పిల్లలకు నేస్తం – బాలగణేశుడు

భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఆయనను వివిధ రూపాలలో ఎందుకు ధ్యానిస్తారు అన్నది ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో తొలిచే ప్రశ్నే! దానికి పెద్దలు చెప్పే జవాబు ఒక్కటే. మనుషులందరికీ ఒకేలాంటి వ్యక్తిత్వం, కోరికలు, జీవన విధానాలు ఉండవు కదా! అందుకే ఎవరికి వారు తమ ప్రవృత్తికి అనుగుణమైన రూపాన్ని కొలుచుకుంటారు. మనకి వందలాది దేవతలు మాత్రమే కాదు, ఆ దేవతలకి సైతం వివిధ రూపాలు ఉంటాయి.

 

ఉదా: గణేశునే తీసుకుంటే ఆయనకు 32 రూపాలు ఉన్నాయని కొన్ని పురాణాలు, కాదు 21 ఉన్నాయని మరికొన్ని శాస్త్రాలూ, లేదు పదహారే అని మరికొన్ని సూత్రాలూ చెబుతున్నాయి. ఏవి ఎలా చెప్పినా మనకి సకల అభీష్టాలనూ ఒసగే ఆ విఘ్ననాయకుని తలచుకునేందుకు, భక్తితో కొలుచుకునేందుకు ప్రతిరూపమూ విశిష్టమైనదే! అలాంటి ఒక రూపమైన బాలగణేశుని గురించి ఇప్పుడు చెప్పుకుందాం…

గణేశుని తల్చుకునే ప్రతివారికీ ఆయన జన్మవృత్తాంతమే మొదట గుర్తుకువస్తుంది. అలా చిన్ననాటి గణేశునిగా ఉండే రూపమే ‘బాలగణేశుడు’. మరి పిల్లలంటే చేతిలో తీపిపదార్థాలు లేకుండా ఉంటాయా. అందుకే బాలగణేశునికి నాలుగు చేతులుండగా వాటిలో అరటిపండు, చెరుకుగడ, మామిడి పండు, పనసతొన (లేక పూలరెమ్మ) ఉంటాయి. ఇవి ఆ వినాయకుని భోజనప్రియత్వాన్ని మాత్రమే సూచించవు. నానాఫలపుష్పాలతో నిండిన ఈ ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుతూ ఉంటానన్న అభయాన్ని కూడా అందిస్తాయి. పంటలు సమృద్ధిగా పండేందుకు దోహదపడతానని ఆయన చేతిలో ఉన్న చెరుకుగడ సూచిస్తుంది.

ఇక మోదకప్రియుడైన ఆ గణేశుని వద్ద మోదకం లేకుండా ఉంటుందా? మరి నాలుగు చేతుల్లోనూ నాలుగు రకాల పదార్థాలు ఉన్నాయి కదా! అందుకని తొండంతో మోదకాన్ని పట్టుకుని కనిపిస్తాడు బాలగణేశుడు. బాల్యం అంటే అప్పుడే ఉదయిస్తున్న జీవితానికి చిహ్నం కదా! అందుకే బాలగణేశుడు ఉదయించే సూర్యుని రంగులో (ఎరుపు/బంగారు వర్ణం) దర్శనమిస్తాడు. వృద్ధికీ, సమృద్ధికీ, ప్రశాంతతకీ ఈ బాలగణేశుని పూజించినప్పటికీ… పిల్లలు కనుక ఈ బాలగణేశుని పూజిస్తే వారి బాగోగులను చేసుకుంటాడని నమ్మకం. పిల్లల్లో బుద్ధి వికసించేందుకు, వారిలో విజ్ఞానం పెంపొందేందుకు, మంచి నడవడి అలవడేందుకు, బాలారిష్టాలతో కూడిన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆడుతూపాడుతూ బాల్యాన్ని గడిపేందుకు బాలగణేశుడు తోడ్పడతాడట.

తమిళనాడులో గణేశుని పిల్లైయార్‌గానే పిలుచుకుంటారు. అంటే శివపార్వతుల పుత్రుడు అని అర్థం. ఇక 18వ శతాబ్దంలో వెలువడిన శ్రీతత్వనిధి అనే గ్రంథంలో అయితే బాలగణేశుని ఇలా స్తుతించారు.
కరస్థకదలీచూత పనసేక్షుకమోదకమ్‌।
బాలసూర్యమివం దేవం బాలగణాధిపమ్‌॥
‘అరటిపండు, మామిడి, పనస, చరకు, మోదకాలను ధరించి బాలసూర్యునిలా వెలిగిపోతున్న ఓ గణేశుడా… నీకు వందనం!’ మనం కూడా ఆ శ్లోకాన్ని ఒక్కసారి ధ్యానించుకుని ఆ బాలగణేశుని మనసులో నింపుకొందాం…

- నిర్జర.




More Vinayakudu