ప్రహ్లాదుని శీలం

 

మనిషికి నడవడి ఎంత ముఖ్యమో నిరూపించేందుకు మన పురాణాలలో ప్రహ్లాదునికి సంబంధించిన ఓ కథ కనిపిస్తుంది. రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు... తండ్రి అభీష్టానికి విరుద్ధంగా హరిభక్తునిగా మారడమూ, అతడిని ఆదుకుని హిరణ్యకశిపుని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహావతారాన్ని ధరించడమూ అందరికీ తెలిసిందే! తండ్రి మరణానంతరం ప్రహ్లాదుడు రాజయ్యాడు. ప్రహ్లాదుడు మహారాజైనా సకలసద్గుణవంతుడు. సౌశీల్యానికి ప్రతినిధి. ఆఖరికి అతని సౌశీల్యానికి ఇంద్రపదవి కూడా ప్రహ్లాదుని వశం అయ్యింది.


ప్రహ్లాదుని చేతిలో పదవిని కోల్పోయిన ఇంద్రునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లాడు. ప్రహ్లాదుని దగ్గర నుంచి ఇంద్రపదవిని చేజిక్కించుకునే మార్గం తెలుపమని కోరాడు. కానీ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని ఓడించేందుకు తన దగ్గర ఏ ఉపాయమూ లేదని తేల్చేశాడు బృహస్పతి. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని శరణువేడితే, ఆయన నుంచి ఏదన్నా ఉపాయం దక్కవచ్చునన్న సలహాను మాత్రం అందించాడు.


బృహస్పతి సలహాను అనుసరించిన ఇంద్రుడు, శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి తన గోడుని వెళ్లబోసుకున్నాడు. ఇంద్రుని మొరను విన్న శుక్రాచార్యుడు సాలోచనగా- ‘నా శిష్యునికి అపకారం కలిగేలా నేను ఎలాంటి పనీ చేయబోను. అయితే దీనికి ఒక మార్గం లేకపోలేదు. ప్రహ్లాదుడు దానశీలి. కాబట్టి నువ్వే నేరుగా వెళ్లి అతను నిన్ను జయించడానికి కారణం ఏమిటో కనుక్కో. ఆ లక్షణాన్ని అతని నుంచి దానంగా సంపాదించు,’ అంటూ సెలవిచ్చాడు.


ఇంద్రునికి శుక్రాచార్యుని ఉపాయం బాగానే తోచింది. కాకపోతే నేరుగా ప్రహ్లాదుని వద్దకు వెళ్లకుండా ఒక బ్రాహ్మణుడి రూపంలో అతని చెంతకు చేరుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేస్తూ తగిన విశ్వాసాన్ని సంపాదించాడు. ప్రహ్లాదునికి తనమీద తగినంత నమ్మకం కలుగగానే ఒకరోజు మాటలలో మాటగా- ‘ప్రహ్లాదా! మహామహులకే సాధ్యం కాని ఇంద్రపదవిని నువ్వు సులువుగా సాధించడానికి కారణం ఏమిటి?’ అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు చిరునవ్వుతో- ‘బ్రాహ్మణోత్తమా! నేను రాజునన్న గర్వంతో ఎప్పుడూ అహంకరించలేదు. సాయం కోరినవాడి కోరికను ఎన్నడూ నిరాకరించలేదు. మనసు మీద ఎన్నడూ పట్టుని వీడలేదు. అంతటి శీలసంపన్నత కారణంగానే నేను ఇంద్రపదవిని సాధించగలిగాను,’ అంటూ పేర్కొన్నాడు.


ప్రహ్లాదుని మాటలను విన్నంతనే ఇంద్రుడు ‘రాజా! దయచేసి నువ్వు నీ శీలసంపదను నాకు దానం చేయవా,’ అని అర్థించాడు. తనను ఎవరు ఏది అర్ధించినా కాదనకుండా అందించే ప్రహ్లాదుడు తన శీలగుణాన్ని ఇంద్రునికి అర్పించాడు. మరుక్షణమే ప్రహ్లాదుని నుంచి ఒక తేజోమూర్తి వెలువడింది. ఆ విలక్షణ రూపాన్ని చూసి ప్రహ్లాదుడు ‘అయ్యా ఎవరు మీరు!’ అని అడిగాడు. అంతట ఆ రూపం- ‘నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఇంద్రునికి దానం చేశావు కాబట్టి, నేను నీనుంచి విడివడి వెళ్లిపోతున్నాను,’ అని బదులిచ్చి సాగిపోయింది. ప్రహ్లాదుని నుంచి ఆ తేజోరూపం వెడలిపోయిన వెంటనే మరో రూపం ప్రహ్లాదుని మేను నుంచి బయటకు వచ్చింది. ‘తను ధర్మాన్ననీ, శీలం లేని చోట ధర్మం ఉండటం అసాధ్యమనీ’ చెప్పుకొచ్చింది. ధర్మం వెలువడిన తరువాత సత్యం, సత్యాన్ని అనుసరించి రుజువర్తన, రుజువర్తనకి తోడుగా బలం ప్రహ్లాదుని వీడిపోయాయి.


చివరగా అతిలోక సౌందర్యవతి అయిన స్త్రీరూపం అతని నుంచి వెలువడింది. ఆమెని చూసిన ప్రహ్లాదుడు సంభ్రమంగా ‘తల్లీ నువ్వెవరు!’ అని అడిగాడు. ‘రాజా! నేను లక్ష్మిని. శీలం, ధర్మం, సత్యం, రుజువర్తన, బలం ఎక్కడ ఉంటాయో... నేను అక్కడే ఉంటాను. ఈ లక్షణాలన్నీ నీ నుంచి నిష్క్రమించాయి కాబట్టి ఇక నీ వద్ద నేనుండలేను,’అంటూ సాగిపోయింది. ప్రహ్లాదుడు తరువాత కాలంలో ఆ గుణాలన్నింటినీ తిరిగి సంపాదించాడనుకోండి. అయితే మనిషికి నడవడి ఎంత ముఖ్యమో... దానిని అనుసరించి ఏఏ లక్షణాలు ఉంటాయో ఈ కథ తెలియచేస్తోంది.

 

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories