్ని సుఖమయంగా మార్చుకొనవచ్చును. వస్త్రదానం, గోసేవ, వృక్షములకు ప్రతిరోజు నీరు పోయండి. మేలు జరుగుతుంది.

    నీచజన సహవాసం వలన ప్రతిష్ఠాభంగం జరుగుట, స్త్రీ పురుషులకు స్నేహం విషయంలో కొంత నియంత్రణ, బాధ్యతలు తెలుసుకొనుట ముఖ్యమైన విషయం. గతం పునరావృతమౌతుందనే భయం వెంటాడవచ్చును. కాని జూన్‌ నుండి బృహస్పతి బలము తోడగుట చేత క్లిష్ట సమస్యలు చివరి నిమిషంలో ఒక శ్రేయోభిలాషి సహకారం చేత తప్పించు కొందురు. వివాహప్రాప్తి గలదు. స్వేచ్ఛావివాహ విషయమై కొంత వివాదము. అనిశ్చిత స్థితి మొదలగు చికాకులు ఏర్పడే అవకావం గలదు. దాచిన సొమ్ము అంతా ఒక చెడు సలహా పాటించుటచే బుడిదలో పోసిన పన్నీరుగా మారే అవకాశం గలదు. స్వబుద్ధి ఉపయోగించండి. ధర్మాధర్మ న్యాయాన్యాయ విచక్షణ చేయండి. చెప్పుడు మాటలు తమ ఆత్మీయులను దూరం చేయవచ్చు. నూతన గృహనిర్మాణ ఆలోచన కలిసివచ్చును. కాని కొద్దిగా అధిక వ్యయం చేత పూర్తి చేస్తారు. సంఘంలో గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. తమ వృత్తిపరమైన పేరు ప్రతిష్ఠ ఏర్పడతాయి. లోకం దృష్టిలో విపరీతంగా పనులలో ఉన్నవారిగా ఉంటారు. కాని దానికి తగిన ప్రతిఫలం మాత్రం లేదని ఆవేదన చెందుతారు. ఎంత కృషి చేసినా రావలసిన ధనము, ఆదాయం రానందున మనోవేదన తీవ్రమౌతుంది. అతి మంచితనం, మోహమాటము మొదలగు లక్షణాలచే పై పరిస్థితులు ఏర్పడుతాయి. కాలం వృధాగా గడిచినదనీ వీలైనంత శీఘ్రముగా ధనం సంపాదించుకోవాలిన, ఆదాయ వనరులు పెంచుకోవాలని విపరీత ప్రయత్నాలు చేస్తారు. పెరు సంపాదిస్తారు. కాని ధనం రావడం సందేహమే, సంతానం భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. వారి భవిష్యత్తుకు కావలసిన పటిష్ట ప్రణాళికలు సిద్ధం  చేసుకుంటారు. దాంపత్య సమస్యలు తీవ్రమయ్యె అవకాశము గలదు. చిన్న విషయము కూడా చిలికి, చిలికి గాలివాన లాగా మారే అవకాశం గలదు. అన్య స్నేహాల వలన తమ పరపతికి మచ్చ ఏర్పడే అవకాశం గలదు. అభిమానించే వ్యక్తులు ఆదరించడం లేదనే బాధ తీవ్రమవుతుంది. ఒకానొక సమయంలో మనసులోని విషయాలు చెప్పలేక, దాచుకోలేక సతమతమవుతారు. అందని ద్రాక్షకై తపించుట అవివేకమని తెలుసుకోవాలి. గతంలో పెట్టుబడిగా పెట్టిన ధనానికి మిశ్రమ ఫలితము దక్కుతుంది. నష్టమైనా, లాభమైనా ఒక సమస్య పరిష్కారమైనందున సంతోషిస్తారు. తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఔషధ సేవనం, ధన వ్యయం జరిగే అవకాశాలు గలవు. విలువైన వస్తువులు భద్రముగా కాపాడుకోవాలి. చోరభయం కలదు. జాగ్రత్త అగ్ని సంబంధమైన ప్రమాదములు. ప్రభుత్వ పరమైన భయము చేయని తప్పుకు ఫలితము అనుభవించుట, దేహ కాంతి తగ్గుటయు, అతికోపము, తమ మాటలచే ఇతరుల మనస్సు గాయపరచుట, శుభ కార్యాచరణకై ధనవ్యయం, మొదలగు సమస్యలు ఎదురయ్యే సూచనలు గలవు. అయితే జూన్‌ నుండి కొంతవరకు ఉపశమనం లభించవచ్చును. కులాచార వర్తనం. గృహలాభం, మృష్టాన్న భోజనము, స్త్రీ స్నేహములు, తద్వారా స్వజన దూషణము, తరచూ అనారోగ్యము, దానికన్నా ఏదో జరుగబోవుచున్నదనే భయం, అకాల భోజనము, అజీర్తి ఏర్పడుట, ధనము చేతికందడంలో అనేక అవరోధములు, మతిమరుపు, హృదయపరమైన అనారోగ్యము, బంధువులతో విరోధములు, స్వజన ద్వేషము, స్త్రీ జన విరోధములు ఏర్పడవచ్చును. తమ సంతానము ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పాతశతృవులు విజృంభించుట సమసిపోయిన సమస్యలు పునరావృతమగుట జరగవచ్చును. ఏలినాటి శని ద్వితీయ భ్రమణం జరుగుచున్నవారికి ధనము సంపాదిస్తారు. భూములు, వాహనాలు, గృహములు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. అయితే దీనితో సమానంగా నరఘోష, పరోక్ష శతృత్వములు, నిందారోపణలు భరించవలసిన స్థితి రావచ్చును. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నతస్థాయి లభించవచ్చును. నామినెటేడ్‌ పోస్టు లభించవచ్చును. విదేశీయోగం తద్వారా ధనలాభం లభిస్తుంది.  ప్రత్యేక శని సోత్ర పారాయణం, గోపూజ వల్ల మేలు జరుగును.

 

 


More Rasi Phalalu 2018 - 2019