వేంకటేశ్వరుడు, పద్మావతిల కల్యాణమంటే సిరికి, హరికి కల్యాణమే. కనులకు పండుగ, మనసుకు వేడుక. వేంకటేశ్వరుడు పీత వస్త్రాలు ధరించి, మెడలో కౌస్తుభం, ముత్యాల హారం, చేతికి ఉంగరాలు, తలపై వజ్ర కిరీటం, రత్న ఖచిత కవచకుండలాలు శోభిస్తుండగా నుదుట నామాలు ధరించి మన్మధునిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. బ్రహ్మచారిగా కల్యాణ వజ్రములతో కూడిన బంగారు యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ముఖాన దిష్టిచుక్క, పాదాలకు బంగారు పాముకోళ్ళు... ఇలా నవ వరుడి రూపంలో ఉన్న వేంకటేశ్వరుని చూసి పెళ్లి పెద్దలు తన్మయులయ్యారట.

వేంకటేశ్వరుని వివాహ వేడుకంటే మాటలా? ఆకాశమంత పందిరి, భూదేవి అంత కల్యాణ మండపం సిద్ధమయ్యాయి. శుకమహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు విచ్చేశారు. కన్నతల్లి వకుళాదేవి ముఖంలో కోటి ప్రభలు వెలిగాయి. యశోదగా ఆనాడు కోరిన వరం ఇప్పుడు సఫలమైంది కదా, అని సంతోషించింది.

పద్మావతి కిరీటం మధ్యలోంచి రత్నాల పాపిడిసేరు , రెండువైపులా సూర్యచంద్రవంకలు, వజ్రాల జడబిళ్ళలు గుచ్చిన జడకు నవరత్నాలు పొదిగిన జడ గంటలు, ముఖాన కస్తూరి తిలకం, నాసికకు నవ మౌక్తికాల ముక్కుపుడక, కళ్ళకు కస్తూరి గంధ కాటుక, చెవులకు అందాల జూకాలు, నడుముకు శంఖచక్రాకార వడ్డాణం, మెడలో సుందర హారాలు, చేతులకు రవ్వల గాజులు, పాదాలకు మంజీరములు, మణి సవ్వడుల కింకిణీ రవళులు ఇలా నఖశిఖ పర్యంతం అలంకారాలతో మెరిసిపోతోంది. అరచేతుల్లో గోరింటాకు, పాదాలకు పారాణి, ముఖాన దిష్టిచుక్క సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్నాయి. ఎర్రటి పట్టు వస్త్రంతో అలరారుతున్న ఈ పెళ్లికూతురిని చూసి ముక్కోటి దేవతలు మురిసిపోయారు.


More Venkateswara Swamy