యూరప్ లేబొరేటరీ ముందు శివుని విగ్రహం!

 

 

CERN – ఈ పేరు భారతీయులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ మన జీవితాలని మార్చిపారేసిన వెబ్సైట్ (WWW – world wide web) గురించైతే మనకి అవగాహన ఉంది కదా! జీవానికి మూలకారణం అని శాస్త్రవేత్తలు చెప్పే ‘దైవకణం’ గురించీ మనం తరచూ వింటూ ఉన్నాము కదా. ఈ రెండు ప్రముఖ ఆవిష్కరణలు జరిగిన సంస్థే CERN.

స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న CERN సంస్థది 62 ఏళ్ల చరిత్ర. ఫ్రెంచి భాషలో దీనిపేరు Conseil Européen pour la Recherche Nucléaire. అంటే ఐరోపా అణుపరిశోధనా సంస్థ అని అర్థం. అణువుల మీద లోతైన అధ్యాయం చేసేందుకు ఐరోపాలో ఉన్న దేశాలన్నీ కలిసి ఏర్పరుచుకున్న సంస్థ ఇది. వారి ఆశలకు అనుగుణంగానే CERN అనేక ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. 2004లో ఈ కేంద్రం వద్ద మరో ఆకర్షణ చోటు చేసుకుంది.

 

2004, జూన్ 18న జెనీవాలోని భారతీయ రాయబారి CERN ప్రాంగణంలో ఓ ఆరడుగుల నటరాజస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక అణపరిశోధనా సంస్థ ముందు హైందవుల దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించడం ఏమిటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. భారతదేశం తమ సంస్థకు ఎంతోకాలం నుంచీ సహాయసభ్యునిగా ఉన్నందువల్ల, వారి బహుమతిని స్వీకరించామంటూ CERN వివరణ ఇచ్చింది. కానీ ఊహించని విధంగా ఎందరో శాస్త్రవేత్తలు, CERN ప్రాంగణంలో శివుని విగ్రహం ఓ అద్భుతమైన ప్రతీక అంటూ ప్రశంసించారు.

CERNతో అనుబంధం ఉన్న ‘అయడాన్ రాండిల్’ అనే శాస్త్రవేత్త ‘శివుని నీడలో’ అంటూ ఓ పెద్ద వ్యాసమే రాశారు. ‘ఈ ప్రపంచంలో శక్తి, పదార్థాల కలయికతోనే సృష్టి సాధ్యమవుతోంది. వాటి కారణంగానే వినాశనమూ జరుగుతోంది.... ఈ విశ్వం నిరంతరం తాండవిస్తోందని చెప్పేందుకు శివుని విగ్రహం ఓ ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాదు! ఈ అనంతవిశ్వంలో మనకి తెలియని సృష్టి రహస్యాలు చాలా ఉన్నాయన్న వాస్తవాన్నీ ఆ శివుని విగ్రహం గుర్తుచేస్తూ ఉంటుంది,’ అంటూ తన వ్యాసంలో రాసుకొచ్చారు అయడాన్!

 

 

ఆధునిక విజ్ఞానానికీ, ప్రాచీనుల జ్ఞానానికీ మధ్య సంబంధం ఉందని విశ్వసించే ‘ఫ్రిట్జాఫ్ కాప్రా’ అనే శాస్త్రవేత్త కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘మనుషులు పుడుతూ గిడుతూ ఉంటారు. రుతువులు కూడా ఒకదాని తరువాత ఒకటి వలయంగా వస్తూ ఉంటాయి. కానీ ఈ సృష్టిలోని ప్రతి పదార్థానికీ కూడా ఇలాంటి ఒక క్రమం ఉంటుందనీ, ఆ క్రమ పద్ధతి ప్రకారమే ఈ విశ్వం నడుస్తోందనీ ఆధునిక విజ్ఞానం చెబుతోంది. శివుని తాండవం సృష్టిలోని ఆ లయతత్వాన్ని సూచిస్తోంది,’ అంటున్నారాయన.

మొత్తానికి CERN సంస్థ ముందు నటరాజస్వామి విగ్రహం ఉండేందుకు శాస్త్రవేత్తలెవ్వరికీ అభ్యంతరాలు లేకపోగా... ఈ సృష్టిని ముందుకు నడిపిస్తున్న లయతత్వానికి ప్రతీకగా భావిస్తున్నారు. దానిని నాస్తికులు కాస్మిక్ డాన్స్ అని పిలిచినా, ఆస్తికులు దైవసంకల్పం అని నమ్మినా... ప్రకృతిలోని ఆ నిగూఢశక్తి వల్లే ఈ విశ్వం నిలిచి ఉంటోందని నమ్మక తప్పడం లేదు!

-నిర్జర.

 


More Shiva