నారద జయంతి ప్రత్యేకత!

 

హైందవ పురాణాలలో నారదుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. సకలశాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు అయిన నారదుడు ఆవతరించింది వైశాఖ బహుళ విదియ (27 మే, 2021) నాడు. ఈ
సందర్భంగా ఆ స్వామి విశిష్టతను తల్చుకునే ప్రయత్నం చేద్దాం.

 నారదుని జన్మరహస్యం భాగవతంలో కనిపిస్తుంది. తను బ్రహ్మమానస పుత్రుడినని నారదుడే స్వయంగా వ్యాసునికి చెబుతాడు. నారదుడు హరి భక్తుడు. ఆ హరినామస్మరణతోనే ముల్లోకాలనూ సంచరిస్తూ గడుపుతూ ఉంటాడు. ఎక్కడెక్కడి కబుర్లనో వార్తాహరుడిలా చేరవేస్తుంటాడు. నారదుడకి కలహభోజనుడనే పేరు అందరికీ తెలిసిందే! అక్కడి మాటలు ఇక్కడా, ఇక్కడి మాటలు అక్కడా చేరవేయడమే కాకుండా… ఆ మాటలతోనే మంటలను రాజేయడం తన ప్రవృత్తి. కానీ అందుకు ఫలితంగా జరిగే గొడవలన్నీ కూడా లోకకళ్యాణానికి దారి తీయడం విశేషం. పురాణాలలో హిరణ్యకశిపుడిలాంటి ఏ రాక్షస వధ చూసినా,
సత్యభామలాంటి ఏ దేవత గర్వభంగాన్ని చూసినా… వాటి వెనుక నారదుని హస్తమే కనిపిస్తుంది.

నారదుడు భక్తుడే కాదు… మహా పండితుడు కూడా! ఆయన రచించిన నారదపురాణం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం. అందులో మంత్రాలు, పుణ్యక్షేత్రాలు, వ్రతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో ఉన్న అసంఖ్యాకమైన మంత్రాల వల్ల ఈ పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు.

నారదమహర్షిచే రూపొందించబడిన నారదభక్తి సూత్రాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. 84 సూత్రాలుగా ఉన్న ఈ రచనను భక్తియోగానికి మార్గదర్శకంగా భావిస్తుంటారు. పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించే ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి పరీక్షలను ఎదుర్కోవాలి… లాంటి ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించారు నారదముని. తొమ్మిది అధ్యాయాలుగా ఉన్న ఈ భక్తిసూత్రాలను భక్తివేదాంత ప్రభుపాదుల వారు ఐదు అధ్యాయాలుగా క్రోడీకరించి ప్రచారంలోకి తీసుకువచ్చారు.

 

నారదుని కలహభోజనం, అతని బోధలు మాత్రమే కాదు… ఆయన జీవితంలో జరిగాయని చెప్పుకొనే అనేక గాథలు కూడా అరుదైన జీవిత పాఠాలు చెబుతాయి. ఈ ముల్లోకాల్లో తనే నిజమైన భక్తుడినని
విర్రవీగిన నారదుని చేతిలో ఓ నూనె గిన్నె ఉంచి నామస్మరణ చేయమన్న విష్ణుమూర్తి కథ అందరికీ తెలిసిందే. మరో సందర్భంలో ఓ చెప్పులు కుట్టేవాడి ద్వారా… నారదునికి నిజమైన భక్తి తత్వాన్ని
వివరిస్తారు నారాయణుడు.

ఇంత విశిష్టమైన నారదముని అవతరించిన రోజు కూడా ప్రత్యేకమే కదా! వాద్య సంగీతానికి ముఖ్యమైన వీణను అవిష్కరించింది నారదులవారే అని చెబుతారు. అందుకని ఈ రోజున వీణను దానం చేసే
సంప్రదాయం కూడా ఉంది. సంగీత రంగంలో ఉన్నవారు… ఈ రోజు ఆ స్వామిని తల్చుకుంటే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు భక్తియోగానికి ప్రతీక అయిన నారదమహర్షిని
తలచుకునేందుకు, ఆయన గ్రంథాలను చదివేందుకు అనువైన సందర్భం!

- మణి 


More Purana Patralu - Mythological Stories