గురుపౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా!

 

 

ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే! వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించడంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం రాక మానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏమిటంటే...

వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వాటితో పాటు... భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులూ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా! అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదనీ... అది ఓ బిరుదనీ అంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, వారిని వ్యాసుడని పిలిచేవారట. బహుశా అందుకేనేమో... వ్యాసుని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు, సాక్షాత్తూ ఆ వ్యాసుని రూపాలే కదా! అందుకనే ప్రతి వ్యాసపౌర్ణమి రోజునా, మన కంటి ముందు కనిపించే గురువులను దైవస్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము.

వ్యాసపౌర్ణమినాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాలలో కనిపిస్తుంది. పూర్వం వారణాసిలో ‘వేదనిధి’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు ‘వేదవతి’. ఆ దంపతలకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని, తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. వేదనిధి భక్తికి మెచ్చిన వ్యాసులవారు, ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. వ్యాసుల వారిని విడిచివెళ్తూ ‘మేము కోరుకున్నప్పుడ్లలా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా?’ అని వ్యాసుని అడిగాడట వేదనిధి. ‘జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటాననీ... అలాంటి గురువులను, తన జన్మదినమైన వ్యాసపౌర్ణమినాడు పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని’ వ్యాసులవారు చెప్పారట. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమినాడు గురువులను ఆ వ్యాసభగవానుగా తలచి కొలుచుకునే ఆచారం వస్తోంది.

గురుశిష్య పరంపరకు సంబంధించి కూడా వ్యాసపౌర్ణమి నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునే! శివుడు, దక్షిణామూర్తిగా మారి సప్తర్షులకు ఉపదేశం చేసిందీ ఈ రోజునే! జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే! చాతుర్మాసవ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే! గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే... నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకొంటారు.
వ్యాసపౌర్ణమిని గురుపౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట!

- నిర్జర.

 

 


More Guru Purnima