కౌరవులకు వ్యతిరేకంగా పోరాడిన కౌరవుడు

 

మహాభారతం అన్న మాట విన్నవెంటనే కొన్ని పాత్రలు స్ఫురిస్తాయి. కొన్ని అభిప్రాయాలు గుర్తుకువస్తాయి. కానీ మనం కనీవినీ ఎరుగని పాత్రలు ఆ ఇతిహాసంలోని ప్రతి అధ్యాయంలోనూ ఉన్నాయి. మన అభిప్రాయాలను భగ్నం చేసే పరిస్థితులూ కనిపిస్తాయి. అలాంటి ఒక పాత్ర పేరే ‘యుయుత్సుడు’. కౌరవులంతా చెడ్డవారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేసే పాత్ర యుయుత్సునిది. అది ఇలా సాగుతుంది...

 

గాంధారి, దృతరాష్ట్రుని ద్వారా వందమంది పుత్రులను పొందాలన్న వరాన్ని పొందే విషయం తెలిసిందే! అయితే గాంధారి తన ద్వారా సంతానాన్ని పొందుతుందో లేదో అన్న సందేహంలో ఉన్న దృతరాష్ట్రుడు... సుఖద అనే ఓ చెలికత్తె ద్వారా బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరే యుయుత్సుడు! అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు, ఇటు సుఖద కుమారుడు యుయుత్సుడు ఒకే సమయంలో జన్మిస్తారు. అంటే! హస్తినాపుర రాజ్యం మీద దుర్యోధనునికి ఎంత అధికారం ఉందో యుయుత్సునికి కూడా అంతే అధికారం ఉంది. కానీ దుర్యోధనుడు అంత ఉదారంగా ఆలోచిస్తాడని భావించలేం కదా! యుయుత్సుడిని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు. అయినా అది యుయుత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సకల విద్యలూ నేర్చకుని, సకల ధర్మాలూ ఔపోసన పట్టి అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు. అసలు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం!

 

కౌరవుల ఆగడాలను మొదటి నుంచీ గమనిస్తూ ఉన్నవాడే కాబట్టి, యుయుత్సునికి వారి మీద అసహ్యం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! అందుకని ఎప్పుడైతే ధర్మయుద్ధం మొదలైందో నిస్సంకోచంగా పాండవుల పక్షాన నిలిచేందుకు సిద్ధపడతాడు యుయుత్సుడు. అంతేకాదు! పాండవులను హతమార్చేందుకు కౌరవలు పన్నే పన్నాగాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ ఉంటాడు. ఒక రకంగా రామాయణంలో విభీషణుడు ఎలాంటివాడో, భారతంలో యుయుత్సుడు అలాంటివాడన్న మాట! కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలచి యుయుత్సుడు చేసిన యుద్ధం చిరస్మరణీయమైనది.

 

ధర్మపక్షాన నిలిచినందుకు యుయుత్సునికి తగిన ఫలితమే దక్కుతుంది. ఆ మహాసంగ్రామంలో కౌరవులంతో అసువులు బాయగా ఒక్క యుయుత్సువు మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు. ఆ మాటకి వస్తే కేవలం కౌరవులలో మాత్రమే కాదు... యోధానుయోధులు సైతం నేలకొరిగిన ఆ యుద్ధానంతరం ప్రాణాలతో మిగిలిన 12 మంది ప్రముఖులలో యుయుత్సుడు ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కొన్నేళ్లపాటు హస్తినను ఏలిన పాండవులు స్వర్గారోహణానికి బయల్దేరతారు. వెళ్తూ వెళ్తూ హస్తినాపురానికి రాజుగా అర్జునుడి మనవడైన పరీక్షిత్తుని నియమిస్తారు. ఆ పరీక్షిత్తునికి పాలనలో తగిన సాయం చేసే బాధ్యతను యుయుత్సునికి అప్పగించి మరీ వెళ్తారు పాండవులు. అలా భారతంలో యుయుత్సుని కథ సుఖాంతమవుతుంది.

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories