తులా రాశి - (2018-2019)

 

తులారాశి -  చిత్త 3,4 (రా,రి)

స్వాతి 1,2,3,4(రూ,రే,రో,తా)- విశాఖ 1,2,3 (తీ,తు,తే)

ఆదాయము 11  వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 2

ఈ రాశి వారికి 11-10-2018 వరకు గురువు 1వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 2వ స్థానంలో తదుపరి వత్సరాంతం 3వ స్థానంలో ఉండును. శని వత్సరమంతా 3వ స్థానంలో, రాహు, కేతువులు 7-03-2019 వరకు 10, 4 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 9, 3 స్థానాల్లో ఉందురు.

    చాలాకాలంగా అనుభవిస్తున్న అవస్థలు దూరమగును. తమపై తమకు ఆత్మ విశ్వాసము, ధైర్యము పెరుగును. గతంలో నిరాదరించినవారు ఆదరించుట, వారే మీ సహాయానికై అర్థించుట జరుగవచ్చును. అది మీకు గర్వంగా పరిణమించవచ్చును. గతంలో మీరు వహించిన సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. మంచి తనానికి అలస్యంగానైనా గుర్తింపు సత్పలితం ఉంటుందని సంతోషపడతారు. కళాకారులకు రెండవ ప్రయత్నంగా ఫలితము దక్కవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, కాని లభించిన ఉద్యోగం సంతృప్తి నివ్వకపోవచ్చును. అయినా కొద్ది రోజులు ఓపికతో ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో వృత్తిలో పోటీ మాత్రము పెరుగుతుంది. నిలబడటానికి చేసే ప్రయత్నము ఫలిస్తుంది. సామాజిక, రాజకీయ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులను కలుస్తారు.   ఆధ్యాత్మికంగా ప్రముఖస్థానంలో ఉన్న గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఉదర, కటి క్రింది భాగపు అనారోగ్య సమస్యలు బాధించవచ్చును. కొన్ని సందర్భాలలో మిమ్ములను ఇష్టపడే వ్యక్తులను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడతారు. సంతానం యొక్క అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మీరు శ్రమిస్తున్న కృషికి ఫలితందక్కుతుంది. ఎక్కువగా రహస్యాలను అవలంభిస్తారు.

    గతం చాలా రోజుల నుండి అనుభవిస్తున్న అవస్థలు కొంతవరకు ఉపశమించినట్లు కనిపించినా ఇంకా ఫలితము చేతికి అందకపోయే సరికి ఒక విధమైన కంగారు ఏదో తెలియని అభద్రతా భావము ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో ఏ విధమైనటువంటి సాహస నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. సహనము, ఓర్పు ఇవి అలవరచుకోవాలి. చాలా కాలంగా ఉన్న సహనానికి ఒక పరీక్షా సమయము ఎదురుకావచ్చు. కాని మిమ్ములను అనేక విధాలుగా రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీరు చేసే పొరపాటును తమకు అనుకూలంగా త్రిప్పుకునే ప్రయత్నాలు జరగవచ్చు. తస్మాత్‌ జాగ్రత్త. పనిభారము మానసిక వత్తిడి పెరగవచ్చును. సహోద్యోగులు తమ క్రింద పనిచేసే వారు తమ మాటను పూర్తిగా వినక, పై అధికారులకు జవాబు చెప్పలేక సతమతమవుతారు. గృహంలో కూడ ఒక విధమైన సహకార లోపం ఏర్పడవచ్చును. క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశము అనర్థాలకు హేతువు కావచ్చును. వాహనములు నడుపునపుడు పరధ్యానము, అజాగ్రత్త ఏ మాత్రం శ్రేయస్సు కాదు. ఇంటర్నెట్‌ ఉపయోగంలో కూడా నియంత్రణ అవసరము. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితము. తమను ఎక్కువగా ఇష్టపడే వారిని నిర్లక్ష్యము చేయడం, నిర్లక్ష్యం చేసేవారికోసం వెంటపడడం, వారికి అనేక విధాలుగా సహాయమందించడం చేస్తారు. కాని తమ ప్రయత్నానికి గుర్తింపుగాని, ఫలితముగాని ఉండకుండా పోతుంది. తమ పరభేదాన్ని గుర్తించండి.  అనుబంధాలకు విలువనివ్వండి. ఎండమావులకై ఆరాటపడకండి. బంధువులతో అకారణ ద్వేషాలు, వివాదాలు చిరాకు కల్గిస్తాయి. తమ ప్రయత్నాలలో ఫలితము చేతికందినట్లే అంది జారిపోవడం మానసిక వ్యధకు కారణ మవుతుంది. విలాసవంతమైన, ఖరీదైన గృహోపకరణాలు, అలంకార వస్తువులు అప్పు చేసైనా కొనుగోలు చేస్తారు. ఎదుటివారి ముందు తాము ఏమిటో నిరూపించుకోవాలనే ప్రయత్నం  చేస్తారు. విషమ పరిస్థితులలో కూడా తమ ఆత్మ విశ్వాసమును ధైర్యాన్ని తగ్గనీయరు. ఆకలితో ఉన్నా సింహం గడ్డితినదని, మీ ప్రవర్తన ద్వారా నిరూపిస్తారు. స్త్రీ విబేధాలు కనపడుచున్నవి. సంవత్సరము ఉత్తరార్థంలో వివాహ ప్రయత్నాలు సఫలము కావచ్చును. కుల దేవతారాధన చేస్తారు. అనుగ్రహము పొందుతారు. ధనం సంపాదించినట్లు కనపడినా చేతిలో అవసరానికి ధనం ఉండదు. లోకం దృష్టిలో ధనవంతులు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. నరఘోష విపరీతంగా ఉన్నది. శతృవులపై ఆధిపత్యానికై వారిని అదుపు చేయడానికై అనేక విధాలుగా ప్రయత్నించాల్సి వస్తుంది. స్థిరాస్థి అమ్మకానికి  పెడతారు. అయితే అప్రయత్నం కొంత వాయిదా పడవచ్చు.  స్థిరాస్థిని తప్పని పరిస్థితులలో అయిష్టముగా అమ్మకానికి పెట్టవలసిన పరిస్థితులు రావచ్చును. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. మీ ముందు నిలబడే అర్హతలేనివారు కూడా మీకు సలహాలు ఇవ్వడము ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు చర్యలు ఉండరాదు. కొందరికి తమ స్వయంకృతాపరాధములే రావలసిన ప్రమోషన్లు రాకపోవడం తమకన్నా తక్కువస్థాయివారు అందల మెక్కడం మనో వేదనకు కారణం అవుతుంది. అధికారుల నుండి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. ఎవరో చేసిన తప్పకు తాము సంజాయిషీ చెప్పవలసిన స్థితి ఏర్పడుతుంది. చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు దరికి చేరకుండా ముందే గ్రహించి దూరం ఉంచండి. ప్రలోభాలకి లొంగి ప్రతిష్టను భంగపరచుకోవద్దు. ఊహలు తారు మారు కావచ్చును. గృహములో ఏదో తెలియని అశాంతి. బంధువుల అనారోగ్యము అరిష్ట సూచనలు. ఆస్తులు వివాదాస్పదమగుట, వంశపారంపార్య ఆస్తుల విషయంలో కలహాలు, కోర్టు గొడవలు కోరికలు పూర్తిగా పరిష్కారమవును.

    ఈ విధమైన గ్రహస్థితి పరిశీలించగా సంవత్సరము పూర్వార్థము అన్ని విధాలుగా యోగదాయకముగా ఉంటుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న అవస్థలనుండి ఉపశమనము లభించే అవకాశము గలదు. జీవితములో అనేకమైన అనుభవాలు, ఉచితానుచితాలు తాము చూసిన, నమ్మిన మనుష్యులు మొదలైన అనేక విషయాలపై ఒక స్థిరమైన పారదర్శకమైన ఆలోచన దారి మీకు కనపడుతుంది. గోముఖ వ్యాఘ్రములను గుర్తిస్తారు. వారిని ద్వేషంతో కాకుండా మంచితనంతో దూరం ఉంచాలని నిర్ణయిస్తారు. జీవితాశయము నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాదాపుగా సఫలమవుతారు. ఊహలలో విహరించడం మానుకొని తమ, పర భేదము తెలుసుకొని, హోదా ధనంతో మంచితనాన్ని మంచి స్నేహాన్ని పొందలేమని గ్రహిస్తారు.

    స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఎవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు, అవమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శతృవులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. వారు తీసుకున్న గోతిలో వారే పడేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. అవివాహితులకు చక్కని వివాహ సంబంభాలు నిశ్చయము అవుతారు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతాన ప్రాప్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి పరిచయాలు ఏర్పడుతాయి. మీకు ఉన్నత గౌరవాలు స్థాయి దక్కుతుంది. విలువైన విలాస వంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలు అవలంభించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన అనవసరమైన  కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు. అదనపు, భాద్యతలు నిర్వహించవలసి వస్తుంది. పని తీవ్రత, వత్తిడి పెరిగే అవకాశము గలదు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి (ప్రమోషన్‌) ఎదుగుతారు. నూతన వాహనాలు సమకూర్చుకుంటారు. చరాస్తులు వృద్ధి పరుచుకుంటారు. ప్రేమ వివాహాలు సఫలము కావచ్చును. నూతనంగా వ్యాపారపరంగా భూములపై బంగారంపై లేదా షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. తమ సంతానానికి వారి భవిష్యత్తుకై పటిష్టమైన ప్రణాళికను సిద్ధంచేసి అమలు పరుస్తారు.

    శని ప్రభావము వలన అనేక విషయాలలో మీదే పై చేయి అవుతుంది. గతంలో విమర్శించిన వారు ప్రశంసిచడం చూసి ఆశ్చర్యపడతారు. మీ అంచనాలకు మించి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శతృవులు స్తబ్ధులై ఉంటారు. సుఖ, సౌఖ్యాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. జీవిత భాగస్వామితో చక్కని అనురాగ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. శయ్యాసౌఖ్యము లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసిన ప్రయోజనాలను అందుకుంటారు. రాజకీయ లబ్ధి, పరపతి ఏర్పడుతుంది. నూతన గృహనిర్మాణానికై మీరు చేయు కృషి ఫలిస్తుంది. మీ వృత్తికి తగిన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన ఖరీదైన జీవితము గడిపే అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశము గలదు. వ్యాపార భాగస్వాములపై మీదే పై చేయిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము సఫలమౌతుంది. తనకు మాలిన ధర్మం చేయరాదని శాస్త్ర వచనం ఈ విషయాన్ని అక్షరాలా పాటించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంటా ఉంటాయి. గతంలో మధ్యలో వదలివేసిన పనులను మళ్ళీ ఆరంభిస్తారు. గతంలోని మీ ప్రవర్తనకు ప్రస్తుత ప్రవర్తనకు తేడాను చూసి మీరే ఆశ్చర్యపడతారు. గతంలో ఏర్పడిన కోర్టు వివాదాలు, కేసులు మొదలైన వాటిని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. అత్యుత్సాహంతో పేరు ప్రతిష్టల కొరకు వెనకా, ముందు ఆలోచించక వృధాగా ధనాన్ని దుర్వినియోగపరిచే అవకాశాలున్నాయి. నూతన ఉద్యోగంలో కొంత పని వత్తిడి, అసంతృప్తి ఉంటుంది. చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.     

    గోసేవ, మహాలక్ష్మి స్తోత్ర, శ్రీ సుందరకాండ పారాయణం, శని, రాహు, కేతు కుజ ధ్యాన శ్లోకాలు పఠించుట వల్ల మేలు జరుగుతుంది. వృద్ధులకు సహకరించండి. మాతాపితరులను గౌరవించండి.

 

 


More Rasi Phalalu 2018 - 2019