కాశీ వైశిష్యం - నిత్య హారతులు

 


ఈ నెల 17వ తారీకు మహా శివరాత్రి.  పరమ శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఆలయ దర్శనం, పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు చేసే పవిత్రమైన రోజు.  తెలిసి చేసినా తెలియక చేసినా ఇలాంటి పుణ్యప్రదమైన రోజున శివుడికి చేసే ఏ సేవలైనా అద్భుత ఫలితాలనిస్తాయంటారు. మరి మనంకూడా ఈ శివరాత్రి సందర్భంగా భోళా శంకరుడు, భక్త సులభుడు, అయిన  ఆ మహా శివుడి సృష్టి అయిన కాశీ క్షేత్రం గురించీ, అక్కడ విశ్వనాధుడికీ, గంగమ్మతల్లికీ నిత్యం జరిగే హారతులగురించీ తెలుసుకుందామా?

కాశీ…ఆ పేరు చెబితేనే ఏ హిందువుకైనా మనసు ఉప్పొంగుతుంది.  ఆ క్షేత్రాన్ని దర్శించనివారు ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అని తహతహలాడుతారు.    జీవితంలో ఒక్కసారైనా ఎంతో పుణ్యప్రదమైన కాశీని దర్శించి, పావన నదీమతల్లి గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరునికి మనసారా అభిషేకం చేసి, అమ్మ విశాలాక్షిని కుంకుమతో అర్చించి, అన్నపూర్ణాదేవిని దర్శించి ఆశీర్వాదం పొందాలని హిందువైన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.  కొందరైతే తమ జీవిత తుది సమయంలో కాశీలో గడిపి, అక్కడే ప్రాణాలొదలాలనుకుంటారు.   ఎందుకో తెలుసా  పురాణోక్తి ప్రకారం  “కాశ్యాంతు మరణాత్ ముక్తి”   కాశీలో మరణించినవారికి అంతిమ సమయంలో సాక్షాత్తూ పరమేశ్వరుడే చెవిలో ఉపదేశం చేస్తాడుట.  దీనితో వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందిట.  ఈ నమ్మకం మనవారిలో ప్రగాఢంగా వుండటంతో, అవకాశం వున్నవారు తమ జీవిత చరమాంకంలో కాశీలో గడుపుతుంటారు. కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు.  అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం.  కాశీకి ఏ కారణంవల్లనైనా వెళ్ళలేనివారు కాశీకి వెళ్తాము అనిగాని, వెళ్ళాలి అనిగానీ అనుకున్నా చాలుటు పుణ్యం రావటానికి.

కాశీ వైశిష్ట్యం
కాశీ గురించిన అనేక విశేషాలు  వేదవ్యాస మహర్షి విరచిత పురాణాలలో వివరంగా ఇవ్వబడ్డాయి.  వీటిలో స్కంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం ముఖ్యమైనవి. ఈ కాశీ క్షేత్రం పరమ శివునికి చాలా ప్రీతిపాత్రమయింది.   ఆయన ఎల్లవేళలా ఈ క్షేత్రాన్ని విడువకుండా వుంటాడు.  అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని, అవిముక్తేశ్వరం అనీ అంటారు.  బ్రహ్మచే సృష్టింపబడిన దేవతలందరూ మహా శివుని సేవించుటకు కాశీక్షేత్రంలో నివసిస్తుంటారు. ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి సృష్టి సమస్తం నాశనమవుతుందికానీ  ఈ కాశీ క్షేత్రానికి ఎలాంటి ఇబ్బందీ వుండదు.  కారణం ఇది బ్రహ్మదేవుని సృష్టి కాదు.  దీని సృష్టికర్త సాక్షాత్తూ పరమ శివుడు. కాశీలో అనేక దేవతలు, ఋషులు, ఇంకెందరో మహనీయులు తాము పూజ, తపస్సు చేసుకోవటంకోసం శివ లింగాలను ప్రతిష్టించారు.  అలాంటి లింగాలు కాశీ క్షేత్రంలో ఎన్నున్నాయో తనకి కూడా తెలియదని పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఒక సందర్భంలో చెప్పాడుట.  ఇంతటి పుణ్యక్షేత్రం ఇంకొకటి వుంటుందా!?  ఇప్పటికీ అక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేసుకుంటూ వుంటారు. 



సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది.  బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే.  ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు  ఇక్కడ విద్యాభ్యాసం చేశారు.  మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు.  ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. ఇంత అద్భుతమైన క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తనివితీరదు.  ప్రస్తుతం గంగమ్మ తల్లికి, విశ్వనాధునికి ఇచ్చే హారతుల గురించి తెలియజేస్తాను.

గంగ హారతి
రోజూ సాయంత్రం 7 గంటలకి దశాశ్వమేధఘాట్ లో రెండుచోట్ల గంగమ్మతల్లికి హారతి ఇస్తారు. ప్రతి సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు.  తర్వాత గంగ ఒడ్డున మెట్లమీద నుంచీ, ఒక్కో చోటా 7గురు చొప్పున హారతి ఇస్తారు.  45 నిముషాలుపాటు సాగే ఈ హారతి దృశ్యం కన్నులపండుగగా వుంటుంది.  దీనిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు.  టూరిస్టులను ఆకర్షించటానికి  ఒక ప్రత్యేక సౌకర్యం...  బోట్ లో గంగలోంచి హారతి చూడవచ్చు.  అంటే గంగ ఒడ్డున పడవలన్నీ కట్టేస్తారు.  కొంత డబ్బిస్తే ఆ పడవల్లో కూర్చుని హారతి చూడవచ్చు.  పడవకి డబ్బులంటారా, బేరమాడటంలో మీ ప్రతిభ బయటపడేది ఇలాంటిచోట్లేనండీ.  ఒకళ్ళిద్దరున్నా ప్రత్యేక పడవకి రూ. 200 నుంచీ, హారతి మొదలయ్యే సమయానికి మనిషికి రూ. 20 చొప్పున కూడా ఎక్కించుకుంటారు.  హారతి జరిగినంతసేపూ పడవ కదలదు.  తర్వాత దానికీ కదలటం వచ్చని నిరూపించటానికి అలా తిప్పి తీసుకొస్తారు.  ఏదైనా పడవలోంచి హారతి ఎదురుగా చూడవచ్చు.  అదే మెట్ల మీదనుంచి అయితే వెనకనుంచో, పక్కనుంచో చూడాలి.

హారతి సమయంలో గంగ ఒడ్డున దీపాలకి గిరాకీ ఎక్కువ.  యాత్రీకులంతా మగ, ఆడ తేడాలేకుండా తాముకూడా ఒడ్డున అమ్మే పూలు, దీపాలు కొని గంగకి హారతి ఇవ్వటానికి ఉత్సాహ పడతారు.   దీపాల వెలుగులతో కళ కళలాడే ఆ సంబరం చూసి తీరాలి.

విశ్వేశ్వరునికి నిత్య హారతులు

శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో స్వామికి నిత్య హారతులు మూడు.  మొదటిది తెల్లవారుఝామున 3 గంటలనుంచి 4 గంటల మధ్య ఇచ్చేది.  దీనికి టికెట్ రూ. 501 అన్నారు.  మేము ఈ హారతి చూడలేకపోయాము.  అందుకని వివరించలేను. ఇంక రెండవది సప్తఋషి హారతి.  ఇది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో వుంటుంది.  (సమయం కొంచెం అటూ ఇటూ అవుతుంది.  ముందు కనుక్కోండి).  దీనికి టికెట్ రూ. 51.  హారతి మొదలు పెట్టే ముందు టికెట్ లేని వాళ్ళని బయటకి పంపుతారుగానీ హారతి మొదలు కాగానే అందరూ వస్తారు.  టికెట్ వున్న వాళ్ళని 4 గుమ్మాల దగ్గర (విశ్వనాధుని గర్భగుడి చిన్నగానే వుంటుంది.  దానికి నాలుగు ద్వారాలు) నాలుగు బల్లలు వేసి ఆ బల్లల మీదా, గుమ్మంలోనూ కూర్చోబెడతారు.  గుమ్మంలోనో, బల్లమీద మధ్యలోనో కూర్చున్నవారు అదృష్టవంతులు.  మిగతావారికి అన్ని వైపులనుంచీ తోపుళ్ళు తప్పవు. అప్పుడు దర్శనానికి వచ్చేవాళ్ళు (బహుశా అక్కడ నివసించేవారనుకుంటా) ఒక్కసారి చూసెళ్తాం అని అడ్డొచ్చేస్తూవుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ సప్త ఋషి హారతిలో సప్త ఋషులకు ప్రతినిధులుగా ఏడుగురు పండితులు స్వామికి అభిషేకం, అర్చన చేసి హారతి ఇస్తారు.  ఈ హారతి సమయంలో అందరూ గంటలు ఎంత లయ బధ్ధంగా వాయిస్తారంటే, మనం కొంచెం మనసు లగ్నం చేస్తే, ఆ పరమ శివుని ఆనంద తాండవం కళ్ళముందు గోచరిస్తుంది.  అంత తన్మయత్వంలో మునుగుతాము.  ఆ అపురూపమైన అనుభవాన్ని కాశీకి వెళ్ళినవాళ్ళెవరూ వదులుకోవద్దు.  అది అనుభవించవలసినదే.          
హారతి పూర్తి అయిన తర్వాత ఆ పండితులంతా నాలుగు వైపులకూ వచ్చి, స్వామికి వేసిన పూల మాలలు, తీర్ధం బయట వున్న భక్తులకందరికీ ఇచ్చి దక్షిణ స్వీకరిస్తారు.

మూడవ హారతి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత సేజ్ హారతి వుంటుంది.  ఈ రెండు హారతుల మధ్యా, రాత్రి సేజ్ హారతి తర్వాత 11 గంటలదాకా స్వామి దర్శనం వుంటుంది.  హారతుల సమయంలో గర్భగుడి లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వరు. సేజ్ హారతి దాదాపు గంట సేపు వుంటుంది.  ఇందులో స్వామికి అభిషేకం (ఒక బిందె పాలు, రెండు బిందెల నీళ్ళు ఒక్కసారి కుమ్మరించారు).  స్వామికి పూలమాలలు అలంకరించటం ఎక్కువసేపు వుంటుంది.  అలంకరణ  తర్వాత పెద్ద నాగాభరణం వెండిది పెడతారు.  5 వత్తులతో 2 రకాల హారతులు, తర్వాత కర్పూర హారతి ఇస్తారు.  ఈ హారతి సప్త ఋషి హారతి అంత ప్రభావితంగా వుండదు.  కానీ ఇదీ చూడదగ్గది.  దీనికీ టికెట్ రూ. 51.  ఈ హారతి తర్వాత కూడా పూజారులు బయటకి వచ్చి అందరికీ తీర్ధం ఇస్తారు.  మేము వెళ్ళినప్పుడు ఈ హారతి తర్వాత రెండు పెద్ద పళ్ళాలలో స్వామికి పరవాణ్ణం నైవేద్యం పెట్టి అక్కడున్నవారందరికీ ప్రసాదం పెట్టారు.

ఇవండీ స్వామి హారతుల విశేషాలు.  మీరు కాశీకి వెళ్ళినప్పుడు సప్తఋషి హారతి చూడటానికి తప్పకుండా సమయం కేటాయించుకోండి.


- పి.యస్.యమ్. లక్ష్మి



More Maha Shivaratri