మనసే అన్నింటికీ మూలం


శారదామాత! భారతీయ తత్వ చింతనలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడైనా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే స్థాయి ఆధ్మాత్మిక ఉన్నతిని సాధించిన సందర్భాలు తక్కువ. ఆ స్థితికి గొప్ప ఉదాహరణగా నిలిచారు రామకృష్ణ పరమహంస, ఆయన సతీమణి శారదాదేవి. ప్రపంచం దృష్టిలో వారు భార్యాభర్తలే కావచ్చు. కానీ రామకృష్ణుల దృష్టిలో శారద సాక్షాత్తూ కలకత్తా కాళిక. మరి ఆమె దృష్టిలో ఆయన తన కైవల్యసిద్ధికి దారిచూపే కారణజన్ముడు. శారదామాతకు చదువు అంతంతమాత్రంగానే అబ్బింది. అందుకని ఆమె పుస్తకాలు రాసింది ఏమీ లేదు. పైగా పల్లెటూరి జీవితంతో పాటు వచ్చిన బిడియం ఆమెలో ఉండనే ఉంది. అయినా రామకృష్ణులు మరణించిన తరువాత, ఆయన శిష్యులలో ధైర్యాన్ని నింపడంలో ఆమెది ముఖ్య పాత్ర. శిష్యులంతా చెల్లాచెదురైపోకుండా వారిని సంఘటితం చేసిన భూమిక ఆమెది. ఒకవైపు రామకృష్ణులు అందించిన జ్ఞానం, మరోవైపు తన ఆంతరంగంలో దర్శించిన సత్యం ఆధారంగా... శారదామాత, రామకృష్ణుని శిష్యులందరికీ 34 ఏళ్ల పాటు మార్గదర్శనం చేశారు. ఆ సమయంలో ఆమె చెప్పిన మాటలను, చేసిన బోధలను తపస్యానంద వంటి భక్తులు అక్షరబద్ధం చేశారు.

 

శారదా మాత తరచూ, మనసు చేసే మాయ గురించి మాట్లాడేవారు. ‘మనసే అన్నింటికీ మూలం. దర్శించే ప్రతి విషయాన్నీ ఇది మంచి, ఇది చెడు అంటూ బేరీజు వేసేది మనసే. అందుకని ఎదుటివారిలో తప్పులనే వెతకాలనుకుంటే ముందు నీ మనసే దోషపూరితం అయిపోతుంది,’ అని ఒక సందర్భంలో అంటారు. అంతేకాదు శారదామాత చివరి సందేశం కూడా ఇంచుమించు ఇలాగే సాగింది- ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. అందుకు బదులుగా మీ లోపాలేమిటో గ్రహించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా దానిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ ప్రపంచమే మీది అనుకున్నప్పుడు... అంతా మనవారే అన్న భావన కలుగుతుంది.’ ఏమైనా అమ్మ అమ్మే! అందుకే ప్రపంచంలోని వారంతా తన బిడ్డలేననీ, వాళ్లంతా ఒకరిలో ఒకరు తప్పులు వెతుక్కుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉండాలనీ కోరుకుంది. అందుకే శారదాదేవి కాస్తా శారదామాతగా భక్తుల గుండెల్లో నిలిచిపోయింది. రామకృష్ణులు ఆమెను కాళికకు ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది! తనలోని మాతృభావనను ఈ ప్రపంచం మొత్తానికీ విస్తరించాలనుకునే ప్రతి తల్లీ కాళికామాతే కదా!

- నిర్జర.

 


More Good Word Of The Day